పెళ్లికి పెద్దలు అంగీకరించకనందుకే అఘాయిత్యం
తలమడుగు, : తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆ ప్రేమికులు పురుగుల మందు తాగి తనువులు చాలించారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేగామ గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. దేగామకే చెందిన గోడం శ్రీరాం (23), గేడం సుజాత (22) చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు కూడా ఒకటే. పెద్దలు ఒప్పుకొంటారన్న ఆశతో తమ ఇళ్లల్లో విషయాన్ని చెప్పారు. అయితే.. అందుకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సోమవారం రాత్రి ఇద్దరూ కలిసి ఊరి చివర పొలాల వద్దకు చేరుకున్నారు. మంగళవారం తెల్లవారుజాము సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయాన్నే వారి మృతదేహాలను గుర్తించిన స్థానికులు.. కుటుంబీకులకు, పోలీసులకు సమాచారాన్ని అందించడంతో విషయం వెలుగుచూసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.