భారత్‌కు అండగా ప్రపంచం : జైశంకర్

ABN , First Publish Date - 2021-08-13T00:30:30+05:30 IST

కోవిడ్-19 రెండో ప్రభంజనంలో భారత దేశానికి ప్రపంచం

భారత్‌కు అండగా ప్రపంచం : జైశంకర్

న్యూఢిల్లీ : కోవిడ్-19 రెండో ప్రభంజనంలో భారత దేశానికి ప్రపంచం అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ చెప్పారు. ఈ మహమ్మారి మొదటి ప్రభంజనం సమయంలో మన దేశం చాలా దేశాలకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. గురువారం ఆయన కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సదస్సులో మాట్లాడారు. 


సీఐఐ వార్షిక సదస్సులో వర్చువల్ విధానంలో జైశంకర్ మాట్లాడుతూ, కోవిడ్ తొలి ప్రభంజనం సమయంలో భారత దేశం చాలా దేశాలకు అండగా నిలిచిందన్నారు. ఈ మహమ్మారి రెండో ప్రభంజనంతో ఇబ్బంది పడిన భారత దేశానికి అనేక దేశాలు అండగా నిలిచాయన్నారు. మన దేశం నుంచి మందులు, వైద్య బృందాలు, ఆహార సరఫరాల రూపంలో సహాయం అందుకున్న దేశాలు ధన్యవాదాలు చెప్తున్నాయన్నారు. మనం సాయం చేసినట్లుగానే, రెండో ప్రభంజనం సమయంలో మనకు కూడా ఇతర దేశాలు సహాయపడ్డాయన్నారు. ముఖ్యంగా ఆక్సిజన్, ఆక్సిజనేటర్లు, మందుల సరఫరాలో అనేక దేశాలు మనకు అండదండలు అందించాయన్నారు. 


ఈ మహమ్మారి రెండో ప్రభంజనం చాలా ప్రత్యేకమైన పరిస్థితిని సృష్టించిందన్నారు. దాని విస్తృతి, తీవ్రతలను ముందుగా ఊహించడం కష్టమని తెలిపారు. కరోనా వైరస్ డెల్టా వేరియంట్ కారణంగా ఆక్సిజన్ డిమాండ్ ఎనిమిది, తొమ్మిది రెట్లు పెరిగిందన్నారు. పారిశ్రామిక రంగం అద్భుతంగా పని చేసిందన్నారు. జరిగినదాని తీవ్రత గురించి అందరికీ అర్థమయ్యే విధంగా చేయడంలో ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేసిందన్నారు. 


Updated Date - 2021-08-13T00:30:30+05:30 IST