భవిష్యత్‌ ఉపాధ్యాయుల బాధలు!

ABN , First Publish Date - 2022-09-08T06:33:31+05:30 IST

భవిష్యత్‌ ఉపాధ్యాయులను తయారు చేసే ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం డైట్‌ వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. జిల్లాకేంద్రంలోని నాగారం ప్రాంతంలో ఉన్న డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వైఖరితో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టాయి.

భవిష్యత్‌ ఉపాధ్యాయుల బాధలు!
డైట్‌ కళాశాల ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాలు

వివాదాలకు నిలయంగా మారిన ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం

రోజురోజుకూ వివాదాస్పదమవుతున్న డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వైఖరి

రూ.10 లక్షల నిధులు గోల్‌మాల్‌ 

సరిపడా శిక్షకులు లేక తప్పని తిప్పలు

ఆందోళన బాటలో డైట్‌ విద్యార్థులు, పలు విద్యార్థి సంఘాలు

జిల్లాకేంద్రంలోని శిక్షణ కేంద్రంలో 300 మంది విద్యార్థులు 

నిజామాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 7: భవిష్యత్‌ ఉపాధ్యాయులను తయారు చేసే ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం డైట్‌ వివాదాలకు కేంద్రబిందువుగా మారింది.  జిల్లాకేంద్రంలోని నాగారం ప్రాంతంలో ఉన్న డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వైఖరితో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టాయి. జిల్లా విద్యా శిక్షణ సంస్థలో ఇది వరకు రెండేళ్ల కాలపరిమితితో టీటీసీ కోర్సు ఉండేది. ఇప్పుడు అదే కోర్సును డీఎడ్‌ కోర్సుగా మార్చారు. రెండేళ్ల కోర్సు కోసం డైట్‌లో ప్రస్తుతం 300 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ మీడియాలలో ఒక్కో మీడియానికి 50 మంది చొప్పున డైట్‌లో శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం సెకండ్‌ ఇయర్‌ కోర్సు పూర్తికాగా మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ పూర్తయింది. భవిష్యత్‌ ఉపాధ్యాయులను తయారు చేసేందుకు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ కోసం ఏర్పాటు చేసిన డైట్‌ సమస్యల నిలయంగా మారింది. శిక్షణతో పాటు రెండేళ్ల కోర్సు నిర్వహణకు 29 మం ది శిక్షకులు అవసరం ఉండగా.. ప్రిన్సిపాల్‌ పోస్టు తప్ప ఒక్క రెగ్యులర్‌ శిక్షకు డు డైట్‌లో లేకపోవడం గమనార్హం. ఆరుగురు గెస్ట్‌ లెక్చరర్స్‌తో కోర్సులను నిర్వహిస్తుండగా.. గత 38 ఏళ్లుగా డైట్‌లోనే లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌రావు వైఖరి వివాదాస్పదమవుతోంది. శిక్షణ పొందుతున్న విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నట్లు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు బుధవారం డైట్‌ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించాయి. డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వైఖరిపై ఇది వరకు అనేక ఫిర్యాదులు జిల్లా అధికారులకు, ఆర్‌జేడీకి చేరినా.. ప్రిన్సిపాల్‌ వైఖరిలో మాత్రం మార్పు రావడంలేదు. భవిష్యత్‌ ఉపాధ్యాయులను తీర్చిదిద్దే శిక్షణ సంస్థ వివాదాల  సుడిగుండంలో చిక్కుకోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

రెగ్యూలర్‌ శిక్షకులు ఏరీ?

