వామ్మో.. మల్లెపూలతో ఇన్ని లాభాలా..?

ABN , First Publish Date - 2021-10-18T02:22:02+05:30 IST

మల్లెపూల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్బులు, తలనూనె, సౌందర్య సాధనాల్లో కూడా మల్లెపూలను వాడుతున్నారు. అలాగే సుంగంధ మొక్కల ద్రవ్యాలతో చేసే అరోమాథెరపీలోనూ మల్లె పూలను వాడతారు.

వామ్మో.. మల్లెపూలతో ఇన్ని లాభాలా..?

మల్లెపూలంటే మనకు టక్కున సువాసన గుర్తొస్తుంది. ఇక మహిళలు అయితే.. మల్లెపూలు కనబడితే వెంటనే జడలో పెట్టుకుంటారు. అంతేగానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. మల్లెపూలు సువాసన అందించడంతో పాటూ ఔషధంగా కూడా పని చేస్తాయట. ఈ పూలను ఏ విధంగా వాడితే.. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో.. ఇప్పుడు చూద్దాం..


మల్లెపూల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్బులు, తలనూనె, సౌందర్య సాధనాల్లో కూడా మల్లెపూలను వాడుతున్నారు. అలాగే సుంగంధ మొక్కల ద్రవ్యాలతో చేసే అరోమాథెరపీలోనూ మల్లె పూలను వాడతారు. కళ్లు అలసటగా ఉన్న సమయంలో మల్లెపూల రసంతో కంటి చుట్టూ మర్దన చేసుకుని పడుకుంటే ఉపశమనం లభిస్తుంది. అలాగే తాజా మల్లెలను మెత్తగా నూరి, తడిబట్టతో చుట్టి కళ్లమీద పెట్టుకుంటే, కళ్లలో నీరు కారడం, తడి ఆరిపోవడం వంటి సమస్యలను దూరం చేస్తుంది. నంపుసకత్వం, శీఘ్రస్కలన సమస్యల పరిష్కారానికి కూడా మల్లెపూలు ఉపకరిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మల్లెపూల రసాన్ని, గులాబీల రసంతో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది. చర్మానికి అవసరమయ్యే విటమిన్-సి మల్లెపూలలో పుష్కలంగా దొరుకుతుంది.


మల్లెల్లోని సువాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. మల్లెల కషాయంతో కళ్లమంటలు, నొప్పులు తగ్గుతాయి. మల్లె పూలు, ఆకులతో కషాయం కాచి, వడగట్టి చల్లార్చాలి. అనంతరం రెండు వంతుల కషాయంలో ఒక వంతు నువ్వులనూనె, కొబ్బరినూనె, ఒక స్పూను బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలకు మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. కోపం, డిప్రెషన్ తదితర సమస్యలను దూరం చేసే స్వభావం మల్లెపూలకు ఉంది. సువాసన వెదజల్లే పూలను తల దిండు పక్కన పెట్టుకుని పడుకుంటే.. మనసు స్థిమితమై హాయిగా నిద్ర పడుతుంది. మధుమేహులు మల్లెపూలతో చేసిన టీ తాగితే మంచిది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే గుణం వీటికి ఉంటుందట.


కొబ్బరినూనెలో మల్లెపూలను రోజంతా నానబెట్టి, తర్వాత కాచి వడగట్టాలి. చల్లారాక తలకు మర్దనా చేసుకుంటే జుట్టు కుదుళ్లకు పోషకాలు అందుతాయి. అదేవిధంగా కొబ్బరినూనెతో మల్లెపూల రసాన్ని కలిపి తలకు రాసుకుంటే.. మంచి సువాసన వస్తుంది. చుండ్రుతో బాధపడేవారు మల్లెపూల రసాన్ని మెంతులతో కలిపి తలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. మొటిమల వల్ల వచ్చే మచ్చలు పోగొట్టడంలోనూ మల్లెలు ఉపకరిస్తాయి. అంతేకాదు మల్లెపూలతో చేసిన పలు ఔషధాలు శరీరంపై ఏర్పడే కణితులను కూడా నివారిస్తాయని పరిశోధనల్లో తేలింది. మహిళలకు రుతుస్రావంలో తలెత్తే సమస్యలను కూడా ఇవి తగ్గిస్తాయట. అలాగే గర్భిణులకు సుఖ ప్రసవం అయ్యేందుకు ఇవి ఎంతో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2021-10-18T02:22:02+05:30 IST