రైతు సొసైటీలకు షుగర్‌ ఫ్యాక్టరీలు

ABN , First Publish Date - 2021-07-29T06:29:15+05:30 IST

రైతు కో ఆపరేటివ్‌ సొసైటీల ఆధ్వర్యంలో నిజాం దక్కన్‌ షుగర్‌ లిమిటెడ్‌ (ఎన్‌డీఎస్‌ఎల్‌) కర్మాగారాలను నిర్వహించేందుకు అడుగులు పడుతున్నాయి.

రైతు సొసైటీలకు షుగర్‌ ఫ్యాక్టరీలు
మూతపడ్డ ముత్యంపేట ఎన్‌డీఎస్‌ఎల్‌ కర్మాగారం

- కర్మాగారాల పరిధిలోని ఎమ్మెల్యేలతో చర్చకు సన్నాహాలు

- గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన మంత్రి నిరంజన్‌రెడ్డి

జగిత్యాల, జూలై 28(ఆంధ్రజ్యోతి): రైతు కో ఆపరేటివ్‌ సొసైటీల ఆధ్వర్యంలో నిజాం దక్కన్‌ షుగర్‌ లిమిటెడ్‌ (ఎన్‌డీఎస్‌ఎల్‌) కర్మాగారాలను నిర్వహించేందుకు అడుగులు పడుతున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలలో  మాదిరిగా తెలంగాణలోని ఎన్‌డీఎస్‌ఎల్‌ కర్మాగారాలను రైతు సొసైటీలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన మేరకు జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు చొరవ తీసుకొని రైతు సొసైటీల ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ముత్యంపేట, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌, మెదక్‌ జిల్లా ముంబోజుపల్లిలలో లేఆఫ్‌తో మూతపడ్డ ఎన్‌డీఎస్‌ ఎల్‌ కర్మాగారాలను తెరిపించి నిర్వహించేందుకు యోచిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా పరిధిలోని ఎమ్మెల్యేలు, రైతు సంఘాల నాయకులతో చర్చించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు చేస్తున్న ప్రతిపాదనకు అన్ని వర్గాల నుంచి ఆమోదం లభిస్తే ఎన్‌డీఎస్‌ఎల్‌ కర్మాగారాల పునరుద్ధరణకు అవకాశం దక్కుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల జగిత్యాల జిల్లాలో పర్యటించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ఎదుట ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ప్రతిపాదన పెట్టగా సానుకూ లంగా స్పందించి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 

లే ఆఫ్‌కు ఆరేళ్లు..

నష్టాల కారణంగా ముత్యంపేట, బోధన్‌, ముంబోజుపల్లి షుగర్‌ ఫ్యాక్టరీలను 2015 డిసెంబర్‌ 22 ఎన్‌డీఎస్‌ఎల్‌ యాజమాన్యం లేఆఫ్‌ ప్రకటించి మూసివేసింది. అప్పటి నుంచి కర్మాగారాలు తెరుచుకోలేదు. దీంతో అటు చెరుకు రైతులు, ఇటు ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులు, కర్మా గారంపై ఆధారపడి జీవిస్తున్న వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు చెరుకు సాగు విస్తీర్ణం గణనీ యంగా పడిపోయింది. చెరుకు రైతులు పోరాటాలు చేసిన ఫలితం దక్కలేదు. గత పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో సైతం షుగర్‌ ఫ్యాక్టరీ అంశం రాజకీయ పార్టీలకు ప్రచారాస్త్రంగా మారింది. ఫ్యాక్టరీలను తెరిపిస్తా మన్న నేతల హామీలు ఆచరణకు నోచుకోలేదు. ఆరేళ్లుగా తెరుచుకోని కర్మాగారాలను పునరుద్ధరించడానికి ప్రస్తుతం ప్రయత్నాలు జరుగు తున్నాయి. 

ఒక్కో కర్మాగారం పరిదిలో 25 వేల మంది రైతులతో...

ఎన్‌డీఎస్‌ఎల్‌ పరిధిలోని ఒక్కో కర్మాగారంలో 25 వేల మంది రైతుల సభ్యత్వాలతో కోఆపరేటివ్‌ సొసైటీని ఏర్పాటు చేయాలని అనుకుంటు న్నారు. కర్మాగారం నిర్వహణకు ఒక్కో రైతు ఎకరానికి కొంత వాటాధనం చెల్లించి ప్రభుత్వ సాయం పొందడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.  వారం రోజుల క్రితం జగిత్యాల జిల్లాలో పర్యటించిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఇదే అంశంపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించారు. జగిత్యాల, బాల్కొండ, ఆర్మూర్‌, బోధన్‌, మెదక్‌ ఎమ్మెల్యేలతో చర్చించి కో ఆపరేటివ్‌ సొసైటీల ఏర్పాటుకు యత్నిస్తున్నారు. ఈ దిశగా గట్టి ప్రయత్నాలు సాగితే రైతు కో ఆపరేటివ్‌ సొసైటీల ఆధ్వర్యంలో షుగర్‌ ఫ్యాక్టరీలు నడుస్తాయని రైతులు ఆశతో ఉన్నారు. 

రైతులకు కర్మాగారం అప్పగించడానికి సర్కారు సిద్ధం

- కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే, కోరుట్ల

సహకార పద్ధతిలో రైతులు ముందుకు వచ్చి కర్మాగారాన్ని నిర్వహించ డానికి సమ్మతిస్తే అప్పగించడానికి సర్కారు సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి కర్మాగారాన్ని రైతులకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాము. రైతు కో ఆపరేటివ్‌ సొసైటీల ఆధ్వర్యంలో కర్మాగారాలను తెరి పించి నిర్వహణ చేపడుతాం.

ప్రభుత్వం సరియైన నిర్ణయం తీసుకోవాలి

- మామిడి నారాయణ రెడ్డి, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు, జగిత్యాల 

నిజాం దక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ కర్మాగారాల నిర్వహణపై ప్రభుత్వం సరియైన నిర్ణయం తీసుకోవాలి. యాజమాన్యం ప్రకటించిన లేఆఫ్‌ను ఎత్తివేయించాలి. ముత్యంపేట కార్మగారంలోనే చెరుకును గానుగాడించాలి. రైతుల్లో నెలకొన్న అయోమయాన్ని తొలగించాలి.

Updated Date - 2021-07-29T06:29:15+05:30 IST