భద్రాద్రి జిల్లాలో గాలివాన

ABN , First Publish Date - 2021-04-14T05:35:19+05:30 IST

అకాల వర్షాలు అన్నదాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలుచోట్ల మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది.

భద్రాద్రి జిల్లాలో గాలివాన
ఇల్లెందులో కురుస్తున్న వర్షం

పలు మండలాల్లో దెబ్బతిన్న పంటలు 

నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

కొత్తగూడెం, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలు అన్నదాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలుచోట్ల మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా అనేకచోట్ల ఓ మోస్తారు వర్షం కురిసింది. గాలి దుమారంతో పలుచోట్ల వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఇల్లెందు, టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల, మణుగూరు, కరకగూడెం, అశ్వాపురం, కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్‌, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, ములకలపల్లి, చంద్రుగొండ, భద్రాచలం, బూర్గంపాడు తదితర మండలాల్లో గాలి దుమారంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. గాలి దుమారానికి పలుచోట్ల మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. కరకగూడెం, పినపాక, మణుగూరు, తదితర ప్రాంతాల్లో వేసంగి వరి కోతకు రావడంతో రైతులు ఆందోళన చెందారు. కల్లాల్లోని ధాన్యం తడవకుండా టార్పాలిన్‌ను కప్పారు. భద్రాచలంలోనూ మంగళవారం రాత్రి వర్షం పడగా రామాలయ మెట్లమార్గం వద్ద వాననీరు నిలిచింది. 

ఎర్రుపాలెం మండలంలో దెబ్బతిన్న పంటలు 

ఎర్రుపాలెం : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం, నర్సింహాపురం, నారాయణపురం, రేమిడిచర్ల, వెంకటాపురం తదితర గ్రామాల్లో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కొన్నిచోట్ల పంటలు దెబ్బతాన్నాయి. పలుచోట్ల మొక్కజొన్న నేలవాలింది. మామిడికాయలు నేలరాలాయి.  కల్లాల్లో ఆరబోసుకున్న ధాన్యాన్ని కాపాడుకొనేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. మండల ఉద్యానవన అధికారి వేణు, ఏవో విజయభాస్కర్‌రెడ్డి మంగళవారం దెబ్బతిన్న పంటలను  పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరిగిన నష్టాన్ని ప్రాథమిక అంచనా వేసి జిల్లా అధికారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు. 


Updated Date - 2021-04-14T05:35:19+05:30 IST