Abn logo
Sep 28 2021 @ 03:19AM

ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టి ఉరి

  • భార్య, అత్తింటి వేధింపులు భరించలేక ఆత్మహత్య


మదనపల్లె క్రైం, సెప్టెంబరు 27: భార్య, అత్తింటి వేధింపులు భరించలేక మనస్తాపం చెందిన వ్యక్తి ఫేస్‌బుక్‌లో లైవ్‌పెట్టి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరుకు చెందిన ఉదయ్‌భాస్కర్‌ (45) ఉపాధి నిమిత్తం కొన్నేళ్ల క్రితం చిత్తూరు జిల్లా మదనపల్లెకు వచ్చాడు. ప్రైవేటు ఆస్పత్రిలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయనకు ఆరేళ్ల క్రితం శేష్‌మహల్‌ ప్రాంతానికి చెందిన సోనీతో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. ప్రస్తుతం వారు నెహ్రూనగర్‌లో అద్దెకు ఉంటున్నారు. ఇటీవల దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భార్య కుమార్తెను తీసుకుని ఆదివారం పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టిన ఉదయ్‌భాస్కర్‌.. తన భార్య, ఆమె పుట్టింటివారు వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయాడు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫ్యానుకు ఉరేసుకున్నాడు. అప్రమత్తమైన ఆయన స్నేహితులు.. కుటుంబ సభ్యులకు, వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారంతా అక్కడికి చేరుకునేలోపే ఉదయ్‌భాస్కర్‌ మృతిచెందాడు. మద్యానికి బానిసైన ఉదయ్‌భాస్కర్‌ తరచూ వేధించేవాడని సోనీ పోలీసులకు చెప్పింది. పలుమార్లు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొంది. ఆదివారం కూడా  కొట్టడంతో  పుట్టింటికి వెళ్లినట్లు తెలిపింది.