Abn logo
Apr 9 2020 @ 05:06AM

చెరకు రైతుకు చేదు!

నెలల తరబడి డబ్బులు చెల్లించని షుగర్‌ ఫ్యాక్టరీలు

జిల్లా రైతులకు రూ.81.72 కోట్ల మేర బకాయిలు

గత సీజన్‌లో రూ.27.83 కోట్లు, ప్రస్తుత సీజన్‌లో రూ.53.89 కోట్లు

ఈ సీజన్‌లో ఒక్క రూపాయి కూడా చెల్లించని తాండవ, ఏటికొప్పాక..

ఎన్‌సీడీసీ రుణం నిధులు విడుదలలో తీవ్ర జాప్యం

పంట పెట్టుబడులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని రైతుల ఆవేదన


(ఆంధ్రజ్యోతి-చోడవరం): జిల్లాలో సహకార చక్కెర కర్మాగారాలకు చెరకు సరఫరా చేసిన రైతులు డబ్బుల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. 2018-19 సీజన్‌లో తాండవ షుగర్స్‌ మినహా మిగిలిన మూడు ఫ్యాక్టరీలు పూర్తిస్థాయిలో చెల్లింపులు జరపలేదు. అయితే ఈ ఫ్యాక్టరీ చెరకు విత్తనం సరఫరా చేసిన రైతులకు, ఇతర రైతులకు విత్తన సబ్సిడీ సుమారు రూ.2 కోట్లు బకాయి ఉంది. తుమ్మపాల ఫ్యాక్టరీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గోవాడ షుగర్స్‌ రూ.16 కోట్లు, ఏటికొప్పాక షుగర్స్‌ రూ.5.2 కోట్లు బకాయి ఉన్నాయి. ప్రస్తుత సీజన్‌(2019-20)లో తాండవ, ఏటికొప్పాక ఫ్యాక్టరీలు రైతులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు.


గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ ఈ ఏడాది ఫిబ్రవరి వరకు చెరకు సరఫరా చేసిన రైతులకు టన్నుకు రూ.2,500 చొప్పున చెల్లించింది (దీనికి అదనంగా ప్రోత్సాహక సొమ్ము చెల్లించాల్సి వుంది). ఆ తరువాత ఎటువంటి చెల్లింపులు జరపలేదు. సాంకేతిక సమస్యల వల్ల తుమ్మపాల షుగర్స్‌లో క్రషింగ్‌ జరపలేదు. మొత్తం మీద జిల్లాలోని నాలుగు ఫ్యాక్టరీలు రూ.81.72 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉంది. చెరకు డబ్బులు చెల్లించకపోవడంతో పెట్టుబడులకు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


గోవాడ షుగర్స్‌ బకాయిలు రూ.40 కోట్లుపైనే... 

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ 2018-19 క్రషింగ్‌ సీజన్‌ చివరిలో...అంటే మే నెల ఒకటి నుంచి అదే నెల 11వ తేదీ వరకు ఫ్యాక్టరీకి సరఫరా అయిన 29,583 టన్నుల చెరకుకు టన్నుకు రూ.2,500 చొప్పున రూ.7.39 కోట్లు చెల్లించవలసి ఉంది. అదే సీజన్‌లో మొత్తం 4,79,157 టన్నుల చెరకు క్రషింగ్‌ చేయగా, పంచదార రికవరీ శాతం ఆధారంగా టన్నుకు రూ.181 చొప్పున 8,67,27,417 రూపాయలను ప్రోత్సాహకాన్ని రైతులకు చెల్లించవలసి ఉంది. 2018-19 సీజన్‌లో మొత్తం రూ.16 కోట్లు రైతులకు బకాయి పడింది.


ప్రస్తుత క్రషింగ్‌ సీజన్‌ (2019-20)లో గత డిసెంబరు 12వ తేదీ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి ఆఖరు వరకు సరఫరా అయిన 2,33,000 టన్నుల చెరకు టన్నుకు రూ.2,500 చొప్పున రూ.58.34 కోట్లు రైతులకు చెల్లించింది. మార్చి ఒకటి నుంచి ఈ నెల 7వ తేదీ వరకు 98 వేల టన్నుల చెరకు క్రషింగ్‌ జరిగింది. టన్నుకు రూ.2,500 చొప్పున రూ.24.5 కోట్లు చెల్లించవలసి ఉంది. మొత్తం మీద రూ.40 కోట్ల పైచిలుకు చెల్లించాలి.


ఏటికొప్పాక బకాయిలు రూ.18 కోట్లు!

