విజయం ఊరిస్తోంది..

ABN , First Publish Date - 2020-12-29T06:44:30+05:30 IST

టీమిండియా బౌలర్లు మరోసారి పంజా విసిరారు. ఆస్ట్రేలియాను రెండో ఇన్నింగ్స్‌లోనూ కుదురుకోనీయకుండా దెబ్బతీశారు. ప్రస్తుతం 2

విజయం ఊరిస్తోంది..

 మన బౌలర్ల తడాఖా

 ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ 133/6

 భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 326


టీమిండియా బౌలర్లు మరోసారి పంజా విసిరారు. ఆస్ట్రేలియాను రెండో ఇన్నింగ్స్‌లోనూ కుదురుకోనీయకుండా దెబ్బతీశారు. ప్రస్తుతం 2 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆసీస్‌  చేతిలో మరో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. నాలుగో రోజు ఆటలో వీలైనంత త్వరగా కంగారూ ‘తోక’ను కట్‌ చేస్తే.. సిరీ్‌సను సమం చేసే అవకాశం భారత్‌కు చిక్కినట్టే. అయితే 99 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన వేళ.. గ్రీన్‌, కమిన్స్‌ కాస్త గట్టిగానే పోరాడుతున్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 131 పరుగుల ఆధిక్యం సాధించింది.


మెల్‌బోర్న్‌: తొలి టెస్టు పరాభవానికి బదులు తీర్చుకునే దిశగా భారత జట్టు దూసుకెళుతోంది. బౌలర్ల సమష్టి ప్రదర్శనతో ఓవైపు పరుగులను అడ్డుకుంటూ.. మరోవైపు వికెట్ల పతనం సాగించింది. దీంతో భారత్‌ నాలుగో రోజే ఈ సిరీ్‌సను సమం చేసే అవకాశం కనిపిస్తోంది. సోమవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 66 ఓవర్లలో 6 వికెట్లకు 133 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్‌ (40) ఒక్కడే రాణించగా.. క్రీజులో గ్రీన్‌ (17 బ్యాటింగ్‌), కమిన్స్‌ (15 బ్యాటింగ్‌) పట్టుదలగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే 112 బంతులు ఎదుర్కొని ఏడో వికెట్‌కు అజేయంగా 34 పరుగులు జోడించారు.


నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ అంత సులువు కాకపోవడంతో భారత బౌలర్లు మరో 50 పరుగుల్లోపే ఈ జోడీని  విడదీయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆసీస్‌ 2 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. జడేజాకు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 115.1 ఓవర్లలో 326 రన్స్‌కు ఆలౌటైంది. జడేజా (57) అర్ధసెంచరీ సాధించాడు. స్టార్క్‌, లియాన్‌కు మూడేసి వికెట్లు దక్కాయి. 


49 పరుగులు.. 5 వికెట్లు:


మూడో రోజు ఆటలో భారత్‌ భారీ స్కోరు దిశగా వెళుతుందనుకున్నా ఆసీస్‌ బౌలర్లు కట్టడి చేశారు. కేవలం 49 పరుగులే చేసి మిగిలిన ఐదు వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్‌ స్కోరు 277/5తో తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌కు రహానె, జడేజా ఆరో వికెట్‌కు 123 పరుగులు జోడించారు. జోరు మీదున్న రహానె తన కెరీర్‌లో తొలిసారిగా రనౌట్‌ కావాల్సి వచ్చింది. జడేజా షార్ట్‌ కవర్‌లో బంతిని ఆడి సింగిల్స్‌ కోసం పిలిచాడు. అయితే లబుషేన్‌ మెరుపు వేగంతో కీపర్‌ పెయిన్‌కు బంతి విసరడం.. రహానెను రనౌట్‌ చేయడం చకచకా జరిగిపోయాయి. అప్పటికి అతడి బ్యాట్‌ క్రీజులో లేదు. ఆ తర్వాత అర్ధసెంచరీ చేసిన జడేజా కూడా ఎక్కువ సేపు నిలవలేదు. షార్ట్‌ పిచ్‌ బంతులతో విసిగించిన స్టార్క్‌ చివరకు అతడి వికెట్‌ తీశాడు. ఇక మిగిలిన బ్యాట్స్‌మెన్‌ కూడా పెవిలియన్‌ చేరేందుకు ఎక్కువ సమయం పట్టలేదు.


