విపత్తులో విజయవంతం!

ABN , First Publish Date - 2020-06-06T09:32:29+05:30 IST

జిల్లా కలెక్టర్‌గా ఎంవీ శేషగిరిబాబు బాధ్యతలు చేపట్టి శనివారం నాటికి ఏడాది పూర్తవుతోంది.

విపత్తులో విజయవంతం!

కలెక్టర్‌గా శేషగిరిబాబు బాధ్యతలు చేపట్టి ఏడాది

కరోనాను ఎదుర్కోవడంలో సఫలం

అభివృద్ధి లేకున్నా సంక్షేమంలో ముందకు...

అవినీతిపరులపై వేటు పలు శాఖల ప్రక్షాళన

కీలక ప్రాజెక్టుల్లో కనిపించని పురోగతి


నెల్లూరు, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కలెక్టర్‌గా ఎంవీ శేషగిరిబాబు బాధ్యతలు చేపట్టి శనివారం నాటికి ఏడాది పూర్తవుతోంది. సార్వత్రిక ఎన్నికలు ముగిశాక కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల బదిలీలు చేపట్టగా అప్పటికి శాప్‌ ఎండీ, వీసీగా పని చేస్తున్న ఎంవీ. శేషగిరిబాబును జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది.  ఈ ఏడాది కాలంలో అభివృద్ధి అంతంత మాత్రమే జరగగా సంక్షేమం మాత్రమే అమలు జరుగుతూ వస్తోంది. ప్రభుత్వ ప్రాధాన్యం దీనికే ఉండడంతో అధికార యంత్రాంగం కూడా ఆ దిశగానే పని చేసింది. కొత్త ప్రభుత్వం కావడం, కొత్త పథకాలు, వ్యవస్థలను ప్రవేశపెట్టడంతో వాటిని పర్యవేక్షించేందుకే కలెక్టర్‌కు ఎక్కువ సమయం పట్టింది.


అయితే ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి వణికించడం మొదలుపెట్టింది. రాష్ట్రంలో మొదటి పాజిటివ్‌ కేసు జిల్లాలో నమోదవడంతో జిల్లా యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. లాక్‌డౌన్‌ కన్నా పది రోజుల ముందు నుంచే జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలు మొదలయ్యాయి. కలెక్టర్‌ శేషగిరిబాబు నేతృత్వంలోని అధికార యంత్రాంగం కరోనాను ధీటుగా ఎదుర్కొంది. జిల్లా యంత్రాంగం అనేక ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు కదలడంతో ఇతర జిల్లాలతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది.


వైద్య విభాగాల్లో సమన్వయ లోపం మూలంగా తలెత్తుతున్న ఇబ్బందులను గుర్తించిన కలెక్టర్‌ జీజీహెచ్‌, మెడికల్‌ కళాశాల, డీసీహెచ్‌ఎస్‌ విభాగాలను ప్రక్షాళన చేసి పరిస్థితులను చక్కదిద్దారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, వారితో కలిసిన వారిని గుర్తించగలిగితే చాలా వరకు కరోనాను నియంత్రించవచ్చని భావించిన కలెక్టర్‌ డోర్‌ టు డోర్‌ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా వందల సంఖ్యలో ఇతర దేశాలు, ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించడంలో జిల్లా యంత్రాంగం విజయవంతమైంది.


ఈ సర్వే విధానాన్ని ఆ తర్వాత రాష్ట్రమంతా అమలు చేయడం విశేషం. ఇక ఢిల్లీ, కోయంబేడు కాంటాక్ట్స్‌ విషయంలో కూడా యంత్రాంగం నిరంతరం శ్రమించింది. కలెక్టర్‌తోపాటు జిల్లా ఉన్నతాధికారులంతా అర్ధరాత్రి వరకు ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూం నుంచి సమీక్షించేవారు. ఇక కరోనా సోకిన వ్యక్తులకు చికిత్సలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవడంతో రికవరీ రేటు కూడా జిల్లాలో ఎక్కువగా నమోదైంది.


దృష్టంతా సంక్షేమ పథకాల మీదే..

