ఆ దేశ ప్రధాని అరెస్ట్.... ఇంటర్నెట్ కట్...

ABN , First Publish Date - 2021-10-25T21:41:13+05:30 IST

సూడాన్‌లో సైనిక తిరుగుబాటు జరిగినట్లు తెలుస్తోంది

ఆ దేశ ప్రధాని అరెస్ట్.... ఇంటర్నెట్ కట్...

కైరో : సూడాన్‌లో సైనిక తిరుగుబాటు జరిగినట్లు తెలుస్తోంది. ఆ దేశ సమాచార మంత్రిత్వ శాఖ ఫేస్‌బుక్ పేజ్ ద్వారా వెల్లడించిన వివరాల ప్రకారం, ఆ దేశ తాత్కాలిక ప్రధాన మంత్రి అబ్దల్లా హమ్‌దోక్‌ను, ఉన్నత స్థాయి ప్రభుత్వ నేతలను సోమవారం సైనిక దళాలు అరెస్టు చేశాయి. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపేసి, వంతెనలను మూసివేశాయి. పీఎం ఆచూకీ తెలియడం లేదు. ఇదిలావుండగా, ఆ దేశ ప్రభుత్వ వార్తా చానల్ నైలు నది దృశ్యాలను, సంప్రదాయ దేశభక్తి సంగీతాన్ని ప్రసారం చేసింది. 


ఈ సైనిక తిరుగుబాటును నిరసిస్తూ వీథుల్లోకి రావాలని సూడాన్‌లోని అతి పెద్ద రాజకీయ పార్టీ, ప్రజాస్వామ్య అనుకూల వర్గం వేర్వేరుగా ప్రజలకు పిలుపునిచ్చాయి. దీంతో వేలాది మంది ప్రజలు ఖర్టౌమ్, ఒండుర్మన్ నగరాల వీథుల్లోకి వచ్చారు. వీథులను దిగ్బంధనం చేసి, టైర్లకు నిప్పు పెట్టారు. భద్రతా దళాలు వీరిపై బాష్పవాయు గోళాలను ప్రయోగించాయి. 


అధికారాన్ని సైన్యం లాక్కోవడం సూడాన్‌‌కు పెద్ద ఎదురు దెబ్బ. ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించి, సుదీర్ఘ కాలం నుంచి ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ఒమర్ అల్ బషీర్‌ను రెండేళ్ళ క్రితం గద్దె దించారు. ఆ తర్వాత ప్రజాస్వామ్యం వైపు ఈ దేశం వెళ్తోంది. 


సూడాన్ పౌర, సైనిక నాయకులు కొద్ది వారాల నుంచి పరస్పరం తలపడుతున్నారు. సెప్టెంబరులో జరిగిన సైనిక తిరుగుబాటు విఫలమవడంతో వీరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. అత్యంత సంప్రదాయవాదులైన ఇస్లామిస్టులు సైనిక ప్రభుత్వం ఏర్పడాలని గట్టిగా కోరారు. కొద్ది రోజుల క్రితం ఈ రెండు వర్గాలు వీథుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించాయి. 


సోమవారం అరెస్టయినవారిలో పరిశ్రమల శాఖ మంత్రి ఇబ్రహీం అల్ షేక్, సమాచార శాఖ మంత్రి హమ్జా బలౌల్, రూలింగ్ ట్రాన్సిషనల్ బాడీ ‘ది సావరిన్ కౌన్సిల్’ సభ్యుడు మహమ్మద్ అల్ ఫికీ సులిమాన్‌ ఉన్నట్లు సమాచార మంత్రిత్వ శాఖ తన ఫేస్‌బుక్ పేజీలో వివరించింది. 


Updated Date - 2021-10-25T21:41:13+05:30 IST