నీట మునుగుతున్న పంటలు

ABN , First Publish Date - 2022-07-11T05:58:10+05:30 IST

జిల్లాలో కురుస్తున్న భారీ వ ర్షాలతో రైతన్నలకు తీవ్ర నష్టమే కలుగుతోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కొందరు రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా మరికొందరి రైతుల పంటలు నీట మునుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.

నీట మునుగుతున్న పంటలు
పెద్దకొడప్‌గల్‌లో నీటమునిగిన సోయాపంట

జిల్లాలో 2వేల ఎకరాల్లో నీట మునిగిన సోయా

మూడు రోజుల పాటు వరద నీటిలోనే సోయా పంట

తీవ్రంగా నష్టపోతున్న రైతులు

భారీ వర్షాలకు పలుచోట్ల కూలిన ఇళ్లు

జిల్లా వ్యాప్తంగా 97.2 మి.మీ వర్షపాతం నమోదు

అత్యధికంగా నస్రూల్లాబాద్‌లో 138.2 మి.మీ కురిసిన వర్షం


కామారెడ్డి, జూలై 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కురుస్తున్న భారీ వ ర్షాలతో రైతన్నలకు తీవ్ర నష్టమే కలుగుతోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కొందరు రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా మరికొందరి రైతుల పంటలు నీట మునుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించడం, ఆ వరద పంట పొలాల్లోనే నిలిచిపోతుండడంతో ఆరుతడి పంటలు నీట మునుగుతున్నాయి. జుక్కల్‌ డివిజన్‌ ప్రాంతంలో ఎక్కువగా ఆరుతడి పంటలు నీట మునుగు తుండడంతో రైతులు నష్టపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 97.2మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నస్రూల్లాబాద్‌లో 138.2మి.మీ వర్షం కురిసింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించడంతో జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు అప్రమత్తమై ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

సుమారు 2వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు

జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ భారీ వర్షాలకు పలు మండలాల్లోని ఆరుతడి పంటలతో పాటు వరి పైరు సైతం వరద నీటిలో మునిగిపోయింది. ప్రధానంగా సోయా పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జుక్కల్‌ నియోజకవర్గంలోని మద్నూర్‌, బిచ్కుంద, పెద్దకొడప్‌గల్‌, నిజాంసాగర్‌, పిట్లం తదితర మండలాల్లో ఆరుతడి పంటలైన సోయా, పత్తి, మినుములు, పెసర్లు, కందులు సా గు చేస్తుంటారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సో యా వరద నీటిలోనే ఉండిపోతోంది. సుమారు 2వేల ఎకరాలకు పై గా సోయా మూడు రోజులుగా వరద నీటిలోనే మునిగిపోవడంతో ఆ పంట చేతికి రాదని ఇటు రైతులు అటు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మరికొన్నిచోట్ల పత్తి, వరి పైరు సైతం వరద నీటికి మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా 97.2 మి.మీ వర్షపాతం నమోదు

జిల్లాలో గడిచిన 24 గంటల్లో 97.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నస్రూల్లాబాద్‌లో 138.2 మి.మీ వర్షం కురిసింది. లింగంపేటలో 68.2మి.మీ, బాన్సువాడలో 131.8, తాడ్వాయిలో 81.4, పిట్లం లో 54.4, ఎల్లారెడ్డిలో 97.6, సదాశివనగర్‌లో 73.4, నాగిరెడ్డిపేటలో 63.4, భిక్కనూరులో 52.2, బిచ్కుందలో 50.0, నిజాంసాగర్‌లో 90.4, జుక్కల్‌లో 53.2, బీర్కూర్‌లో 75.4, కామారెడ్డిలో 91.2, మద్నూర్‌లో 56.0, దోమకోండలో 78.6, మాచారెడ్డిలో 68.4, రామారెడ్డిలో 100.2, రాజంపేట 76.2, గాంధారి 97.4, పెద్దకొడప్‌గల్‌లో 57.2, బీబీపేట 84.5 మి.మీల వర్షం కురిసింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు గాంధారి మండలం గుడివెనుక తండాలో, భిక్కనూరు మండలంలోని బస్వాపూర్‌, జంగంపల్లి తదితర ప్రాంతాల్లో 5ఇళ్లు, లింగంపేట మం డల కేంద్రంలో ఇళ్లు కూలిపోతున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావర ణశాఖ సూచించడంతో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కైలాస్‌, పోచారం ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నందున దిగువ ప్రాంతాల ప్రజలు అప్ర తమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.

Updated Date - 2022-07-11T05:58:10+05:30 IST