పేద విద్యార్థులకు స్మార్ట్‌ సాయం!

ABN , First Publish Date - 2020-12-21T05:50:33+05:30 IST

ఆమె... శాతవాహనా యూనివర్సిటీలో సోషియాలజీ విభాగాధిపతి. ఒకటోతరగతి నుంచి పీహెచ్‌డీ వరకూ చదివిందంతా ప్రభుత్వ విద్యాలయాల్లోనే. పేదవిద్యార్థుల కష్టాలు ఆమెకు స్వానుభవమే. ఈ కరోనా కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు లేకపోవడం వల్ల ఆన్‌లైన్‌ తరగతులకి దూరమవుతున్న పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయారు...

పేద విద్యార్థులకు స్మార్ట్‌ సాయం!

ఆమె... శాతవాహనా యూనివర్సిటీలో సోషియాలజీ విభాగాధిపతి. ఒకటోతరగతి నుంచి పీహెచ్‌డీ వరకూ చదివిందంతా ప్రభుత్వ విద్యాలయాల్లోనే.  పేదవిద్యార్థుల కష్టాలు ఆమెకు స్వానుభవమే. ఈ కరోనా కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు లేకపోవడం వల్ల ఆన్‌లైన్‌ తరగతులకి దూరమవుతున్న పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయారు. పేదవిద్యార్థులు టెక్నాలజీకి దూరం కాకూడదనే సంక్పలంతో ‘‘ఈచ్‌వన్‌ రీచ్‌వన్‌’’ ఉద్యమానికి శ్రీకారం చుట్టి స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అందిస్తున్నారు ఆచార్య సూరేపల్లి సుజాత. అందరిలాగే పిల్లలకు చదివే హక్కుంది అంటున్న ఆమె నవ్యతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...


‘‘కరోనా కాలంలో ఆన్‌లైన్‌ తరగతులు తప్పనిసరయ్యాయి. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా నేనూ రోజూ ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలందరికీ స్మార్ట్‌ఫోన్లు అవసరంగా మారాయి. ఒకటోతరగతి నుంచి పీహెచ్‌డీ వరకూ...నా చదువంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే సాగింది. కనుక అక్కడి వాతావరణం నాకు బాగా తెలుసు. గవర్నమెంటు స్కూళ్లలోని విద్యార్థులంతా దాదాపుగా దళిత, బహుజన, ఆదివాసీ పిల్లలే. మరి, వాళ్లెలా ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతున్నారో తెలుసుకుందామని కొంతమంది ఉపాధ్యాయులను కలిశాను. మరికొన్ని గ్రామాలకెళ్లాను. అక్కడ నేను విన్న, చూసిన సంఘటనలు నన్ను కదిలించాయి. కొందరి ఇళ్లలో టీవీ లేదు. చాలామందికి స్మార్ట్‌ఫోన్లులేవు. ఒకరిద్దరికున్నా, వాళ్ల ఇళ్లలో వేర్వేరు తరగతులు చదివే ఇద్దరు పిల్లలు ఒకేసారి పాఠాలు వినలేరు. కొన్ని గ్రామాల్లో కరెంటు కోతలున్నాయి. అలా రకరకాల సమస్యలతో చాలామంది పిల్లలు ఆన్‌లైన్‌ తరగతులకు దూరమవుతున్నారు. మరోవైపు ‘చదువుకోలేకపోతున్నామ’నే ఒత్తిడికీ గురవుతున్నట్లు గమనించా. అదే సమయంలో చదువులో ముందుండే బీఎస్సీ విద్యార్థిని ఐశ్వర్యారెడ్డి ల్యాప్‌టాప్‌ కొనలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన నన్ను బాగా కలతపెట్టింది. సరిగ్గా అప్పుడే పదోతరగతి అమ్మాయిలు నలుగురు ఫోన్లు లేకపోవడంతో క్లాసు వినలేక, ఇబ్బందిపడుతున్నారని ఒక టీచర్‌ ద్వారా తెలిసింది. వాళ్లకు వెంటనే నాలుగు స్మార్టుఫోన్లు కొనిచ్చాను. కరీంనగర్‌ జిల్లా, బ్రాహ్మణపల్లి బాలికల పాఠశాలలో పదిమందికి స్మార్ట్‌ఫోన్లు అవసరమని మరో టీచర్‌ నాతో చెప్పారు. ఆ విషయాన్ని సోషల్‌మీడియాలో షేర్‌చేశా. భూమిక ఉమెన్స్‌ కలెక్టీవ్‌ కొండవీటి సత్యవతి స్పందించి, పది ఫోన్లు ఇచ్చారు. అప్పుడు ఆ విద్యార్థుల కళ్లల్లోని ఆనందం నాకు చెప్పలేనంత తృప్తినిచ్చింది. అయితే, అంతటితో ఆగకూడదనుకున్నా.


