ఉద్యోగం రావడం లేదని యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-08-02T06:10:43+05:30 IST

ఉద్యోగం రావడంలేదని ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన మొహ్మద్‌ షబ్బీర్‌ (26) అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉద్యోగం రావడం లేదని యువకుడి ఆత్మహత్య
మహ్మద్‌ షబ్బీర్‌

జమ్మికుంట, ఆగస్టు 1: ఉద్యోగం రావడంలేదని ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన మొహ్మద్‌ షబ్బీర్‌ (26) అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. షబ్బీర్‌ ఐటీఐ పూర్తి చేసి డిగ్రీ చదివాడు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగం వస్తుందని, ఎంతో కష్టపడి చదువుకున్నాడు. పది నెలల క్రితం జమ్మికుంటకు చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది నెలలు హైద్రాబాద్‌లోని ప్రైవేట్‌ కంపెనీలో పని చేశాడు. చాలీచాలనీ వేతనంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. ప్రస్తుతం జమ్మికుంటలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో భార్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని, ఇక తనకు ఉద్యోగ వచ్చే పరిస్థితులు లేవని తరుచూ స్నేహితులతో చెప్పి బాధపడేవాడు. మనస్తాపం చెంది ఆదివారం ఉదయం జమ్మికుంట రైల్వే స్టేషన్‌ సమీపంలో  రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  రైల్వే పోలీసులకు షబ్బీర్‌ జేబులో సూసైడ్‌ లెటర్‌ లభ్యం అయింది. అందులో నిరుద్యోగం, ఉద్యోగం రాకపోవడం వల్ల చనిపోతున్నాని రాసి పెట్టి ఉంది. 


న్యాయం చేయాలని ఆందోళన


ఇల్లందకుంట: తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ షబ్బీర్‌ కుటుంబ సభ్యులు, బంధువులు ఇల్లందకుంట మండల కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తుంది.. తమను బాగా చూసుకుంటాడని అనుకుంటే తమ కుమారుడు ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని షబ్బీర్‌ తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ సందర్భంగా  కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. 

Updated Date - 2021-08-02T06:10:43+05:30 IST