‘ఆంధ్రజ్యోతి’ విషయంలో సుబ్రమణ్య స్వామికి హైకోర్టు చీవాట్లు

ABN , First Publish Date - 2021-06-17T16:50:18+05:30 IST

‘ఆంధ్రజ్యోతి’పై టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుపై త్వరగా చర్యలు తీసుకోవాలంటూ వారు కోరడంపై న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది....

‘ఆంధ్రజ్యోతి’ విషయంలో సుబ్రమణ్య స్వామికి హైకోర్టు చీవాట్లు

అమరావతి: ఫిర్యాదుదారుడికి లేని తొందర మీకెందుకు? ఈ వ్యవహారంతో మీకేంసంబంధం? అని రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామిని, ఆయన అనుచరుడు అయిన న్యాయవాది సత్య సభర్వాల్‌ను హైకోర్టు ఒకింత చీవాట్లు పెట్టింది. ‘ఆంధ్రజ్యోతి’పై టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుపై త్వరగా చర్యలు తీసుకోవాలంటూ వారు కోరడంపై న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. గతంలో ఇంటర్నెట్‌లో టీటీడీ పంచాంగం కోసం సెర్చ్ చేసిన వారికి అందులో అన్యమత పదం కనిపించిన సంగతి తెలిసిందే. అది అప్పట్లో తీవ్ర వివాదం సృష్టించింది.


టీటీడీ వెబ్‌సైట్‌లో అన్యమత పదాన్ని ఎవరో ఉద్దేశపూర్వంగా పెట్టారని దీనిపై దర్యాప్తు జరిపితే అసలు విషయం తెలుస్తుందని అప్పట్లో ఆంధ్రజ్యోతి సవివరమైన కథనాన్ని ప్రచురించింది. జరిగిన తప్పును వెలుగులోకి తేవడమే నేరం అన్నట్లుగా టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్  అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లో ఆంధ్రజ్యోతిపై ఫిర్యాదు చేశారు.


తిరుపతి తూర్పు పీఎస్‌లో ఆంధ్రజ్యోతిపై ఫిర్యాదు అందిన చాలా రోజుల తర్వాత సుబ్రహ్మణ్మస్వామి రంగంలోకి దిగారు. ఆయన ఇటీవల ఆకస్మాత్తుగా ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో తిరుపతికి వచ్చారు. ఆంధ్రజ్యోతిపై కేసు వేస్తున్నామంటూ హల్ చల్ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సుబ్రహ్మణ్యస్వామితో పాటు ఆయన అనుచరుడు సత్యసభర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిగింది. ‘కేసు దర్యాప్తు ఆలస్యం అవుతోందని భావిస్తే ఫిర్యాదు దారుడు రిట్ పిటిషన్ వేసుకోవచ్చు, ఈ విషయంలో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేయడానికి  మీరెవరని ధర్మాసనం ప్రశ్నించింది’. ఈ వ్యవహారంలో లక్షలాది భక్తుల విశ్వాసం ముడిపడి ఉందని సత్య సబర్వాల్ బదులిచ్చారు. ఫిర్యాదు దారుడికి లేని తొందర మీకెందుకని హైకోర్టు మళ్లీ ప్రశ్నించింది. దీంతో వ్యాజ్యంలో మరో పిటిషనర్ అయిన సుబ్రహ్మణ్య స్వామి ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారని, ఆయన వాదనలు కూడా విన్న తర్వాత నిర్ణయాన్ని వెల్లడించాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Updated Date - 2021-06-17T16:50:18+05:30 IST