కరోనాకు ముందు అధికార యంత్రాంగం దృష్టంతా సంక్షేమ పథకాల మీదే ఉంది. కొత్త ప్రభుత్వం కొత్త పథకాలు, వ్యవస్థలను తీసుకురావడంతో వాటిపైన పర్యవేక్షణకే కలెక్టర్‌ ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షల నిర్వహణ, ఆ తర్వాత సచివాలయాల ఏర్పాటు కలెక్టర్‌కు కత్తిమీద సాములా మారింది. కలెక్టర్‌ బాధ్యతలు చేపట్టే నాటికి జిల్లాలోని కీలకమైన జిల్లా అధికారుల పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆ శాఖలపై పర్యవేక్షణ కష్టంగా మారింది. ఇదే సమయంలో జడ్పీ, కార్పొరేషన్‌, డీసీసీబీలకు కలెక్టర్‌ ప్రత్యేకాధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహించడం గమనార్హం. లాక్‌డౌన్‌ సమయంలో జిల్లాలోనే ప్రత్యేకంగా 8, 9 తరగతుల విద్యార్థులకు టీవీ క్లాస్‌లు చెప్పించారు. కలెక్టర్‌ శేషగిరిబాబు మొదటి నుంచి సంక్షేమ హాస్టళ్ల ప్రక్షాళనకు పూనుకున్నారు.


కరోనాకు ముందు వరకు వారానికి ఒక హాస్టల్‌ను తనిఖీ చేయడం, రాత్రికి అక్కడే బస చేస్తూ వచ్చారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పరిశీలిస్తూ ప్రత్యేకంగా హాస్టళ్లలో ట్యూషన్లు చెప్పించారు. కాగా అదే సమయంలో అవినీతి అధికారులపై కలెక్టర్‌ వేటు వేశారు. భూ అక్రమాలకు పాల్పడ్డ ముగ్గురు తహసీల్దార్లతోపాటు పలువురు రెవెన్యూ అధికారులను సస్పెండ్‌ చేశారు. అలానే మరికొంత మంది అధికారులను ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. ఇక రెవెన్యూ శాఖలో ఉన్న గ్రూపు రాజకీయాలను కట్టడి చేయడంలో కలెక్టర్‌ సఫలమయ్యారు. కొందరు రెవెన్యూ అధికారులు గత కలెక్టర్‌పై సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు పెడుతూ ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. 


కీలక ప్రాజెక్టుల్లో కనిపించని పురోగతి

గడిచిన ఏడాది కాలంలో జిల్లాలో పలు కీలక ప్రాజెక్టుల్లో పురోగతి కనిపించలేదు. ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా మారింది. పిషింగ్‌ హార్బర్‌కు శంకుస్థాపన చేసినప్పటికీ ఇంత వరకు భూసేకరణ పూర్తి కాలేదు. ఇప్పటికి నలభై ఎకరాలు సేకరించగా మరో ముప్పై ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. అలానే దామవరం వద్ద నిర్మించ తలపెట్టిన విమానాశ్రయం కూడా పేపర్ల మీదే ఉండిపోయింది. భూసేకరణలో తలెత్తిన సమస్యలు ఇంతవరకు పరిష్కారం కాలేదు. పులికాట్‌ సరస్సు పూడికతీతలో నిధుల మంజూరుకు అనుమతులు వచ్చినా అడుగు ముందుకు పడలేదు. వెంకటాచలం మండలంలో శంకుస్థాపన చేసిన ఎన్‌సీఈఆర్‌టీ కూడా భూసేకరణ దశలోనే ఆగిపోయింది. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ప్రాజెక్టు విషయంలో కలెక్టర్‌ డీపీఆర్‌ పంపినా ఆ తర్వాత ముందుకు కదల్లేదు. నాయుడుపేట - పూతల పట్టు జాతీయ రహదారి విస్తరణకు కూడా భూసేకరణే అడ్డంకిగా నిలిచింది. మొత్తంగా చూసుకుంటే ఎక్కువగా రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కారంలో గడిచిన ఏడాదిలో పురోగతి కనిపించలేదు.  

Updated Date - 2020-06-06T09:32:29+05:30 IST