Abn logo
Aug 2 2020 @ 03:09AM

ఇంట్లోనే చదువులు

  • బడులు తెరిచే వరకూ సర్కారు ఆన్‌లైన్‌ బాట
  • డీడీ యాదగిరి, టీశాట్‌, రేడియో ద్వారా బోధన
  • గ్రామీణ విద్యార్థులకూ అందుబాటులోకి సాంకేతికత
  • 5న కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకునే చాన్స్‌
  • ప్రీ ప్రైమరీ విద్యపైనా విధానపరమైన ప్రకటన! 
  • సచివాలయ భవన నిర్మాణం నమూనాకు తుదిరూపు
  • వైరస్‌ టెస్టుల పెంపు, ఎమ్మెల్సీ సీట్ల భర్తీపైనా చర్చ 
  • అన్నదాతలకు ‘తీపికబురు’ ఉంటుందా?


హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): కరోనాతో రెండు నెలలుగా తెరుచుకోని బడులు.. బోధన లేక నష్టపోతున్న విద్యార్థులు! మరి, పిల్లల చదువులు ఎలా? విద్యా సంవత్సరాన్ని జీరో ఇయర్‌గా ప్రకటిస్తారా? అన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తారా? ఇలా ఎన్నో సందేహాలతో సతమతమవుతున్న తల్లిదండ్రులకు ఊరట లభించనుంది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పిల్లలకు ఇంట్లోనే బోధన జరిగేలా ‘నూతన ఆన్‌లైన్‌ విద్యా విధానం’ ప్రవేశపెట్టాలని సర్కారు  భావిస్తోంది. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా పూర్తి సాంకేతికతను అందుబాటులోకి తెచ్చి ఈ విధానాన్ని ప్రకటిస్తారు. ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై విద్యాశాఖ నియమించిన ఉన్నత స్థాయి కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందించింది. ఈ మేరకు దూరదర్శన్‌ యాదగిరి, టీశాట్‌ చానళ్లు, ఆల్‌ ఇండియా రేడియో ద్వారా ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు అనుమతించవచ్చని సమాచారం. ఈ మేరకు 5వ తేదీన సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 2గంటలకు మంత్రిమండలి సమావేశం కానుంది.


ఇందులో కరోనా నేపథ్యంలో అమలు చేయాల్సిన ‘నూతన ఆన్‌లైన్‌ విద్యా విధానం’పైన కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సచివాలయ భవన సముదాయం, నియంత్రిత పద్ధతిలో వ్యవసాయం, కరోనా వ్యాప్తి, నివారణకు తీసుకుంటున్న చర్యలు, ఇంకా చేపట్టాల్సిన చర్యలు, కేంద్రం ప్రకటించిన విద్యా విధానం, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ సీట్ల భర్తీ తదితర అంశాలపైనా చర్చిస్తారు. సాధారణంగా జూన్‌ రెండో వారంలోనే విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ కొనసాగింపు నేపథ్యంలో ఈసారి పాఠశాలలు, కళాశాలలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం లేదు. మరోపక్క ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌ తరగతులను ఎప్పుడో మొదలుపెట్టాయి.


ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో ఇప్పటికీ అడ్మిషన్ల ప్రక్రియ కొలిక్కి రాలేదు. ఆన్‌లైన్‌ తరగతులకు అనుమతులిద్దామంటే వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ ప్రాంత విద్యార్థులకు ఇబ్బందులు లేకపోయినా.. గ్రామీణ ప్రాంతాల్లో  ఇంటర్నెట్‌ సౌకర్యం, మొబైల్‌ ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో అక్కడి విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని కోర్టు సహా మేధావి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ దృష్ట్యా ఆన్‌లైన్‌ విధానాన్ని ఎలా అమ లు చేయాలి? ఇందుకు ఏ మాధ్యమాలను ఎంచుకోవాలన్న విషయమై కేబినేట్‌లో చర్చించనున్నారు.  


సమగ్ర నిబంధనలతో 

 సమగ్ర నిబంధనలతో ఆన్‌లైన్‌ విద్యా విధానాన్ని సర్కారు ప్రకటించనుంది. ప్రీ ప్రైమరీ విద్యపై కూడా నిర్ణయాన్ని వెల్లడించనుంది. ప్రభుత్వ రంగంలోనూ నర్సరీ, కిండర్‌ గార్డెన్‌ విద్యను అమలు చేయాలన్న ప్రతిపాదన ఉంది. ప్రీ ప్రైమరీ కింద ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ దృష్ట్యా ప్రీ ప్రైమరీ విద్యపై విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. 

 

‘సచివాలయం’ నిర్మాణానికి తుదిరూపు! 

సచివాలయానికి సమీకృత భవన సముదాయాన్ని నిర్మించే అంశంపై కేబినెట్‌లో చర్చిస్తారు. ఇప్పటికే అక్కడ భవనాల కూల్చివేత దాదాపు పూర్తయింది. నిర్మాణ సామగ్రిని యుద్ధ ప్రాతిపదికన తరలిస్తున్నారు. కొత్త భవనానికి నమూనా కూడా ఖరారైనా సీఎం కేసీఆర్‌ కొన్ని మార్పులు సూచించారు. ఈ మార్పులతో భవన నమూనాకు తుదిరూపు రానుంది. దీనికి కేబినేట్‌ భేటీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  ఇక ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీలోనే విజృంభించిన కరోనా వైరస్‌ ఇప్పుడు జిల్లాల్లోనూ ప్రతాపాన్ని చూపుతోంది. దీంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేబినెట్‌ చర్చించనుంది. రెండు మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 21 వేల టెస్టులు చేస్తున్నారు. వీటి సంఖ్యను 25 వేల నుంచి 30 వేలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై కేబినేట్‌ నిర్ణయం తీసుకుంటుంది. త్వరలో రైతులకు మరో తీపి కబురు చెబుతామంటూ గతంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీనిపై కేబినేట్‌లో ఏదైనా నిర్ణయం వెలువడవచ్చు. 


ఎమ్మెల్సీ సీట్ల భర్తీపై చర్చ

రాష్ట్రంలో ఖాళీ అయిన, అవుతున్న ఎమ్మెల్సీ సీట్లపై కేబినెట్‌ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు గవర్నర్‌ కోటా సీట్లు ఖాళీ అయ్యాయి.  మరో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ స్థానం ఈ నెల 17న ఖాళీ కానుంది. ఈ మూడు గవర్నర్‌ కోటా సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది. 

Advertisement
Advertisement
Advertisement