భవిష్యత్‌ తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను తయారు చేసే డైట్‌ కళాశా లలో రెగ్యూలర్‌ శిక్షకులు లేక కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం డైట్‌ కళాశాలో డీఎల్‌ఎడ్‌  ఇంగ్లీష్‌, తెలుగు, ఉర్దూ మీడియం కోర్సులు నిర్వహిస్తున్నారు. ఒక్కో మీడియంలో 50 మంది విద్యార్థుల చొప్పున మొత్తం రెండు సంవత్సరాల కోర్సులో 300 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. డీఎల్‌, ఎడ్‌ శిక్షణతో పాటు ఉపాధ్యాయుల శిక్షణ కోసం మొత్తం 29 మంది లెక్చరర్లు అవసరం ఉండగా.. ప్రస్తుతం ప్రిన్సిపాల్‌ మాత్రమే రెగ్యులర్‌ లెక్చరర్‌గా ఉన్నారు. డీఎల్‌ఎడ్‌ కోర్సు బోధనకు 16 మంది లెక్చరర్స్‌ అవసరం కాగా.. ఆరుగురు గెస్ట్‌ లెక్చరర్స్‌తో బోధన నిర్వహిస్తున్నారు. ఇందులో ముగ్గురు గెస్ట్‌ లెక్చరర్స్‌ కాగా ముగ్గురు ఇంగ్లీష్‌ శిక్షణ కోసం విద్యాశాఖ ఇచ్చిన లెక్చరర్స్‌ ఉన్నారు. అలాగే ఉర్దూ మీడియం కోసం లెక్చరర్స్‌ లేకపోగా.. మూడు రోజులకు ఒకరు బోధన కోసం ఇతర ఉపాధ్యాయులను వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది.

వివాదాస్పదంగా ప్రిన్సిపాల్‌ తీరు

గత 30 ఏళ్లుగా డైట్‌ కళాశాలలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌రావు వైఖరి వివాదాస్పదంగా మారింది. విద్యార్థులను వేధింపుల కు గురిచేయడం, నిధుల గోల్‌మాల్‌, తదితర అంశాల విషయమై విద్యార్థులు బహిరంగంగా చెబుతున్నారు. సుప్రీం కోర్టులో సర్వీస్‌ రూల్స్‌, పదోన్నతుల అంశం పెండింగ్‌లో ఉండగా.. లోకల్‌బాడీ టీచర్‌ అయిన శ్రీనివాస్‌రావుకు డైట్‌ ప్రిన్సిపాల్‌గా నియమించడంపై ఇది వరకే ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేశారు. గత రెండేళ్లుగా ఉపాధ్యాయుల శిక్షణ కోసం వచ్చిన రూ.10లక్షలకు పైగా నిధులు పక్కదారి పట్టినట్టు విమర్శలు ఉన్నాయి. ఇటీవల ఆడిట్‌ అధికారుల తనిఖిల్లోనూ ఈ విషయం  బయటపడినట్టు తెలుస్తుంది. నిధుల దుర్వినియోగంపై ఆడిట్‌ అధికారులు ఆర్‌జేడీకీ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ప్రిన్సిపాల్‌ విద్యార్థులకు నిర్వహించాల్సిన ప్రాక్టికల్స్‌ పరిక్షల్లోనూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు.

విద్యార్థి సంఘాల ఆందోళన

విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్‌ వైఖరిని నిరసిస్తూ బుధవారం ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాలు వేర్వేరుగా డైట్‌ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించాయి. రెగ్యులర్‌ స్టాఫ్‌ లేకపోవడంతో పాటు ప్రిన్సిపాల్‌ విద్యార్థులపట్ల అవలంభిస్తున్న వైఖరిపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే ప్రిన్సిపాల్‌ మాత్రం అవేమీ పట్టించుకోకుం డా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అనిల్‌, మహేష్‌లు అన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు.

కళాశాలలో ఇబ్బందులపై ప్రభుత్వానికి నివేదించాం

: శ్రీనివాస్‌, డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, నిజామాబాద్‌

డైట్‌ కళాశాలలో సిబ్బంది కొరతపై ఇదివరకే ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. అలాగే, లెక్చరర్‌ల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. విద్యార్థులకు సరిపడా వసతి ఉన్నా.. బాత్రూంలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై కూడా సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు నివేదిక పంపాం.

Updated Date - 2022-09-08T06:33:31+05:30 IST