Abn logo
Mar 17 2020 @ 00:38AM

కశ్మీరంలో సూఫీగానం

భారతదేశ సంస్కృతిని, ఇతిహాసాన్ని అర్థం చేసుకున్న అనేకమంది సూఫీ తత్వజ్ఞులు ఈ నేలా, ఈ గాలిలో విలసిల్లుతున్న సర్వ మానవ సౌభ్రాతృత్వం గురించి ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. 15వ శతాబ్దంలో భక్తి ఉద్యమాన్ని ప్రేరేపించి, హిందూ ముస్లింలిరువురికీ కబీర్ ఆరాధ్యుడయ్యాడు. ఆ పరంపరకు చెందిన సూఫీలు ఇవాళ కశ్మీర్‌లో సూఫీతత్వాన్ని ప్రబోధించడం ద్వారా శాంతియుత వాతావరణం ఏర్పర్చడానికి ముందుకు రావడం ముదావహం.


గతఆదివారం కొంతమంది సూఫీ సాధువులు హోంమంత్రి అమిత్ షాను కలుసుకుని కశ్మీర్ లోయలో ఇంటింటికీ సూఫీతత్వాన్ని తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలను మతతత్వవాదులుగా అభివర్ణిస్తూ ప్రజల మనసులను కలుషితం చేసేందుకు నిత్యం ప్రయత్నించే కాంగ్రెస్, వామపక్ష వాదులు, కుహనా లౌకిక వాదులు ఈ పరిణామాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. భారతదేశ సంస్కృతిని, ఇతిహాసాన్ని అర్థం చేసుకున్న అనేకమంది సూఫీ తత్వజ్ఞులు ఈ నేలలో ఇంకిపోయిన సర్వ మానవ సౌభ్రాతృత్వ లక్షణాల గురించి ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. 15వ శతాబ్దపు కబీర్ హిందూ భక్తి ఉద్యమాన్ని ప్రేరేపించి, హిందూ ముస్లింలిద్దరికీ ఆరాధ్యుడయ్యాడు. ఆ పరంపరకు చెందిన సూఫీలు ఇవాళ కశ్మీర్‌లో సూఫీతత్వాన్ని ప్రబోధించడం ద్వారా శాంతియుత వాతావరణం ఏర్పర్చగలమని హోంమంత్రికి చెప్పడం విశేషం. కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు తర్వాత సయ్యద్ నసీరుద్దీన్ చిష్టీ నేతృత్వంలోని అనేకమంది సూఫీలు ఆ రాష్ట్రంలో పర్యటించి భారత రాజ్యాంగం పరిధిలో సాధికారిత పొందడం ద్వారానే పరిస్థితులు మెరుగు కాగలవని, ఉగ్రవాదుల వలలో చిక్కుకుపోవద్దని అక్కడి యువకులకు ప్రభోదిస్తూ వచ్చారు. వారే అయోధ్య తీర్పుకు ముందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌తో కలిసి, తీర్పు తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూసేందుకు సమావేశాలు నిర్వహించారు. అమిత్ షాను కలిసిన కొందరు సూఫీ సాధువులు కాషాయం కూడా ధరించారు. ‘ఇదేమిటి, మీరు కాషాయం ధరించారని కొందరు ప్రశ్నించినప్పుడు దాదాపు 8 శతాబ్దాల క్రితం భారత దేశంలో సూఫీ ఇస్లాంను ప్రారంభించిన ఖ్వాజా మొయినుద్దీనే హిందూత్వ వాదానికి ప్రతిబింబమైన కాషాయాన్ని సూఫీలు కూడా స్వీకరించాలని చెప్పినట్లు సయ్యద్ నసీరుద్దీన్ చిష్టీ గుర్తు చేశారు. కశ్మీర్‌లో పరిస్థితి మెరుగుపడుతోందని, సూఫీ బోధనలను ఇంటింటికీ తీసుకు వెళ్లడం ద్వారా మరింత శాంతిని నెలకొల్పగలమని ఆయన అన్నారు. ఢిల్లీ అల్లర్లపై నిష్పాక్షికమైన దర్యాప్తు జరిపించి, ఎవరు హింసాకాండ నిర్వహించారో తేల్చాలని సూఫీ సాధువులు అమిత్ షాను కోరారు.


