Abn logo
Oct 25 2021 @ 02:07AM

అన్నదాతల ఆత్మఘోష!

  • నిరుడు రాష్ట్రంలో 760 మంది అన్నదాతల ఆత్మహత్య
  • ఈ ఏడాది 9 నెలల్లోనే 802 మంది రైతుల బలవన్మరణం
  • పత్తి రైతులే ఎక్కువ.. మృతుల్లో 80% కౌలు రైతులే..
  • ఆత్మహత్యల్లో దేశంలో మూడో స్థానం
  • రైతుబంధు, ఉచిత విద్యుత్తు, సాగునీటి లభ్యత ఉన్నా రాష్ట్రంలో ఆగని ఆత్మహత్యలు
  • ప్రకృతి విపత్తులు వస్తే పరిహారం లేదు..
  • బీమా లేదు.. పూర్తికాని రుణమాఫీ
  • బ్యాంకుల్లో అప్పు పుట్టని దైన్యం ..
  • రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటిదాకా 7,409 రైతుల ఆత్మహత్య


తెలంగాణలో కరెంటుకు, నీళ్లకు కొరతలేదు. భూగర్భ జలాల బాధలేదు. చాలినన్ని ఎరువులు ఇస్తున్నాం. కల్తీ విత్తనాల బెడదలేదు. ధాన్యం అమ్ముకునేందుకు బాధలేదు. రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలుచేస్తున్నాం. రైతుబంధుతో చాలా మంది రైతులు బయట అప్పులు చేయడంలేదు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మునుపటి స్థాయిలో లేవు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే చెప్తున్నది. 

ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌


గతంలో రైతులు పురుగుల మందు తాగి చనిపోయేవారు. రైతుబంధు, రైతుబీమా వచ్చిన తర్వాత రైతులు సంతోషంగా ఉన్నారు. రైతులు సచ్చిపోయేంత పరిస్థితుల్లో లేరు. 

మోత్కుపల్లి టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) డేటా ప్రకారం దేశవ్యాప్తంగా రైతు ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత తెలంగాణ మూడో స్థానంలో ఉంది.  డీసీఆర్‌బీ(జిల్లా క్రైమ్‌ రికార్డు బ్యూరో)లో కూడా ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. తెలంగాణ  ఏర్పాటునుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 7,409 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ ఏడాది (జనవరి నుంచి సెప్టెంబరు వరకు) తొమ్మిది నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 802 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ‘రైతు స్వరాజ్య వేదిక’ చేసిన అధ్యయనంలో తేలింది. రాష్ట్రంలో రోజుకు సగటున ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు అన్నదాతల ఆత్మహత్యలను ఆపలేకపోతున్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రైతుబీమా పథకం అమలుచేసినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలను లెక్కించటంలేదు. కొన్ని కేసులనే రైతు ఆత్మహత్యల జాబితాలో రాస్తున్నారు. రైతుది సాధారణ మరణమైనా, ఆత్మహత్యచేసుకున్నా రైతుబీమా పథకం కింద రూ.5 లక్షలు ఇన్సూరెన్స్‌ చేశామనే నెపంతో ఆత్మహత్యలకు గల కారణాలను  అన్వేషించడం లేదు. ఒకవేళ పోలీసులు కేసు నమోదు చేస్తే ఆత్మహత్యల సంఖ్యను తగ్గించి చూపించే ప్రయత్నంలో వేర్వేరు కారణాలను చూపిస్తున్నారు.


పేదరికం, ఆస్తి తగాదాలు, కుటుంబసమస్యలు, అనారోగ్యం, సాగేతర అప్పుల వంటి కారణాలను విచారణ నివేదికల్లో రాసి కేసులు మూసివేస్తున్నారు. రైతు స్వరాజ్య వేదిక లెక్కల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరు వరకు అత్యధికంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 152 మంది, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 59 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రాష్ట్రంలో సాగు పరంగా ఉన్న ప్రభుత్వ పథకాల్లో ఏవి కూడా కౌలు రైతులకు వర్తించడం లేదు. తమ ప్రభుత్వం కౌలురైతులను పట్టించుకోదని ఈనెల 8న అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. ఏపీలో కౌలు రైతులకు రైతుభరోసా, కేరళలో కుడుంబశ్రీ, ఒడిసాలో కాలియా పేరుతో కౌలు రైతులకు పథకాలు అమలుచేస్తున్నారు. రాష్ట్రంలో 12 లక్షల కౌలు రైతులు ఉన్నారు. వీరికి బ్యాంకులు, సహకార సంఘాల్లో  పంట రుణాలు ఇవ్వకపోవటంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకతప్పటంలేదు. రాష్ట్రంలో బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతుల్లో 80 శాతం కౌలు రైతులు, పాక్షిక కౌలు రైతులు ఉండటం ఆందోళనకరంగా మారింది. 


