సామర్థ్యం పెంచుకొంటేనే విజయం

ABN , First Publish Date - 2021-10-22T05:30:00+05:30 IST

ఏదైనా సాధించడానికి సులువైన మార్గాలను వెతుక్కోవడం సమాజంలో మనకు తరచుగానే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ విజయాన్ని కాంక్షిస్తారు.....

సామర్థ్యం పెంచుకొంటేనే విజయం

ఏదైనా సాధించడానికి సులువైన మార్గాలను వెతుక్కోవడం సమాజంలో మనకు తరచుగానే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ విజయాన్ని కాంక్షిస్తారు. కానీ కోరిక ఉన్నంత మాత్రాన దాన్ని పొందలేరు. ‘మీరు లక్షాధికారి కావడం ఎలా?’ లాంటి పుస్తకాలు చూసే ఉంటారు. అలాంటి పుస్తకాలు లక్షల ప్రతులు అమ్ముడయ్యాయి. కానీ ఎంత మంది లక్షాధికారులయ్యారు? కేవలం రచయిత మాత్రమే అయ్యాడు.


మరికొందరి తీరు మరోలా ఉంటుంది. ఒక కథ చెబుతాను. ఒక ఊర్లో రాము, సోము అనే స్నేహితులు ఉండేవారు. రాము ఎప్పుడూ తగ్గింపు ధరల కోసం చూస్తూ ఉండేవాడు. ఒక రోజు అతను సోము దగ్గరకు వచ్చి ‘‘నీకో గొప్ప అవకాశం దొరికింది. మన ఊరికి సర్కస్‌ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఒక ఏనుగు అమ్మేద్దామనుకుంటున్నారు. దాని ధర కేవలం అయిదు వేల రూపాయలే’’ అన్నాడు.


‘‘నాకు ఏనుగెందుకు? దాన్ని ఎలా పోషిస్తాను?’’ అని అడిగాడు సోము. 

‘‘ఇది ఎంతో గొప్ప అవకాశం. ఆ మనిషి నాకు బాగా తెలుసు. కావాలంటే నాలుగు వేలకే ఇప్పిస్తా’’ అన్నాడు రాము

‘‘నేను సింగిల్‌ బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నా. దాన్నెలా తీసుకెళ్ళను?’’

‘‘అతనితో మాట్లాడి నీకు రెండు ఏనుగుల్ని అయిదు వేలకే ఇప్పిస్తా. తీసుకో!’’

‘‘ఏం మాట్లాడుతున్నావ్‌ నువ్వు? నేను రెండు ఏనుగుల్ని ఎక్కడ పెట్టుకోను? ఏం చేసుకోను?’’ అన్నాడు సోము విసుగ్గా.


తగ్గింపు ధరల ప్రలోభం ఇలా ఉంటుంది. ఈ కథ అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ ఏదైనా డిస్కౌంట్‌లో వస్తోందంటే ఎగబడేవాళ్ళు చాలామంది ఉన్నారు. తమకు అది అవసరమా, లేదా అని పట్టించుకోరు. ఇతరులను కూడా ప్రలోభపెట్టాలనీ, తమ ధోరణిలోకి మార్చాలనీ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది కూడా మరింత సంపాదించాలన్న తాపత్రయంతో సులభమార్గం వెతుక్కోవడమే! 


వాస్తవం ఏమిటంటే... ఈ లౌకిక ప్రపంచంలో ఏదైనా సాధించాలంటే... దానికి ప్రధానమైన మార్గం మీ సామర్థ్యాన్ని పెంచుకోవడం. మీలో ఏదో విధంగా సామర్థ్యం పెరిగినప్పుడే విజయం సాధించగలరు. ఉద్యోగులైతే మీ వృత్తికి సంబంధించిన సామర్థ్యాలు పెంచుకోవాలి. వ్యాపారులైతే ఎల్లప్పుడూ అమ్మకాలల్లో సామర్థ్యాన్ని పెంచుకుంటూనే ఉండాలి. ఈ దిశగా ప్రయత్నాలేవీ చేయకుండా... కష్టపడకుండా గెలుపు రావాలనీ, అయాచితంగా ఏదో వచ్చి పడాలనీ మీరు కోరుకుంటే, ఎంతో నిరాశతో మరణించాల్సి వస్తుంది. 

సద్గురు జగ్గీవాసుదేవ్‌

Updated Date - 2021-10-22T05:30:00+05:30 IST