నిజానికి ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలు ఎంత తీవ్ర స్థాయికి చేరుకున్నాయంటే అక్కడ సర్వమత భావనను ప్రతిబింబించే ఏ సంస్కృతికీ చోటు లేకుండా చేశారు. అనేక మంది కశ్మీరీ పండిట్‌లను ఊచకోత కోసి, వారి కుటుంబాలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని దేశంలో ఇతర ప్రాంతాలకు తరలివెళ్లేలా చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా కశ్మీర్ సూఫీ సంస్కృతినే విధ్వంసం చేశారు. అక్కడ సూఫీ సంస్కృతిని ఏ మాత్రం పరిరక్షించినా, హిందువులు, ముస్లింలు అక్కడ కలిసిమెలిసి జీవించేవారు. నిజమైన కశ్మీరియత్‌ అక్కడ వెల్లివిరిసేందుకు అవకాశం ఉండేది.


ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రస్తుతం ఆకాంక్షిస్తున్నది ఇలాంటి వసుధైక కుటుంబ భావనే. ఈ ఉద్దేశంతోనే ఢిల్లీలోని హుమాయూన్ సమాధి వద్ద మొఘల్ చక్రవర్తి ఔరంగ జేబు సోదరుడు దారా షిఖో సమాధి ఎక్కడున్నదో తెలుసుకునేందుకు మోదీ ప్రభుత్వం ఏడుగురు నిపుణులతో కమిటీని ఏర్పర్చింది. 16వ శతాబ్దంలో ఔరంగ జేబు తన తండ్రి షాజహాన్ అస్వస్థుడైన తర్వాత తన సోదరుడైన దారాషిఖోను ఓడించి వధించి గద్దెనెక్కాడు. పర్షియన్ సూఫీ సర్మాక్ కషానీ శిష్యుడైన దారా షిఖో హిందూ- ముస్లిం ఆధ్యాత్మిక వాదాన్ని జీర్ణించుకుని నిజమైన హిందూస్థానీగా గుర్తింపు పొందారు. భారతీయ ఇస్లామిక్ సంస్కృతిలో భాగమైన కళలను సాహిత్యాన్ని జీర్ణించుకున్నారు. రెండు మతాలను పోలుస్తూ విశ్లేషించారు. ఉపనిషత్తుల సారాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ముస్లిం మతోన్మాదిలా వ్యవహరించిన ఔరంగజేబు స్థానంలో దారాషిఖో కనుక చక్రవర్తి అయి ఉంటే భారతదేశ పరిస్థితులు భిన్నంగా ఉండేవని చరిత్రకారులు అంటారు. అందుకే ఆ బోధనలను మళ్లీ ప్రాచుర్యంలోకి తెచ్చే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ఆయన జ్ఞాపకాలను సజీవం చేసే ప్రయత్నం ప్రారంభించింది.


