మోసం చేశారని యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-08-02T05:36:14+05:30 IST

పరిహారం ఇస్తామని మోసం చేశారని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్‌ పేటకు చెందిన రెబ్బల వంశీ (21) అనే యువకుడు పురుగుల మందుతాగి ఆత్మ హత్య చేసుకున్నాడు.

మోసం చేశారని యువకుడి ఆత్మహత్య
ధర్నా చేస్తున్న బంధువులు, స్నేహితులు

- మృతదేహంతో కుటుంబసభ్యుల ధర్నా 

ఇల్లంతకుంట, ఆగస్టు 1: పరిహారం ఇస్తామని మోసం చేశారని  రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్‌ పేటకు చెందిన రెబ్బల వంశీ (21) అనే యువకుడు పురుగుల మందుతాగి ఆత్మ హత్య చేసుకున్నాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం  రహీంఖాన్‌పేటకు చెందిన వంశీ  అదే గ్రామానికి చెందిన ఏనుగుల మల్లయ్య ట్రాక్టర్‌పై పనిచేస్తుండగా మూడు నెలల క్రితం గడ్డి కట్టకట్టే మిషన్‌లో వంశీ చేయి ఇరుక్కుంది. దీంతో వైద్యులు అతని చేతిని తొలగించారు. దీనిపై గ్రామంలో పంచాయితీ నిర్వహించారు. చేయి కోల్పోయిన వంశీకి 10 లక్షలు రూపాయలు ట్రాక్టర్‌ యజమాని ఇవ్వాలని నిర్ణయించి కొన్ని రోజులు సమయం ఇచ్చారు. సమయం గడిచినా డబ్బులు చెల్లించ లేదు. దీంతో మల్లయ్య ఇంటి వద్దకు వెళ్లి వంశీ కుటుంబ సభ్యులు నిలదీశారు. అతడు డబ్బులు ఇవ్వకపోవడంతో ట్రాక్టర్‌ను తీసు కెళ్లారు. తన ట్రాక్టర్‌ తీసుకెళ్లారని మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వంశీని స్టేషన్‌కు పిలిపించి విచారించారు. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేశారని మనస్తాపం చెందిన వంశీ శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేటకు అక్కడి నుంచి కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు.  పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం వంశీ మృతిచెందాడు. ట్రాక్టర్‌ యజమాని, పెద్దమనుషులు, ఎస్సై తనకు చేసిన అన్యాయంతోనే పురుగుల మందు తాగినట్లు  వంశీ వీడియోలో పేర్కొన్నాడు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో  ట్రాక్టర్‌ యజమాని, అతడి కొడుకు, పెద్దమనుషులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా డీఎస్సీ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట పోలీస్‌స్టేషన్‌లో ఉండి పరిస్థితిని సమీక్షించారు.

  మృతదేహంతో ధర్నా

మండలంలోని రహీంఖాన్‌పేటలో ట్రాక్టర్‌ యజమాని ఏనుగుల మల్లయ్య ఇంటి ఎదుట రెబ్బల వంశీ మృతదేహంతో ధర్నా నిర్వహించారు. కరీంనగర్‌ ఆసుపత్రిలో మృతి చెందిన వంశీ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. అప్పటికే గ్రామానికి చేరుకున్న మిత్రులు, బంధువులు అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. అద్దాలు పగలగొట్టి వంశీ మృతదేహాన్ని ఎత్తుకొని ట్రాక్టర్‌ ఇంటి యజమాని ఇంటి ఎదుట ఉంచి ధర్నా చేపట్టారు. దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం  డీఎస్పీ చంద్ర శేఖర్‌,  సీఐలు ఉపేందర్‌, అనిల్‌కుమార్‌, బన్సీలాల్‌ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. 

Updated Date - 2021-08-02T05:36:14+05:30 IST