అలా చేస్తేనే సాఫల్యం!

ABN , First Publish Date - 2021-01-22T05:39:07+05:30 IST

దైవం సృష్టిలో మానవుడు ఒక అత్యుత్తమమైన జీవి. ఎందుకంటే... సృష్టిలోని జీవరాశులలో మానవుడు మాత్రమే ఆలోచించగలుగుతాడు.

అలా చేస్తేనే సాఫల్యం!

దైవం సృష్టిలో మానవుడు ఒక అత్యుత్తమమైన జీవి. ఎందుకంటే... సృష్టిలోని జీవరాశులలో మానవుడు మాత్రమే ఆలోచించగలుగుతాడు. మంచి, చెడుల మధ్య వ్యత్యాసాన్ని గమనించగలుగుతాడు. మంచి పనులు చేస్తే వచ్చే సంతోషాన్నీ, పేరు ప్రతిష్టలనూ ఆస్వాదిస్తాడు. చెడు పనులవల్ల కలిగే పర్యవసానాన్నీ, బాధలనూ అనుభవిస్తాడు. వీటన్నిటికీ కారణం మానవుడికి దైవం ఇచ్చిన జ్ఞానేంద్రియాలనే మహా భాగ్యం. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రకృతిలోని అందాలనూ, ఆనందాలనూ మనిషి అనుభవిస్తాడు. 


అయితే ఆనందాన్నిచ్చే ఆ క్షణాల వేటలో మనిషి తనను తాను మరచిపోతున్నాడు. దైవం ప్రసాదించిన ఈ కొద్ది రోజుల  జీవన కాలాన్నీ వృఽథా చేస్తున్నాడు. ఈ జీవన ప్రయాణంలో మంచి-చెడుల విచక్షణ కోల్పోయి, దైవం ప్రసాదించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాడు. ‘తాను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు వచ్చాడు?’ అనే విషయాలను పూర్తిగా వదిలేసి, కోరికల వేటలో ప్రయాణిస్తున్నాడు. మనిషి నివసిస్తున్న భూమి, చూస్తున్న సూర్యుడు, నక్షత్రాలు, ఆకాశం... ఇవన్నీ కేవలం వాటి కోసం కాదు... మానవుల కోసమే! ఈ విషయం తెలిసినా ‘వీటన్నిటినీ సృష్టించినది ఎవరు?’ అని మానవుడు ఆలోచించడం లేదు. 


ఇలాంటి స్థితికి చేరుకున్న వారికి అల్లాహ్‌ హితవు పలుకుతూ ‘‘మానవులారా! మిమ్మల్నీ, మీ పూర్వీకులనూ సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. మిమ్మల్ని మీరు రక్షించుకొనే అవకాశం దాని ద్వారా మాత్రమే ఉంది. మీ కోసం భూమిని పానుపుగానూ, ఆకాశాన్ని పైకప్పుగానూ సృష్టించినవాడూ, పైనుంచి వర్షాన్ని కురిపించి... తద్వారా అన్ని రకాల పంటలూ పండే ఏర్పాటు చేసి, మీకు ఉపాధి కల్పించినవాడూ ఆయనే! ఇది మీకు తెలిసినప్పుడు ఇతరులను అల్లాహ్‌కు సమానులుగా నిలబెట్టకండి’’ అని దివ్య ఖుర్‌ఆన్‌లో పేర్కొన్నారు. మనుషులకు మంచి, చెడు స్థితులు కల్పించి దేవుడు పరీక్షిస్తాడు. చివరికి అందరూ ఆయన దగ్గరకే వెళ్ళాలి. కాబట్టి మానవులందరూ మంచి మార్గంలో నడవాలి. ఇతరులను మంచి వైపు ఆహ్వానించాలి. చెడుకు దూరంగా ఉండాలి. ఇతరులను చెడు వైపు మళ్ళకుండా ఆపాలి. ఇలా చేసినవారే జీవన సాఫల్యం పొందుతారు. అల్లాహ్‌ కృపకు పాత్రులవుతారు.

 మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2021-01-22T05:39:07+05:30 IST