సూయజ్‌లో అడ్డు.. ప్రపంచానికి గడ్డు

ABN , First Publish Date - 2021-03-27T17:53:57+05:30 IST

సూయజ్‌ కాలువలో జపాన్‌ నౌక ‘ఎవర్‌ గివెన్‌’ అడ్డుగా నిలవడంతో ప్రపంచదేశాలు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి.

సూయజ్‌లో అడ్డు.. ప్రపంచానికి గడ్డు

జపాన్‌ నౌక అడ్డంకి కారణంగా పలు ఇబ్బందులు

రోజుకు రూ. 75వేల కోట్ల సరకు రవాణాపై ప్రభావం


కైరో, మార్చి 26: సూయజ్‌ కాలువలో జపాన్‌ నౌక ‘ఎవర్‌ గివెన్‌’ అడ్డుగా నిలవడంతో ప్రపంచదేశాలు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఐరోపా దేశాలు, అమెరికా చమురు దిగుమతి కోసం ఇదే మార్గాన్ని ఆశ్రయిస్తాయి. కాలువలో ప్రయాణాన్ని పునరుద్ధరించేందుకు కొన్ని వారాల వరకూ సమయం పట్టవచ్చని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో.. ఈ దేశాల్లో చమురు ధరలు పెరిగాయి. ఇవే కాక.. పలు రకాల వస్తువులూ ధరలు పెరిగే అవకాశమందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగే పని లేకుండా.. కేవలం 194 కిలోమీటర్ల పొడవున్న ఈ కాలువలో ప్రయాణించి అరేబియా సముద్రం నుంచి మధ్యధరా సముద్రంలోకి ప్రవేశించవచ్చు.


దీని వలన ఐరోపా దేశాలకు 8900 కిలోమీటర్ల దూరం తగ్గింది. సుమారు 10రోజుల సమయం, ఆ ప్రయాణానికి తగ్గ ఇంధనం నౌకలకు ఆదా అవుతోంది. ఈ సౌకర్యం కోసమే 1869లో సూయజ్‌ కాలువను తెరిచారు. అప్పటి నుంచీ అంతర్జాతీయ వాణిజ్యానికి ఇది కేంద్ర బిందువుగా మారింది. ప్రస్తుత అడ్డంకి కారణంగా రోజుకు రూ. 75వేల కోట్ల విలువైన సరుకు నిలిచిపోతోందని అంచనా. శుక్రవారం నాటికి 240 నౌకలు ఇరువైపులా నిలిచిపోయాయి. వీటిలో రెండు భారత నౌకలు కూడా ఉండటం గమనార్హం. అన్నట్లు.. భారత్‌కు చమురు గల్ఫ్‌ దేశాల నుంచి దిగుమతి అవుతున్న నేపథ్యంలో, దేశంలో చమురు ధరలపై సూయజ్‌ కెనాల్‌ ప్రభావం లేదు.

Updated Date - 2021-03-27T17:53:57+05:30 IST