కూరగాయల విత్తనాలకు సబ్సిడీ కరువు

ABN , First Publish Date - 2022-05-10T05:11:07+05:30 IST

కూరగాయల సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా ప్రోత్సాహాన్ని అందించక పోవడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరగడం లేదు.

కూరగాయల విత్తనాలకు సబ్సిడీ కరువు

- నాలుగేళ్లుగా దిక్కే లేదు

- తగ్గిన సాగు విస్తీర్ణం


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

కూరగాయల సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా ప్రోత్సాహాన్ని అందించక పోవడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరగడం లేదు. విత్తనాల ధరలు అధికధరలు పలుకుతుండడంతో రైతులు కొనుగోలు చేయలేకపోతున్నారు. ఇందుకు గానూ ప్రభుత్వం కూరగాయల విత్తనాలపై సబ్సిడీ ఇవ్వడం లేదు. జిల్లాలో వెయ్యి నుంచి 1,100 ఎకరాల్లో రైతులు కూరగాయల సాగు చేస్తున్నారు. పెద్దపల్లి, ధర్మారం  కమాన్‌పూర్‌, కాల్వశ్రీరాంపూర్‌, పాలకుర్తి, అంతర్గాం, సుల్తానాబాద్‌, తదితర మండలాల్లో టమాట, బీర, సోరకాయ, కాకరకాయ, బెండ, టమాట, చిక్కుడు, గోరుచిక్కుడు, కాలీఫ్లవర్‌, మిర్చి, క్యాబేజీ వంటి కూరగాయలను, ఆకుకూరలైన పాలకూర, గంగవాయిలీ కూర, కొత్తి మీరను పండిస్తున్నారు. జిల్లా జనాభా సుమారు ఎనిమిది లక్షలు ఉండగా, ఇక్కడ సాగు చేస్తున్న కూరగాయలు ఏమాత్రం సరిపోవడం లేదు. ఆదిలాబాద్‌, మహారాష్ట్ర, మదనపల్లి, అనంతపురం, హైదరాబాద్‌, తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు కూరగాయలు సరఫరా అవుతున్నాయి. 

నాలుగు సంవత్సరాల క్రితం వరకు కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు గానూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం సబ్సిడీపై విత్తనాలను ఇచ్చారు. హైబ్రిడ్‌ కూరగాయల విత్తనాల ధరలు బహిరంగ మార్కెట్‌లో అధికంగా ఉండడంతో విత్తనాల భారాన్ని రైతులు తట్టుకోవడం లేదు. దీనికి తోడు తెగుళ్లు కూడా సోకుతుండడంతో రైతులు ఆ పంటలను సాగు చేయడం లేదు. చాలా మంది రైతులు కూరగాయల పంటలను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ సబ్సిడీ లేక ఆ పంటలకు దూరం అవుతున్నారు. కూరగాయల సాగు వల్ల రైతుల చేతిలో డబ్బులు రొటేషన్‌ అవుతూ ఉంటాయి. విత్తనాలకు సబ్సిడీ ఇచ్చినప్పుడు జిల్లాలో 1,400 నుంచి 1,500 ఎకరాల్లో కూరగాయలను సాగు చేశారు. సబ్సిడీ ఎత్తివేసిన తర్వాత సాగు విస్తీర్ణం తగ్గుముఖం పట్టింది. 

-  నారుపై 90 శాతం సబ్సిడీ..

విత్తనాలను బంద్‌ చేసిన ప్రభుత్వం గత ఏడాది నుంచి 90 శాతం సబ్సిడీపై కూరగాయల నారును ఇస్తున్నది. రెండు మాసాల ముందే రైతుకు కావాల్సిన నారు కోసం రెండు మాసాల ముందే డీడీ చెల్లిస్తే సిద్దిపేట జిల్లా ములుగు వద్ద గల ఉద్యాన వర్సిటీ నుంచి రవాణా చేస్తున్నారు. విత్తన నారు కోసం చెల్లించే డీడీకి జీఎస్టీ కూడా రైతులే భరించాల్సి వస్తున్నది. పెంచిన నారును పొందేందుకు రైతులు ఎవరూ ముందుకు రావడం లేదు. గడిచిన ఏడాది జిల్లాకు చెందిన రైతులు కేవలం 12.5 ఎకరాల్లో మాత్రమే కూరగాయలను సాగు చేసేందుకు నారు తెచ్చుకున్నారు. నారు తెచ్చుకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. డీడీలు చెల్లించి నారు కోసం ఎదురు చూడాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. జిల్లాలో వెయ్యి ఎకరాల్లో కూరగాయలను సాగు చేస్తే కేవలం 12.5 ఎకరాల్లో మాత్రమే సబ్సిడీ నారు పొందారు. 50 శాతం సబ్సిడీ ఇచ్చినట్లయితే జిల్లాలో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి మార్కెట్‌లో కూరగాయలకు మంచి ధరలు పలుకుతుండడంతో చాలా మంది రైతులు తమకున్న భూమిలో కొంత విస్తీర్ణంలో కూరగాయలు పండించాలని భావిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కూరగాయల సాగు కోసం 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని రైతులు ప్రభుత్వాలను కోరుతున్నారు. 


Read more