సత్కార్యాలతోనే సాఫల్యం

ABN , First Publish Date - 2022-01-21T05:30:00+05:30 IST

మంచి పనులు ఆచరించేవారు, దానాలు చేసేవారు అల్లాహ్‌కు ప్రీతిపాత్రులవుతారు. తమ సంపదను అల్లాహ్‌ చూపిన మార్గంలో ఖర్చు చేసేవారి ఉపమానాన్ని దివ్య ఖుర్‌ఆన్‌ వివరిస్తూ......

సత్కార్యాలతోనే సాఫల్యం

మంచి పనులు ఆచరించేవారు, దానాలు చేసేవారు అల్లాహ్‌కు ప్రీతిపాత్రులవుతారు. తమ సంపదను అల్లాహ్‌ చూపిన మార్గంలో ఖర్చు చేసేవారి ఉపమానాన్ని దివ్య ఖుర్‌ఆన్‌ వివరిస్తూ... ‘‘ఒక విత్తనాన్ని నాటితే, అది మొలిచి... ఏడు వెన్నులను ఈనుతుంది. ప్రతి వెన్నుకూ నూరేసి గింజలు ఉంటాయి. ఇదే విధంగా తాను కోరినవారి సత్కార్యాన్ని అల్లాహ్‌ వికసింపజేస్తాడు’’ అని చెప్పింది. ‘‘ప్రతిరోజూ ఇద్దరు దైవ దూతలు భూలోకానికి దిగి వస్తారు. వారిలో ఒకరు ‘‘ఓ అల్లాహ్‌! నీ మార్గంలో ధనం ఖర్చుచేసేవాడికి సుగుణవంతులైన సంతానాన్ని అనుగ్రహించు’’ అని ప్రార్థిస్తాడు. రెండవ దూత ‘‘ఓ అల్లాహ్‌! పిసినారికి అతడి ధనాన్ని నాశనం చేసే సంతానాన్ని ప్రసాదించు’’ అని శపిస్తూ ఉంటాడు’’ అని దైవ ప్రవక్త మహమ్మద్‌ తెలిపారు.


దానం దైవాగ్రహాన్ని శాంతపరుస్తుంది. నికృష్టమైన చావు నుంచి కాపాడుతుంది. ఆయుష్షును పెంచుతుంది. గర్వాన్నీ, అహంకారాన్నీ దూరం చేస్తుంది. దానశీలికి శుభం కలగాలని దైవ దూతలు ప్రార్థిస్తూ ఉంటారు. దానం చేసేవారు అందరికన్నా ముందుగా స్వర్గంలోకి ప్రవేశిస్తారు ‘‘దైవ గ్రంథాన్ని పఠించేవారు, ప్రార్థనా వ్యవస్థను నెలకొల్పేవారు, మేము ప్రసాదించిన ఉపాధి నుంచి రహస్యంగానూ, బహిరంగంగానూ దానం చేసేవారు దేవుడు తమకు పూర్తి ప్రతిఫలం ఇవ్వడంతో పాటు... తన ప్రత్యేక అనుగ్రహంతో మరింత ఫలితం ప్రసాదిస్తాడన్న ఆశతో తమ సర్వస్వం ధారపోస్తారు. నిజంగా దేవుడు ఎంతో క్షమించేవాడు, ఆదరించేవాడు’’ అని దివ్య ఖుర్‌ఆన్‌ పేర్కొంటోంది. ‘‘మీరు అమితంగా ప్రేమించే వస్తువులను అల్లాహ్‌ మార్గంలో ఖర్చు పెట్టనంతవరకూ మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు. మీరు ఖర్చు చేసేదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు. తమ సంపదను మంచి మార్గంలో ఖర్చు చేసేవారు తమ ప్రభువు నుంచి ప్రతిఫలాన్ని పొందుతారు. వారికి ఏ విధమైన భయం కానీ, దుఃఖం కానీ కలిగే అవకాశం లేదు. వారు నిరుపేదలైనప్పటికీ ఇతరుల అవసరాలకే ప్రాధాన్యం ఇస్తారు. పేరాశ, పిసినారితనాల నుంచి రక్షణ పొందినవారే ధన్యులు’’ అని దివ్య ఖుర్‌ఆన్‌ వివిధ సందర్భాల్లో చెబుతోంది. అంతటి పవిత్రమైన దానగుణాన్ని, సత్కార్యాలను ఆచరించే బుద్ధిని ఇవ్వాలని అల్లాహ్‌ను కోరుకోవాలి.

  మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2022-01-21T05:30:00+05:30 IST