వ్యాక్సినేషన్‌ తీరుపై సబ్‌కలెక్టర్‌ అసహనం

ABN , First Publish Date - 2021-10-27T06:22:50+05:30 IST

కంచికచర్లలో ఐదు వేల మంది టీకాలు వేయించుకోని వారుంటే కేవలం సచివాలయం-3 పరిధిలో మూడు వేల మంది ఉండటంపై సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌ అసహనం వ్యక్తం చేశారు.

వ్యాక్సినేషన్‌ తీరుపై సబ్‌కలెక్టర్‌ అసహనం
కంచికచర్లలో వ్యాక్సినేషన్‌పై సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌ ఆరా..

వేయించుకోని వారిని గుర్తించి టీకాలు వేయాలని అధికారులు, సిబ్బందికి ప్రవీణ్‌చంద్‌ ఆదేశం

కంచికచర్ల రూరల్‌, అక్టోబరు 26: కంచికచర్లలో ఐదు వేల మంది టీకాలు వేయించుకోని వారుంటే కేవలం సచివాలయం-3 పరిధిలో మూడు వేల మంది ఉండటంపై సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌ అసహనం వ్యక్తం చేశారు. కంచికచర్లలోని సచివాలయం-3లో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి సుహాసినితో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీకాలు వేయించుకోని వారిని గుర్తించి తక్షణమే వేయించు కునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముందుగా  వ్యాక్సినేషన్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. 


సమస్యల ఏకరువు

సబ్‌ కలెక్టర్‌ వచ్చారని తెలుసుకున్న గ్రామస్థులు సమస్యలను ఏకరువు పెట్టారు. మంచి నీరు సక్రమంగా సరఫరా కావటం లేదని, తాగునీరు కలుషితమ వుతుందని, రేషన్‌ కార్డుల జారీలో జాప్యం జరుగుతుం దన్న సమస్యలను విన్నవించారు. స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్‌ రాజకుమారి, ఎంపీడీవో శిల్ప, పీహెచ్‌సీ వైద్యాధికారి దీప్తి, కార్యదర్శి రవికుమార్‌, ఆర్‌ఐ శిరీష, తదితరులు  పాల్గొన్నారు. 


నూరు శాతం లక్ష్యంగా పనిచేయాలి

 - ఆర్డీవో రాజ్యలక్ష్మి

ముసునూరు : కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ప్రజలకు ఉన్న అపోహలను తొలిగించి, నూరు శాతమే లక్ష్యంగా పనిచేయాలని రెవెన్యూ డివిజనల్‌ అధికారిణి కె.రాజ్యలక్ష్మి వలంటర్లను ఆదేశించారు.  ముసునూరులోని పీహెచ్‌సీ, గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రాలను మంగళవారం ఆర్డీవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పై అధికారుల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్‌ అన్‌లైన్‌ ఆప్‌లోడ్‌ విషయంలో సచివాలయ సిబ్బందిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.  రైతుభరోసా కేంద్రంలో రైతులకు అందిస్తున్న సేవలపై  ఆరాతీశారు. ఆర్‌బీవీలు మీకు ఉపయుక్తంగా ఉన్నాయా....అన్ని సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారా అని రైతులను అడిగితెలుసుకున్నారు. అనంతరం పీహెచ్‌సీలో రికార్డులను పరిశీలించి రోగులకు అందిస్తున్న వైద్యసదుపాయాలపై ఆరాతీశారు. ప్రసవాల సంఖ్యను పెంచేలా వైద్యులు, అధికారులు కృషి చేయాలన్నారు. పేద ప్రజలు అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ అసుపత్రికి వస్తుంటారని, వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్డీవో అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎం.పాల్‌, ఇన్‌చార్జి ఎంపీడీవో సాయిరాం, ఏవో బి.శివశంకర్‌, వైద్యులు శ్రీనివాస్‌, కార్యాదర్శి ఆరేపల్లి వెంకటేశ్వరావు, వీఆర్వో మస్తాన్‌రావు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-27T06:22:50+05:30 IST