సూఫీ సాధువులు ఆశిస్తున్న విధంగానే కశ్మీర్‌లో ఒకప్పుడు నెలకొన్న విలువలను పునఃస్థాపన చేసి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నట్లు తాజాగా హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది. కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించే చర్యలు తీసుకుంటామని, నిర్బంధంలో ఉన్న రాజకీయ నేతలందర్నీ విడిచిపెడతామని అమిత్ షా తనను కలిసిన ఒక రాజకీయ ప్రతినిధి వర్గానికి చెప్పారు. కశ్మీర్‌కు ఇతర ప్రాంతీయులను తరలించి అక్కడి జనాభా రూపురేఖల్ని మార్చాలని కూడా తాము భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కశ్మీర్‌లో బృహత్తరమయిన మార్పులు కనపడతాయని, జమ్మూకశ్మీర్ అంతా అభివృద్ది జరగాలనే ప్రధానమంత్రి మోదీ భావిస్తున్నారని అమిత్ షా చెప్పారు. ఈ పరిణామాలను చూస్తుంటే కశ్మీర్ విషయంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితాలను ఇవ్వడం ప్రారంభమయినట్లు స్పష్టమవుతున్నది. శ్రీనగర్‌లో ప్రజా జీవనం సాధారణంగా కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కశ్మీర్‌లో అంతరించిపోతున్న హస్తకళలను పునరుద్ధరించేందుకు అపారమైన కృషి చేసిన  శ్రీనగర్‌కు చెందిన అర్ఫా జాన్ గత వారం రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా నారీశక్తి పురస్కారాన్ని స్పీకరించడం అక్కడ మారుతున్న పరిస్థితులకు నిదర్శనం. 2018లో అర్ఫా జాన్ స్థాపించిన అర్ఫా ఎంటర్‌ప్రైజెస్ శ్రీనగర్‌లో ఇవాళ వివిధ హస్తకళా ఉత్పత్తులను సరఫరా చేసే ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందింది. 370 అధికరణ రద్దు తర్వాత ఇంటర్నెట్ సేవలను కొంతకాలం నిలిపివేయడంతో తమ వ్యాపారం దెబ్బతిన్నదని, మళ్లీ ఇప్పుడు పుంజుకుంటున్నదని ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చెప్పారు.


విచిత్రమేమంటే  బిజెపి విస్తరణ ద్వారా తమ ఉనికిని కోల్పోతామని భయం ఉన్నవారే పౌరసత్వ చట్టం గురించి, ఢిల్లీ అల్లర్ల గురించి  తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతుల్ని చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కె.చంద్రశేఖర్ రావు లాంటి వారు కూడా తాను ఎప్పుడు పుట్టానో తనకు తెలియదని అసెంబ్లీలో ప్రకటించారు. తన పౌరసత్వం ప్రశ్నార్థకమవుతుందని బూటకపు భయాన్ని నటించారు. కేవలం ముస్లిం ఓట్లకోసమే కేసీఆర్, మమతా బెనర్జీ తోపాటు దేశంలో అనేకమంది ప్రతిపక్ష నేతలు పనికిమాలిన భయాల్ని ప్రజల్లో కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. జనాభా లెక్కల కార్యక్రమాన్ని తమ రాష్ట్రాల్లో నిర్వహించబోమని ప్రకటిస్తూ ఎన్నడూ లేని విధంగా జన గణనను రాజకీయం చేస్తున్నారు. పౌరసత్వ చట్టాన్నీ, జాతీయ జనాభా రిజిస్టర్‌నూ, జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌కూ ముడిపెట్టి ఈ దేశంలో మైనారిటీలను తీవ్రఆందోళనకు గురి చేస్తున్నారు. ఇది ప్రమాదకరమైన పరిణామమని చెప్పక తప్పదు. అందుకే ‘ఈ దేశ హోంమంత్రిగా నేను చెబుతున్నాను. ఎవరి పౌరసత్వమూ సందేహాస్పదం కాదు’ అని అమిత్ షా అనవలిసి వచ్చింది.


‘ఇవాళ్టి కాంగ్రెస్‌కూ ఒకప్పటి కాంగ్రెస్‌కూ ఎంతో తేడా ఉన్నది’.. అని యువకుడైన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌తో తన చిరకాల అనుబంధాన్ని తెంచుకుని బిజెపిలో చేరారంటే, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి మరీ ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుంటున్నారంటే ఎవరి విశ్వసనీయత ఏ విధంగా ఉన్నదో అర్థమవుతుంది. ఇప్పటికైనా కేసీఆర్‌, మమతా బెనర్జీ వంటి ప్రతిపక్ష నేతలు ఓటు బ్యాంకు రాజకీయాలకోసం పాతకాలపు కుత్సితపు చర్యలకు పాల్పడడం మానుకోకపోతే వారు కూడా కాంగ్రెస్ మాదిరి చరిత్ర చెత్తబుట్టలో కలిసిపోక తప్పదు. వారే అసలైన మతతత్వవాదులని ప్రజలు గ్రహించే రోజులు ఎంతో దూరం లేవు.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Advertisement
Advertisement
Advertisement