పబ్జీగేమ్‌ ఆడొద్దన్నందుకు బాలుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-06-22T05:59:49+05:30 IST

పబ్జీగేమ్‌ ఆడొద్దన్నందుకు బాలుడి ఆత్మహత్య

పబ్జీగేమ్‌ ఆడొద్దన్నందుకు బాలుడి ఆత్మహత్య
చందు (ఫైల్‌)

స్టేషన్‌ఘన్‌పూర్‌, జూన్‌ 21: పబ్జీగేమ్‌ ఆడొద్దని తండ్రి మందలించినందుకు మనస్తాపం చెందిన బాలుడు ఆత్మహత్మ చేసుకున్నాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం నమిలిగొండ గ్రామానికి చెందిన కోల చందు (16) ప్రస్తుతం స్థానిక మోడల్‌స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలు లేకపోవడంతో అన్‌లైన్‌ క్లాస్‌లు వినేందుకు తల్లిదండ్రులు కోల రాజయ్య-అనిత స్మార్ట్‌ ఫోన్‌ కొనిచ్చారు. దీంతో చందు ప్రతీ రోజు పబ్జీగేమ్‌ ఆడేందుకు అలవాటు పడ్డాడు. తల్లిదండ్రులు పలుమార్లు చెప్పినప్పటికీ ఆటను వీడలేదు. ఈ క్రమంలో విసుగుచెంది పబ్జీగేమ్‌ ఆడి చదువు ఆగం చేసుకోవద్దని తండ్రి రాజయ్య ఆదివారం సాయంత్రం కాస్త తీవ్రంగా మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన చందు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ తనే వస్తాడులే అనుకుంటే ఎంతకూ రాకపోవడంతో తల్లిదండ్రులు సోమవారం ఉదయం బంఽధువుల ఇళ్లల్లో వెతికినా జాడ దొరకలేదు. ఈ క్రమంలో వారి వ్యవసాయ బావి సమీపంలోని  గుట్టపైన మంటల్లో కాలిపోయి ఉన్న మృతదేహాన్ని సోమవారం సాయంత్రం గమనించిన పశువుల కాపర్లు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు వెళ్లి కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. తన బైక్‌ను చెట్ల మధ్య దాచిపెట్టి అందులో నుంచి పెట్రోలును తీసుకొని గుట్ట పైకి వెళ్లి ఒంటిపై పోసుకొని నిప్పు అంటించుకున్నట్లుగా గ్రామస్థులు గుర్తించారు. ఎస్సై రమే్‌షనాయక్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇద్దరినీ కోల్పోయిన తల్లిదండ్రులు..

రాజయ్య-అనిత దంపతులకు ఇద్దరు కుమారులు దినేష్‌(19), చందు(16)లతో పాటు ఒక కుమార్తె ఉండగా పెద్ద కుమారుడు దినేష్‌ 2019 డిసెంబర్‌ 16న ఛాగల్‌ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందాడు. ఆ బాధను మరిచిపోక ముందే ఇపుడు రెండో కుమారుడు చందు ఆత్మహత్య చేసుకొని తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చాడు. 

Updated Date - 2021-06-22T05:59:49+05:30 IST