ఒక్క ఏడాది డిగ్రీ చదివినా సర్టిఫికెట్‌!

ABN , First Publish Date - 2021-10-14T13:11:25+05:30 IST

డిగ్రీ చదువుల్లో..

ఒక్క ఏడాది డిగ్రీ చదివినా సర్టిఫికెట్‌!

రెండేళ్లు చదివితే డిప్లొమా.. మూడేళ్లకు డిగ్రీ, నాలుగేళ్లకు ఆనర్స్‌

డిగ్రీ కోర్సుల్లో మార్పులపై కసరత్తు

క్రెడిట్‌ సిస్టమ్‌ అమలుపై అధ్యయనం

21, 22 తేదీల్లో వీసీల సమావేశం

కాన్సెప్ట్‌ పేపర్‌ ఖరారు చేసే అవకాశం

ఎన్‌ఈపీ అమలుపై ఉన్నత విద్యామండలి దృష్టి


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): డిగ్రీ చదువుల్లో మరిన్ని మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ముఖ్యంగా డిగ్రీలో చేరి మధ్యలోనే మానేసే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఒక్క ఏడాదిపాటు డిగ్రీ కోర్సు చదివినా సర్టిఫికెట్‌ ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. రెండేళ్లు చదివితే డిప్లొమా, మూడేళ్లు పూర్తిగా చదివితే ఎప్పటిలాగే డిగ్రీ పట్టాను ఇస్తారు. అదే నాలుగేళ్ల డిగ్రీ అయితే... మొత్తం కోర్సు పూర్తయ్యాక ఆనర్స్‌ డిగ్రీ ఇస్తారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యావిధానంలో కీలక అంశాల అమలుపై అధికారులు కసరత్తును మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 21, 22 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని యూనివరిట్సీల వైస్‌ చాన్సలర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో నూతన విద్యా విధానం అమలుపై చర్చించి ఒక కాన్సెప్ట్‌ పేపర్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది. నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టడంపై సమావేశంలో దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ కోర్సుల ద్వారా ఉద్యోగాలతోపాటు విదేశాల్లో ఉన్నత విద్య చదవడానికి అవకాశాలు మెరుగవుతాయని అంచనా వేస్తున్నారు. 


ఈ కోర్సుల్లో క్రెడిట్‌ సిస్టమ్‌ను అమలుచేయాలని భావిస్తున్నారు. దీనివల్ల  విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు ఫిజిక్స్‌, హిస్టరీ, బోటనీ కూడా కలిపి తీసుకోవచ్చు. ఏ దశలో చదువు మానేసినా ఒక సర్టిఫికెట్‌ ఇచ్చేలా ఈ విధానాన్ని అమలుచేయాలని భావిస్తున్నారు. ఏవైనా కారణాల వల్ల మధ్యలో చదువు ఆపేసినవారు, తర్వాత కాలంలో ఆపేసిన దగ్గర నుంచే కోర్సు కొనసాగించే అవకాశం ఉంటుంది. అయితే ఈ విధానం అమల్లో సాధ్యాసాధ్యాలను పూర్తిగా పరిశీలించాకే నిర్ణయం తీసుకోనున్నారు.


స్థానిక అవసరాలకు అనుగుణంగా కోర్సులు

స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని కోర్సులను రూపొందించడంపై అధికారులు దృష్టిపెట్టారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో టెక్నాలజీ ఉపయోగం పెరిగినందున అగ్రికల్చర్‌ వర్సిటీల్లో సంబంధిత కోర్సులు పెట్టాలనే సూచనలు వస్తున్నాయి. తద్వారా స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇతర రంగాల్లో కూడా కొత్త అవకాశాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించాల్సి ఉంది. ఎన్‌ఈపీ అమల్లో భాగంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో వేరే కోర్సులను ప్రారంభించడానికి అవకాశాలను అంచనా వేస్తున్నారు. నాన్‌ ఇంజనీరింగ్‌ కోర్సులను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అలాగే అన్ని యూనివర్సిటీలు, కాలేజీల్లో అన్ని రకాల కోర్సులను ప్రవేశపెట్టే అంశాన్ని కూడా వీసీల సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

Updated Date - 2021-10-14T13:11:25+05:30 IST