రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-04-11T09:07:25+05:30 IST

కలిసి రాని వ్యవసాయం.. ఆపై ఆర్థిక ఇబ్బందులతో తల్లి, భార్య, కుమారుడితో కలిసి ఆ ఇంటి యజమాని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు.

రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం

కలిసిరాని వ్యవసాయం.. ఆర్థిక ఇబ్బందులు

ఆస్పత్రిలో కోలుకుంటున్న ముగ్గురు..ఒకరి పరిస్థితి విషమం


కామవరపుకోట, ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 10: కలిసి రాని వ్యవసాయం.. ఆపై ఆర్థిక ఇబ్బందులతో తల్లి, భార్య, కుమారుడితో కలిసి ఆ ఇంటి యజమాని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం కేఎస్‌ రామవరానికి చెందిన అడపా మహేశ్‌బాబు (37) తనకు ఉన్న కొద్దిపాటి పొలంతోపాటు కొంత కౌలుకు తీసుకుని వరి, మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. కొవిడ్‌ సమయంలో సాగు సక్రమంగా జరగక తీవ్ర నష్టాల పాలయ్యాడు. పెట్టుబడికి చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం.. ఆపై వారి నుంచి ఒత్తిడి పెరిగింది. దీనికి చావే పరిష్కారం అనుకున్నాడు. తాను మరణిస్తే తల్లిని, భార్య పిల్లల్ని ఎవరు చూస్తారని మథనపడ్డాడు.


శనివారం ఉదయం మహేశ్‌బాబుతోపాటు తన తల్లి కృష్ణకుమారి, భార్య సత్యవేణి, ఆరో తరగతి చదువుకున్న కుమారుడు మురళీకృష్ణ(11) నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. కాసేపటికి వీరి పరిస్థితిని గమనించిన స్థానికులు తడికలపూడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితులు నలుగురినీ వెంటనే చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహేశ్‌ పెద్ద కుమారుడు పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో విజయవాడ తీసుకెళ్లారు. మిగిలిన ముగ్గురికీ ఇక్కడే చికిత్స చేస్తున్నారు. 

Updated Date - 2021-04-11T09:07:25+05:30 IST