ఆత్మహత్యల్లో పత్తి రైతులే ఎక్కువ

ఉమ్మడి రాష్ట్రంలో పత్తి రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగిన సందర్భాలున్నాయి. 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంఽధీ, తెలంగాణ ప్రాంతంలో ఆత్మహత్యలు చేసుకున్న పత్తి రైతుల కుటుంబాలను పరామర్శించిన విషయంవిదితమే! నిరుటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతుల ఆత్మహత్యల పరంపర మొదలైంది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఊరూరా సదస్సులు నిర్వహించి మరీ.. పత్తి సాగు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం దండోరా వేసింది. మళ్లీ యూటర్న్‌ తీసుకొని... నిరుడు 70 లక్షల ఎకరాల సాగు లక్ష్యాన్ని నిర్దేశించి 60.18 లక్షల ఎకరాల్లో రైతులతో పత్తి సాగుచేయించింది. ఎకరానికి కనీసం 10- 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా వానలు, వరదల దెబ్బకు 3-4 క్వింటాళ్లు కూడా దిగుబడి రాలేదు. ఈ ఏడాది కూడా 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేయాలని ప్రభుత్వం టార్గెట్‌ పెట్టింది. కానీ నిరుడు అనుభవంతో రైతుల్లో కొందరు వెనుకంజ వేశారు. దీంతో ఈసారి 46.43 లక్షల ఎకరాల్లోనే పత్తి సాగైంది. ఈ ఏడాది కూడా భారీ వర్షాల తాకిడికి పత్తి పంట దెబ్బతింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో పత్తి రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నట్లు రైతు స్వరాజ్య వేదిక అధ్యయనంలో తేలింది.


రుణమాఫీ పూర్తికాక... కొత్త అప్పు పుట్టక..

రైతుల ఆత్మహత్యలకు రుణమాఫీ పూర్తికాకపోవడం ప్రధాన కారణంగా మారింది. ప్రభుత్వం మూడేళ్ల నుంచి రుణమాఫీ పూర్తిచేయకపోవటంతో రైతుల క్రాప్‌ లోన్‌ అకౌంట్లు ‘ఎన్‌పీఏ’(నాన్‌ పేయింగ్‌ అకౌంట్ల) జాబితాలో పడిపోయాయి. అసలు, వడ్డీ మొత్తం చెల్లిస్తే తప్ప రెన్యువల్‌ చేయలేని పరిస్థితి ఉంది. పాత అప్పు తీరక, పెట్టుబడి ఖర్చులకు కొత్త అప్పు బ్యాంకులు ఇవ్వకపోవటంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రుణమాఫీ పథకంలో 40.66 లక్షల మంది లబ్ధిదారులుంటే మొదటి విడతలో(రూ. 25 వేల లోపు) 2.96 లక్షల మందికి మాత్రమే రూ. 408 కోట్లు రుణమాఫీ చేశారు. ఈ కేటగిరీలో ఇంకా లబ్ధిదారులు మిగిలిపోయి ఉన్నారు. రెండో విడతలో రూ. 50 వేల లోపు బకాయిలన్నీ(రూ. 2,006 కోట్లు) మాఫీ చేస్తామని చెప్పి, రూ. 323.86 కోట్లు మాత్రమే మాఫీచేశారు.  


పంటల బీమా ఫథకాలు లేవు... ఇన్‌పుట్‌ సబ్సిడీలేదు

రాష్ట్రంలో పంటలబీమా పథకం అసలే అమలుచేయకపోవటంతో సాగుకు భద్రతలేకుండా పోయింది. 2015 వరకు నేషనల్‌ అగ్రికల్చర్‌ ఇన్సురెన్స్‌ స్కీమ్‌, మాడిఫైడ్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ ఇన్సురెన్స్‌ స్కీమ్‌, వెదర్‌బే్‌సడ్‌ క్రాప్‌ ఇన్సురెన్స్‌ స్కీమ్‌లు రైతుకు అందుబాటులో ఉండేవి. రైతులు పంటలకు బీమా చేసుకొని.. ప్రకృతి విపత్తులు వస్తే నష్టపరిహారం పొంది ఊరట చెందేవారు. ఇప్పుడలాంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవు. 2016లో  ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం(పీఎంఎ్‌ఫబీవై) అమల్లోకి తెచ్చారు. మూడేళ్ల తర్వాత రైతుల తరుఫున ప్రీమియం చెల్లించటం భారంగా మారిందని బావించి ఈ పథకం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైదొలిగింది. దేశంలో పంటల బీమా పథకాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, పీఎంఎ్‌ఫబీవైలో శాస్త్రీయతలేదని, దేశంలో పంట నష్టం జరిగిన ఏ రైతుకు కూడా బీమాతో న్యాయం జరగలేదని, ఫసల్‌ బీమా అయినా... మరే బీమా అయినా బోగసేనని సీఎం కేసీఆర్‌ తాజా అసెంబ్లీ సమావేశాల్లో విమర్శలు గుప్పించారు.