ఎస్‌.రాయవరం: ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీలో 2019-20 క్రషింగ్‌ సీజన్‌లో 48,864 టన్నుల చెరకును క్రషింగ్‌ చేశారు. మద్దతు ధర టన్నుకు రూ.2,612గా ప్రకటించారు. ఈ ప్రకారం రైతులకు రూ.12.76 కోట్లు చెల్లించాలి. చెరకు సరఫరా చేసిన రైతులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఇక అంతకుముందు 2018-19 సీజన్‌లో 94,653 టన్నుల చెరకు క్రషింగ్‌ జరిగింది. టన్నుకు రూ.2,612 చొప్పున చెల్లించాలి. కానీ రూ.2,100 చొప్పున మాత్రమే రైతులకు అందాయి.


టన్నుకు రూ.512 చొప్పున రూ.5.2 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తం మీద రెండు సీజన్‌లకు కలిపి ఏటికొప్పాక షుగర్స్‌ రైతులకు రూ.18 కోట్ల బకాయిలు ఉంది. వీటితోపాటు ఉద్యోగుల జీతాలు, పదవీ విరమణ చేసిన వారికి ఇవ్వాల్సిన సదుపాయాలు, ఇత ర అలవెన్సులు కలిపి మరో రూ.7 కోట్లు వుంటాయి. మొత్తం మీద ఫ్యాక్టరీ చెల్లింపులకు రూ.25 కోట్లు అవసరం.


తాండవ బకాయిలు రూ.18.63 కోట్లు 

తాండవ చక్కెర కర్మాగారంలో 2019-20 సీజన్‌లో 63,682 టన్నుల చెరకు క్రషింగ్‌ చేశారు. టన్నుకు రూ.2,612.50 చొప్పున రూ.16.63 కోట్లు చెల్లించాల్సి ఉంది. రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతోపాటు 2018-19 సీజన్‌లో విత్తన చెరకు సరఫరా చేసిన రైతులకు చెల్లించాల్సిన బకాయిలతోపాటు 2015-16 నుంచి 2018-19 సీజన్‌ వరకు రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ సుమారు రూ.2 కోట్లు ఉంది. చెరకు రైతులకు బకాయిలపై ఫ్యాక్టరీ ఎండీ వి.వి.రమణారావును వివరణ కోరగా, ఎన్‌సీడీసీ రెండో విడత రుణం నిధులు విడుదల కాకపోవడంతో  రైతులకు చెల్లింపులు జరపలేకపోయామన్నారు.


అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిలీజ్‌ ఆర్డర్‌ మేరకు మార్కెట్‌లో పంచదార విక్రయించగా వచ్చే సొమ్మును రైతులకు చెల్లించేందుకు ప్రభుత్వ హామీతో ఆప్కాబ్‌ (పంచదారను తనఖా పెట్టి గతంలో రుణం తీసుకున్నారు) అధికారులను ఒప్పించామన్నారు. త్వరలో 12,000 క్వింటాళ్ల పంచదారను విక్రయించి, జనవరి 15వ తేదీ వరకు 16,000 టన్నుల చెరకు సరఫరా చేసిన రైతులకు టన్ను ఒక్కింటికి రూ.2,100  చొప్సున రూ.3.36 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మిగిలిన బకాయిలు ఎన్‌సీడీసీ నిధులు విడుదలైన వెంటనే చెల్లిస్తామని తెలిపారు.


తుమ్మపాల పాత బకాయిలు రూ.4.63 కోట్లు

అనకాపల్లి (తుమ్మపాల) వీవీ రమణ సహకార చక్కెర కర్మాగారం ఈ ఏడాది (2019-20 సీజన్‌) చెరకు క్రషింగ్‌ చేయలేదు. గత క్రషింగ్‌ సీజన్‌ (2018-19)లో 16,720 టన్నుల చెరకును రైతులు సరఫరా చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు రూ.4.63 కోట్లు చెల్లించాలి. ఏడాదిన్నర అవుతున్నప్పటికీ డబ్బులు ఇవ్వలేదు. ఎన్‌సీడీసీ నుంచి రుణం వస్తుందని కొంతకాలం, కాదు రాష్ట్ర ప్రభుత్వమే గ్రాంటు ఇస్తుందని మరికొంతకాలం నెట్టుకొచ్చారు. నిధులు మంజూరు చేస్తున్నట్టు రెండు నెలల కిందట జీవో జారీచేశారు. కానీ నిధులు విడుదల చేయలేదు. 


Advertisement
Advertisement
Advertisement