హైదరాబాద్: డిసెంబర్ నెలకూ రేషన్ లబ్ధిదారులకు కావాల్సిన బియ్యం నిల్వలు పుష్కలంగా ఉన్నాయని పౌరసరఫరాలశాఖ అధికారులు తెలిపారు. 87.64 లక్షలకుటుంబాలకు ప్రతి నెలా 1.75 లక్షల మెట్రిక్‌టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. ఇందులో 1.50లక్షల మెట్రిక్‌టన్నుల బియ్యాన్ని మాత్రమే లబిఽ్ధదారులు తీసుకుంటున్నట్టు తెలిపారు. పౌరసరఫరాలశాఖ వద్ద ప్రస్తుతం డిసెంబరు, జనవరి నెలకు అవసరమైన బియ్యం నిల్వలు ఉన్నాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇవే కాకుండా అదనంగా సన్న బియ్యం కూడా అందుబాటులో ఉన్నాయన్నారు.
నవంబరులో లబ్దిదారులు రేషన్ తీసుకున్న తర్వాత డీలర్ల దగ్గర 50వేల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు మిగిలిపోయాయని చెప్పారు. సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పదకం కోసం తీసుకున్న 85వేల మెట్రిక్‌టన్నుల సన్నబియ్యం కోవిడ్ వల్ల పాఠశాలలు మూసివేయడంతో ఆ బియ్యం పౌరసరఫరాల గోదాముల్లోనే ఉన్నాయని తెలిపారు. ఈ 85వేల మెట్రిక్‌టన్నుల బియ్యాన్ని కూడా లబ్ధిదారులకు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని తెలిపారు.
రేషన్‌కార్డుకు ఆధార్ అనుసంధానం అనేది 2017లోనే పౌరసరఫరాలశాఖ పూర్తిచేసింది. ఈ విషయంలో ఆదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు వరసలో నిలిచిందన్నారు. ఇప్పుడు దానిని కేంద్ర ప్రభుత్వ సూచనతో డీ నోటిఫై చేశామన్నారు. రెండు నెలల క్రితం రేషన్‌కార్డుకు ఓటీపీ నంబరు అన్ననిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.