ఆస్పత్రి నుంచి సుధాకర్‌ డిశ్చార్జ్‌

ABN , First Publish Date - 2020-06-06T09:35:52+05:30 IST

విశాఖ మానసిక వైద్యశాల నుంచి డాక్టర్‌ సుధాకర్‌ శుక్రవారం రాత్రి డిశ్చార్జ్‌ అయ్యారు. కావాలనుకుంటే ఆయన హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ కావచ్చని హైకోర్టు శుక్రవారమే అనుమతించడంతో

ఆస్పత్రి నుంచి సుధాకర్‌ డిశ్చార్జ్‌

  • హైకోర్టు అనుమతితో బయటకు..
  • ఆయనే వచ్చి ఆస్పత్రిలో చేరారట!
  • మానసిక వైద్యశాల డాక్టర్ల ప్రకటన


విశాఖపట్నం/అమరావతి, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): విశాఖ మానసిక వైద్యశాల నుంచి డాక్టర్‌ సుధాకర్‌ శుక్రవారం రాత్రి డిశ్చార్జ్‌ అయ్యారు. కావాలనుకుంటే ఆయన హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ కావచ్చని హైకోర్టు శుక్రవారమే అనుమతించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు అక్రమంగా నిర్బంధించి మెంటల్‌ ఆస్పత్రిలో ఉంచిన తన కుమారుడిని కోర్టులో హాజరుపరచాలని.. లేదా ఆయనకు నచ్చిన ఆస్పత్రిలో చికిత్స పొందే స్వేచ్ఛను ప్రసాదించాలని అభ్యర్థిస్తూ సుధాకర్‌ తల్లి కొలవెంటి కావేరీ లక్ష్మీబాయి గురువారం హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. అందరి వాదనలను ఆలకించాక.. డిశ్చార్జ్‌ విషయంలో సుధాకర్‌కు స్వేచ్ఛ కల్పించింది. సీబీఐ విచారణకు ఆయన సహకరించాలని సూచించింది. దీంతో ఆయన్ను పెదవాల్తేరు ప్రభుత్వ మానసిక వైద్యశాల నుంచి శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో డిశ్చార్జ్‌ చేశారు. ఆ సమయంలో ఆయన వెంట తల్లి కావేరీబాయి, భార్య, కుమారుడు, టీడీపీ అర్బన్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పుచ్చా విజయ్‌కుమార్‌ ఉన్నారు. కాగా.. ఆయన డిశ్చార్జ్‌పై ఆస్పత్రి వైద్యుల ప్రకటన విస్మయం గొల్పుతోంది. మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం-2017లోని సెక్షన్‌ 85 ప్రకారం.. గతనెల 16న డాక్టర్‌ సుధాకర్‌ మానసిక సంరక్షణ కోసం స్వయంగా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొన్నారు. ఫ్యామిలీ వార్డులో కుటుంబ సభ్యులతోపాటు ఆయన ఉంటున్నట్లు తెలిపారు. రోగిని డిశ్చార్జ్‌ చేయాలని గౌరవ న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వడంతో... కుటుంబ సభ్యులతో బయటకు పంపించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రకటనపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకవేళ సుధాకరే వ్యక్తిగతంగా వచ్చి ఆస్పత్రిలో చేరి ఉంటే.. గత కొద్దిరోజులుగా అక్కడ ఉండలేనని, తనను డిశ్చార్జ్‌ చేయాలని, వేరే ఆస్పత్రికి పంపాలని అడుగుతున్నా ఎందుకు అధికారులు పరిగణనలోకి తీసుకోలేదన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అలాగే ఆస్పత్రిలో వైద్యం అందుతున్న తీరు, వైద్యులు వ్యవహరిస్తున్న విధానం సరిగా లేదని, సుధాకర్‌ అక్కడే ఉంటే మానసిక రోగిగా మారిపోతాడన్న భయాందోళనను వ్యక్తంచేస్తూ ఆయన తల్లి హైకోర్టులో పిటిషన్‌ వేయాల్సిన అవసరం ఎందుకొస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.


న్యాయాన్ని కోర్టులే గెలిపించాయి: కావేరీబాయి

మెంటల్‌ ఆస్పత్రి నుంచి తన కుమారుడిని డిశ్చార్జ్‌ చేసేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడం ఆనందంగా ఉందని సుధాకర్‌ తల్లి కావేరీబాయి అన్నారు. డిశ్చార్జ్‌కు ముందు ఆమె మీడియాతో మాట్లాడారు. సుధాకర్‌ను ఆస్పత్రిలోనే ఉంచి మానసిక రోగిగా చిత్రీకరించేందుకు ప్రభుత్వం ఎంతగానో యత్నించిందని ఆరోపించారు. అయితే కోర్టులే న్యాయాన్ని గెలిపించాయన్నారు. దేవుడు, న్యాయమూర్తుల వల్లే తన బిడ్డ బయటకు వస్తున్నాడని.. ఆస్పత్రి నుంచి వచ్చాక సుధాకర్‌ తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తాడని తెలిపారు. ఈ కేసును సీబీఐ విచారిస్తున్న నేపథ్యంలో తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. సీబీఐ అధికారులు పిలిస్తే ఒకసారి వెళ్లానని, తక్కువ సమయం మాత్రమే ఉండడంతో పూర్తి వివరాలు వెల్లడించలేకపోయానని, మరోసారి పిలిస్తే అన్ని విషయాలను తెలియజేస్తానని చెప్పారు. ఆస్పత్రి నుంచి తీసుకొచ్చాక మెరుగైన వైద్యం కోసం సుధాకర్‌ను మరో ఆస్పత్రిలో చేర్పిస్తామన్నారు. తన బిడ్డలా ఎవరికి అన్యాయం జరిగినా రోడ్డుపైకి వచ్చి పోరాడతానని చెప్పారు. పుచ్చా విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. దళిత డాక్టర్‌ను ఇబ్బందులకు గురిచేయడం దారుణమని.. ఒక కుటుంబం పరువును బజారుకీడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును ఒక తల్లి విజయంగా పేర్కొన్నారు.

Updated Date - 2020-06-06T09:35:52+05:30 IST