ఆసీస్‌ తడబాటు:

లంచ్‌ బ్రేక్‌ తర్వాత ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. అయితే నాలుగో ఓవర్‌లోనే ఓపెనర్‌ బర్న్స్‌ (4) వికెట్‌ను పేసర్‌ ఉమేశ్‌ పడగొట్టాడు. ఈ దశలో వేడ్‌, లబుషేన్‌ (28) నుంచి పోరాటం కనిపించింది. కానీ, అశ్విన్‌ లెంగ్త్‌ బాల్‌కు లబుషేన్‌ స్లిప్‌లో క్యాచ్‌ అవుటయ్యాడు. రెండో వికెట్‌కు వీరు 38 పరుగులు జోడించారు. 65/2తో జట్టు టీ బ్రేక్‌కు వెళ్లింది. అనంతరం స్టీవ్‌ స్మిత్‌ (8) తన పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ బుమ్రా ఓవర్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. లెగ్‌సైడ్‌ వెళ్తున్న బంతి అనూహ్యంగా టర్న్‌ తీసుకుని నెమ్మదిగా బెయిల్స్‌ను తాకింది. ఈ విషయాన్ని స్మిత్‌తోపాటు బుమ్రా కూడా వెంటనే గమనించలేదు.


ఒక్క రన్‌ తేడాతో 3 వికెట్లు:

స్మిత్‌ నిష్క్రమణ తర్వాత ఆసీస్‌ వికెట్ల పతనం వేగంగా సాగింది. 98 నుంచి 99 స్కోరు చేరేసరికి ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ చేరారు. ఓపిగ్గా క్రీజులో నిలిచిన ఓపెనర్‌ వేడ్‌ను జడేజా ఎల్బీ చేయగా అతను రివ్యూకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత వేడ్‌కు అండగా నిలిచిన హెడ్‌ (17)ను సిరాజ్‌ అవుట్‌ చేశాడు. జడేజా తన మరో ఓవర్‌లో కెప్టెన్‌ పెయిన్‌ (1) పనిపట్టడంతో ఆసీస్‌ 99/6తో కష్టాల్లో పడింది. అయితే తన క్యాచ్‌ అవుట్‌ విషయంలో పెయిన్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తూ క్రీజును వీడాడు. అలాగే అశ్విన్‌ ఓవర్‌లో కమిన్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను పంత్‌ వదిలేశాడు. ఆ తర్వాత ఈ జోడీ మరో వికెట్‌ పడకుండా రోజును ముగించింది.  


 


స్కోరుబోర్డు


ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 195


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ (ఎల్బీ) స్టార్క్‌ 0; గిల్‌ (సి) పెయిన్‌ (బి) కమిన్స్‌ 45; పుజార (సి) పెయిన్‌ (బి) కమిన్స్‌ 17; రహానె (రనౌట్‌) 112; విహారి (సి) స్మిత్‌ (బి) లియాన్‌ 21; పంత్‌ (సి) పెయిన్‌ (బి) స్టార్క్‌ 29; జడేజా (సి) కమిన్స్‌ (బి) స్టార్క్‌ 57; అశ్విన్‌ (సి) లియాన్‌ (బి) హాజెల్‌వుడ్‌ 14; ఉమేశ్‌ (సి) స్మిత్‌ (బి) లియాన్‌ 9; బుమ్రా (సి) హెడ్‌ (బి) లియాన్‌ 0; సిరాజ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 22; మొత్తం: 115.1 ఓవర్లలో 326 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-0, 2-61, 3-64, 4-116, 5-173, 6-294, 7-306, 8-325, 9-325, 10-326. బౌలింగ్‌: స్టార్క్‌ 26-5-78-3; కమిన్స్‌ 27-9-80-2; హాజెల్‌వుడ్‌ 23-6-47-1; లియాన్‌ 27.1-4-72-3; గ్రీన్‌ 12-1-31-0.


ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: వేడ్‌ (ఎల్బీ) జడేజా 40; బర్న్స్‌ (సి) పంత్‌ (బి) ఉమేశ్‌ 4; లబుషేన్‌ (సి) రహానె (బి) అశ్విన్‌ 28; స్మిత్‌ (బి) బుమ్రా 8; హెడ్‌ (సి) మయాంక్‌ (బి) సిరాజ్‌ 17; గ్రీన్‌ (బ్యాటింగ్‌) 17; పెయిన్‌ (సి) పంత్‌ (బి) జడేజా 1; కమిన్స్‌ (బ్యాటింగ్‌) 15; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 66 ఓవర్లలో 133/6. వికెట్ల పతనం: 1-4, 2-42, 3-71, 4-98, 5-98, 6-99. బౌలింగ్‌: బుమ్రా 17-4-34-1; ఉమేశ్‌ 3.3-0-5-1; సిరాజ్‌ 12.3-1-23-1; అశ్విన్‌ 23-4-46-1; జడేజా 10-3-25-2.




Updated Date - 2020-12-29T06:44:30+05:30 IST