దట్టమైన అడవిలో ఇంత రోడ్డా...!!

ABN , First Publish Date - 2021-08-19T06:06:12+05:30 IST

దట్టమైన అడవిలో..

దట్టమైన అడవిలో ఇంత రోడ్డా...!!

లేటరైట్‌ తవ్వకాల కోసమే నిర్మాణం

నిర్ధారణకు వచ్చిన ఎన్జీటీ విచారణ కమిటీ?

రోడ్డు, మైనింగ్‌ కోసం ప్రకృతిని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన సభ్యులు

అటవీ, పర్యావరణ చట్టాల ఉల్లంఘనపై సీరియస్‌


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): నాతవరం మండలం సుందరకోట పంచాయతీ పరిధిలోని భమిడికలొద్దిలో లేటరైట్‌ తవ్వకాల కోసం ప్రకృతిని ధ్వంసం చేయడాన్ని ఎన్జీటీ నియమించిన విచారణ కమిటీలోని కొందరు సభ్యులు తీవ్రంగా పరిగణించినట్టు తెలిసింది. దట్టమైన అడవిలో ఇంత విశాలమైన రహదారిని ఎందుకు నిర్మించారు?, 30 నుంచి 50 అడుగుల రహదారి గిరిజనులకు అవసరం లేదే...కేవలం లేటరైట్‌ తరలింపు కోసం వేసి వుంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. కొండపైకి ఇంత రోడ్డు అవసరమా...ఇంత వెడల్పున రోడ్డు ఎలా వేశారు... అంటూ కమిటీలోని పర్యావరణ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎన్జీటీ నియమించిన కమిటీలోని పర్యావరణ అధికారులు ముందుగా లేటరైట్‌ తవ్వకాలు జరుపుతున్న కొండ పైకి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. దట్టమైన అడవిలో రోడ్డు నిర్మాణం, లేటరైట్‌ తవ్వకాల కోసం భారీ వృక్షాలను తొలగించినట్టు వారు గుర్తించినట్టు తెలిసింది. రోడ్డు నిర్మాణానికి ఎలా అనుమతి ఇచ్చారని అటవీ శాఖ అధికారులను అడగ్గా...వారు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలినట్టు తెలిసింది.


ఈ ప్రాంతం రెవెన్యూ పరిధిలోకి వస్తుందని చెప్పి...తప్పించుకోవడానికి చూసినట్టు తెలిసింది. రెవెన్యూ పరిధిలో వున్నా అటవీ శాఖ అనుమతి తీసుకోవాలని కమిటీ సభ్యులు స్పష్టంచేశారు. కాగా 20 సంవత్సరాల పాటు లీజుదారుడు ఏడాదికి పది లక్షల టన్నుల లేటరైట్‌ తవ్వుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ  లెక్కన భవిష్యత్తులో కొండ మొత్తం తవ్వకాలు జరిపే అవకాశం వున్నదని కిందిస్థాయి సిబ్బంది అధికారులకు చెప్పినట్టు తెలిసింది. కమిటీ బృందం అన్ని అంశాలను నిశితంగా పరిశీలించడంతో గనులు, అటవీ శాఖ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తం మీద రోడ్డు నిర్మాణం, మైనింగ్‌ కోసం పర్యావరణ, అటవీ చట్టాలు ఉల్లంఘించినట్టు కమిటీ గుర్తించినట్టు తెలిసింది. చెట్లు నరికి మానులు దగ్ధం చేసినట్టు అక్కడక్కడా ఆనవాళ్లు ఉన్నాయి. కాగా కలెక్టర్‌ మ్యాప్‌ను పరిశీలిస్తుండగా అక్కడ వైసీపీ నేతలు ప్రత్యక్షం కావడం గమనార్హం. ఇదిలావుండగా సరుగుడు, సందరకోట పంచాయతీలకు చెందిన గిరిజనులు కూడా భమిడికలొద్ది చేరుకున్నారు.


అధికారులు ఏం మాట్లాడుకుంటున్నారు?, కమిటీకి ఫిర్యాదుదారుడు మరిడయ్య ఏం చెబుతున్నారనేది ఆసక్తిగా గమనించారు. అయితే లీజుదారుడు, బినామీలు పత్తాలేకుండా పోయారు.  వారి వద్ద పనిచేసే యువకులు, కొందరు అనుకూల గ్రామస్థులు మాత్రమే అక్కడకు వచ్చారు. రెండు, మూడు నెలలుగా తీవ్ర చర్చనీయాంశంగా వున్న లేటరైట్‌ తవ్వకాలపై కమిటీ సమర్పించే నివేదిక ఎలా వుంటుందనే ఉత్కంఠ నెలకొంది. 


అంశాలన్నీ పరిశీలించిన తర్వాత ఎన్జీటీకి నివేదిక: కలెక్టర్‌ మల్లికార్జున

భమిడికలొద్ది లేటరైట్‌ మైనింగ్‌ ప్రాంతాన్ని ఎన్జీటీ నియమించిన కమిటీ సందర్శించి అన్ని అంశాలు పరిశీలించినట్టు జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు. బుధవారం లేటరైట్‌ మైనింగ్‌ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఎన్జీటీ ఆదేశాల మేరకు వివిధ శాఖలకు చెందిన అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్నామన్నారు. లేటరైట్‌ మైనింగ్‌పై ఎన్జీటీ లేవనెత్తిన ఏడు అంశాలను పరిశీలించామన్నారు. అంశాల వారీగా అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత నివేదికను అందజేస్తామని ఆయన అన్నారు.

Updated Date - 2021-08-19T06:06:12+05:30 IST