కవి దిగ్గజం.. ఆచార్య ఎండ్లూరి

ABN , First Publish Date - 2022-01-29T06:59:25+05:30 IST

తెలుగు సాహిత్యానికి జీవం పోసి కవి దిగ్గజంగా ఖ్యాతిపొందిన తెలు గు విశ్వవిద్యాలయం సాహిత్యపీఠం మాజీ పీఠాధిపతి ఎం డ్లూరి సుధాకర్‌ హఠాన్మరణం సాహిత్యప్రియుల్ని కలచివేసింది.

కవి దిగ్గజం.. ఆచార్య ఎండ్లూరి

  • ఆకస్మిక మృతితో రాజమహేంద్రవరంలో విషాదఛాయలు

రాజమహేంద్రవరం సిటీ/యానాం, జనవరి 28: తెలుగు సాహిత్యానికి జీవం పోసి కవి దిగ్గజంగా ఖ్యాతిపొందిన తెలు గు విశ్వవిద్యాలయం సాహిత్యపీఠం మాజీ పీఠాధిపతి ఎం డ్లూరి సుధాకర్‌ హఠాన్మరణం సాహిత్యప్రియుల్ని కలచివేసింది. తెలుగు దళిత కవిత్వంతో ఆయన వారి హృదాయల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగువిశ్వవిద్యాలయం బొ మ్మూరు సాహిత్యపీఠంలో ప్రొఫెసర్‌గా, పీఠాధిపతిగా విశేష మైన సేవలందించి యూనివర్సిటీని అభివృద్ధి పథంలో నడిపించారు. భార్య హేమలత మరణానంతరం హైదరాబాద్‌కు బదిలీఅయ్యారు. ఆయన మృతి రాజమహేంద్రవరం తెలుగు యూనివర్సిటీని, సాహితీవేత్తలను, కవులను, ఆప్తమిత్రులను కలచివేసింది. సాహిత్య సభల్లో సుధాకర్‌ ఒక కవిత్వాన్ని చెప్పేవారు. ‘‘చంచల మనస్కులు కావొద్దు.. చంచల్‌గూడా జైలుకు పోవొద్దు’’ అనే రెండు లైన్ల కవిత్వం అప్పట్లో హైలెట్‌గా నిలిచింది. సుధాకర్‌ మృతి పట్ల ప్రముఖ కవి గూటం స్వామి, కొయ్యన కుమారి, ఫిలాంత్రోఫిక్‌ సొసైటీ నిర్వాహకుడు రాజయోనా సంతాపం ప్రకటించారు.

ఫ దళిత సాహిత్యంలో మేరు పర్వతం ఎండ్లూరి: కవిసంధ్య సంపాదకుడు డాక్టర్‌ శిఖామణి, యానాం

వర్తమాన తెలుగు కవిత్వంలో, దళిత సాహిత్యంలో మేరు పర్వతం వంటివారు ఎండ్లూరి సుధాకర్‌. యానాంలో కవిసంధ్య నిర్వహించిన అనేక సదస్సులకు ఆయన హాజరయ్యరు. చిరునవ్వే పలకరింపుగా ఎదురయ్యే సుధాకర్‌ ఇంత అకస్మాత్తుగా నిష్క్రమించడం దుఃఖాన్ని మిగిల్చింది. ఆధునిక దళిత కవిత్వానికి సౌందార్యాన్ని, తాత్వికతను అద్దిన జాషువా వారసుడు ఎండ్లూరి. మావూరి మైసమ్మ, గూర్ఖా, సహచరి వంటి మానవీయ వస్తువులను గొప్ప ఆర్ధతతో కవిత్వీకరించిన కవనశిల్పి. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మొదలైనప్పుడు సాహిత్యంలో దానికి నాయకత్వం వహించి కొత్తగబ్బిలం, గోసంగి వంటి కావ్యాలు రచించి మాదిగల హక్కులకు కాపలాదారులా నిలిచారు. సుధాకర్‌తో 30ఏళ్లపైబడి అనుబంధం ఉంది. తెలుగు విశ్వవిద్యాలయం బొమ్మూరు సాహిత్యపీఠంలో కలిసి పనిచేశాం. చిన్నారులు మానస, మనోజ్ఞాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. సుధాకర్‌ మరణానికి కవిసంధ్య తీవ్ర సంతాపాన్ని తెలియజేసింది.

ఫ నమ్మిన సిద్ధాంతాలను ఆచరించడంలో ఆదర్శవాది

ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాకుండా తాను నమ్మిన సిద్ధాంతాలను అనుసరించడంలో ఆదర్శవాది ఎండ్లూరి సుధాకర్‌. తెలుగు యూనివర్సిటీ సాహిత్య పీఠాఽధిపతిగా ఆయన చేసిన సేవలు ఎనలేనివి. ఆయన రాసిన కొత్త గబ్బిలం, వర్తమానం రచనలు సమాజాన్ని ప్రభావితం చేశాయి. ఎండ్లూరి మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నాం.

-సన్నిధానం శాస్త్రి, నరసింహశర్మ, బ్రౌన్‌ మందిర నిర్వాహకులు, రాజమహేంద్రవరం

ఫ సాహిత్య లోకానికి తీరనిలోటు 

కవి గుర్రం జాషువా తర్వాత ఆ స్థాయిలో సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన కవి ఎండ్లూరి. ఆయన మృతి కవులకు, రచయతలకు, తెలుగు సాహిత్యానికి తీరని లోటు, ఆయన ఆత్మకు శాంతి కలగాలి.

-పీవీబీ సంజీవరావు, ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల

తెలుగు విభాగాధిపతి, రాజమహేంద్రవరం

ఫ దిగ్ర్భాంతి కలిగించింది..

తెలుగు, ఉర్ధూ భాషల్లో పాండిత్యంగల గొప్పకవి ఎం డ్లూరి. వర్తమానం, కొత్తగబ్బిలం, నల్లద్రాక్ష పందిరి, వర్గీకరణం, ఆటజనికాంచె, గొసంగి కవితా సంపుటులు రచించిన ప్రతిభావంతుడు. మల్లెమొగ్గలు, గొడుగు కథలు తన జాతి వాస్తవిక పరిస్థితిని కళ్ల ముందుంచాయి. ఆయన మరణం దిగ్ర్భాంతి కలిగించింది.

-కవి, కథకుడు దాట్ల దేవదానంరాజు, యానాం

Updated Date - 2022-01-29T06:59:25+05:30 IST