ఇక అతివృష్ఠి వచ్చినా, అనావృష్ఠి వచ్చినా రైతులను ఆదుకునే దిక్కులేదు. 2018 నుంచి 20 వరకు పంటనష్టం బకాయిలు రూ. 841 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటాధనం చెల్లించకపోవటంతో ఇన్సురెన్స్‌ క్లెయిమ్స్‌రాలేదు.  క్రాప్‌ ఇన్సురెన్స్‌ పథఽకాలు  అమలుచేయకపోవటం కూడా రైతుల ఆత్మహత్యలకు కారణమని ‘రైతు స్వరాజ్య వేదిక’ అధ్యయనంలో వెల్లడైంది. గతంలో ప్రకృతి విపత్తులు వచ్చి, పంటలు నష్టపోతే సర్వేచేసి, నష్టశాతాన్ని లెక్కించి ఇన్‌పుట్‌ సబ్సిడీ నష్ట పరిహారం అందించేవారు. 2014 నుంచి ఇప్పటివరకు ప్రతిసారి ఏదో ఒకరకంగా నష్టం జరుగుతున్నా నష్టపరిహారం ఇవ్వటంలేదు. 2020 ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వరదలు వచ్చినపుడు 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రూ. 8,633 కోట్ల నష్టం జరిగినట్లు ప్రధాన మంత్రికి లేఖరాశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి నిధులు వచ్చాయి. కానీ రైతులకు నయాపైసా ఇవ్వలేదు. ఇటీవల హైకోర్టు కూడా తీవ్రస్థాయిలో స్పందించింది. ‘రైతు స్వరాజ్య వేదిక’ వేసిన ప్రజాప్రయోజనవ్యాజ్యం పై విచారించి... మూడు నెలల్లో నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలను ప్రభుత్వం ప్రారంభించలేదు. వీటితోపాటు నకిలీ విత్తనాలు కూడా రైతుల ఆత్మహత్యలకు కారణాలుగా మారుతున్నాయి.

  

ఇల్లు అమ్మినా అప్పు తీరక.. 

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వాయిల్‌వంపు గ్రామానికి చెందిన ఆవుల నాగేశ్వరరావు మూడేళ్లుగా 7 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పుడు చేశాడు. నిరుడు వర్షాలకు పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. పెట్టుబడి- కౌలు ఖర్చులు కూడా రాలేదు. ఇల్లు అమ్మినా అప్పు తీరలేదు. మనస్తాపం చెంది గత జూన్‌ నెల 16 న ఆత్మహత్మకు పాల్పడ్డాడు. కౌలు రైతు కావటంతో  రైతు బీమా పథకం కూడా వర్తించలేదు. భార్య ప్రసన్న, కూతుళ్లు హేమ, స్నేహలతోపాటు నాగేశ్వరరావు తల్లిదండ్రుల పరిస్థితి దయనీయంగా మారింది.


గొర్రెల కాపర్లుగా మారిన పిల్లలు 

ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగుకు చెందిన సెవ్వా లస్మన్న(45) సెప్టెంబరు 26న ఆత్మహత్య చేసుకున్నాడు. నిరుడు 5 ఎకరాలు, ఈ ఏడాది 4 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగుచేశాడు. ఈ సీజన్‌లో రూ. 85 వేలు పెట్టుబడి పెట్టాడు. పత్తి పికింగ్‌కు వచ్చే దశలో ఉండగా పురుగుల మందు స్ర్పే చేయటానికి అప్పు కోసం ప్రయత్నించాడు. దొరకకపోవటంతో విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లస్మన్నకు భార్య, ఇద్దరు కొడుకులున్నారు. తండ్రి చనిపోవటంతో పిల్లలు గొర్రెల కాపరులుగా జీతానికి పనిచేస్తున్నారు.  


వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన ఓగిపురం బిచ్చిరెడ్డి (35) అనే రైతు తన మూడెకరాల్లో పత్తి, కంది పంటలు వేశాడు. బ్యాంకు నుంచి 1.5లక్షలు, నగలు తాకట్టు పెట్టి రూ.లక్ష, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.4.5 లక్షలు అప్పు చేశాడు. ఇటీవల భారీ వర్షాలతో పంటలన్నీ నీళ్లలో మునిగిపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. పంటలు చేతికొచ్చే అవకాశం లేదని, అప్పు తీర్చే మార్గం లేదని ఆవేదనకు గురై సెప్టెంబరు 9న ఇంట్లో ఉరివేసుకున్నాడు. భర్త మృతితో పిల్లలు శివ శంకర్‌, కృతిక్‌ పోషణ భారం భార్య కవితపై పడింది. 


ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం తడిహత్నూర్‌ రైతు చౌహాన్‌ ఆరవిందు(37)కు  భార్య అనిత, ఏడేళ్ల కొడుకు, ఐదేళ్ల కూతురు ఉన్నారు. బ్యాంకు అప్పు రూ.90 వేలు ఉండగా రుణమాఫీ చేయకపోవటంతో అలాగే ఉంది. నిరుడు రెండున్నర ఎకరాల్లో పత్తిసాగుచేస్తే  పెట్టుబడికి రూ. 1.2 లక్షలు అప్పు చేశాడు. ఈ ఏడాది యాసంగి ముగిసేసరికి మరో రూ. 1.4 లక్షల అప్పు అయింది. వానాకాలం పంటలు సాగుచేసే సమయంలో విత్తనాల కోసం ఎక్కడా అప్పు దొరకలేదు. దీంతో ఆందోళన చెంది భార్యాపిల్లలను ఆమె తల్లిగారింటికి పంపించి జూన్‌ 21న పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 


బిచ్చిరెడ్డి, అరవిందు మాదిరిగానే ఎంతో మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొన్నాళ్లుగా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.  గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. 2020లో రాష్ట్రవ్యాప్తంగా 760 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, ఈ ఏడాదిలో గత తొమ్మిది నెలల్లోనే 802  మంది  రైతులు బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, ధైర్యంగా ఉండాలని రైతులకు భరోసా కల్పించే ఒక్క ప్రకటన కూడా ప్రభుత్వం నుంచి  వెలువడకపోవటం విమర్శలకు దారితీస్తోంది.రైతు స్వరాజ్య వేదికకు వివరాలు ఇలా 

డీసీఎఆర్‌బీ, ఎన్‌సీఆర్‌బీ డేటాతోపాటు స్వచ్ఛంద కార్యకర్తలను ఏర్పాటు చేసుకొని ‘రైతు స్వరాజ్య వేదిక’ రైతుల ఆత్మహత్యల వివరాలను నమోదు చేస్తోంది. స్వచ్ఛంద కార్యకర్తల వివరాలు, పత్రికల్లో ప్రచురితమైన రైతుల వార్తలు, డీసీఆర్‌బీ, ఎన్‌సీఆర్‌బీ వివరాల ఆధారంగా రైతుల ఆత్మహత్యల లెక్కలు సేకరిస్తున్నట్లు ‘రైతు స్వరాజ్య వేదిక’ ప్రతినిధి బి. కొండల్‌ రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 18 మంది స్వచ్ఛంద కార్యకర్తలు కేవలం రైతుల ఆత్మహత్యల అంశంపైనే పనిచేస్తున్నట్లు తెలిపారు. వార్తా పత్రికల్లో ప్రచురితమైన వివరాలతో... స్వచ్ఛంద కార్యకర్తలు గ్రామాలకు వెళ్లి ఆయా కుటుంబాలను కలిసి వివరాలు సేకరిస్తారని, వాటిని ధ్రువీకరించుకొని నమోదుచేస్తారని తెలిపారు.  
భరోసాలేకనే రైతుల ఆత్మహత్యలు

ప్రకృతి విపత్తులు సంభవించినపుడు సర్కారు ఆదుకోకపోవటం, వారికి భరోసా కల్పించకపోవటంతో నిరాశకు గురై రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. ఉచిత పంటల బీమా పథకాలను అమలుచేయాలి. సాగుకు భద్రత కల్పించాలి. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబాలను ఆదుకోవాలి. పంట నష్టపరిహారాన్ని 3 నెలల్లో చెల్లించాలని ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును  ప్రభుత్వం వెంటనే అమలుచేయాలి.

 బి. కొండల్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక

వర్షాలతో పంట నాశనమై 

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం మండగడ గ్రామానికి చెందిన సోమరెడ్డి సుఖేందర్‌రెడ్డి(44) ఏప్రిల్‌ నెల 21 న ఆత్మహత్య చేసుకున్నాడు. నిరుడు ఎకరానికి రూ. 22 వేల చొప్పున 12 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగుచేశాడు. కౌలుకు అయ్యే మొత్తం రూ. 2.64 లక్షలు అప్పుచేశాడు. పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు పడటంతో  అంతా నాశనమైంది. ఈ ఏడాది మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడు. అయినా అప్పులు పెరిగిపోవటంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.