ఫోను కోసం కూలికి....

నెలరోజుల కిందట ఒంటరిగా ప్రారంభించిన ఉద్యమాన్ని తెలుగు ప్రాంతాలతో పాటు ఇతరదేశాల్లోని నా స్నేహితులూ భుజానికెత్తుకున్నారు. వాళ్లందరి సహకారంతో ఇప్పటి వరకు వంద స్మార్ట్‌ఫోన్లను అందించాం. ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట స్కూల్లోని పదోతరగతి విద్యార్థులు కొందరు ఫోన్లు లేక క్లాసులకు దూరమయ్యారని తెలిసింది. పైగా వాళ్లంతా బాగా చదువుతారు కూడా. ఆ సంగతి తెలిసిన వెంటనే మరో పదిహేను స్మార్టుఫోన్లు పంపాం. ఈ క్రమంలో నేను, మరికొంతమంది స్నేహితులతో గంభీరావుపేటకు వెళ్లినప్పుడు ఒకమ్మాయి పొలం పనికెళుతూ మాకెదురైంది. తొమ్మిదోతరగతి చదువుతున్న తాను ఫోను కొనుక్కోడానికే కూలికెళుతున్నానని చెప్పినప్పుడు, మనసు మెలిపెట్టినట్టైంది. అప్పటికప్పుడు ఫ్రెండ్స్‌తో మాట్లాడి, ఒక ఫోను తెప్పించి ఇవ్వగలిగాం. అలా ఒకరా, ఇద్దరా...మా దృష్టికొస్తున్న వాళ్లంతా ఎక్కువగా రోజుకి మూడు పూటలా తినడానికీ లేనోళ్లు, సింగిల్‌ పేరెంట్‌ చిల్డ్రన్సే. ఆ క్రమంలో ఐఐటీ ముంబాయి, ఢిల్లీ, హైదరాబాద్‌ తదితర సెంట్రల్‌ యూనివర్సిటీల్లోని తెలంగాణకు చెందిన దళిత, ఆదివాసీ విద్యార్థులు కొందరు నన్ను సంప్రదించారు. చదువులో భాగంగా వాళ్లందరికీ ల్యాప్‌ట్యా్‌పలు చాలా అవసరం. కానీ కొనగలిగే స్థోమత లేదు. 


అదే విషయాన్ని అమెరికాలోని అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌, తెలుగు ఇండియా సంస్థల నిర్వాహకులతో పాటు మరికొందరు మిత్రులతో చెప్పా. వాళ్లంతా స్పందించి, పది మందికి ల్యాప్‌టా్‌పలు, మరో ఇద్దరికి ట్యాబ్‌లను పంపించారు. వాటి అవసరం ఉన్నవాళ్లు చాలామందే. వాళ్ల నుంచి నాకు రోజూ అభ్యర్థనలు వస్తున్నాయి. పైగా వారంతా నిరుపేదలు. కానీ స్మార్ట్‌ఫోన్లుంటేనే వాళ్లు ఇప్పుడు చదువుకోగలరు. అలాంటి వాళ్లందరికీ నావంతు సాయం చేయాలనుకుంటున్నా. అందుకు ఒక్కోరోజు ఇరవై గంటలు పనిచేస్తున్న సందర్భాలున్నాయి. స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించే బాధ్యతను స్థానిక యువతకు అప్పగించాను. సిమ్‌కార్డు కొనుగోలు, నెలవారీ రీచార్జీ తదితర ఖర్చులను చెల్లించేందుకు కొందరు స్థానికులు, మరికొందరు ఉపాధ్యాయులు ముందుకొచ్చారు.


సెల్‌ఫోన్లతో పాడవుతారా....

నేనిలా పనిచేస్తున్న క్రమంలో కొందరు ప్రగతిశీలకారుల నుంచి విమర్శలూ ఎదుర్కొన్నా. మారుమూల పల్లెల్లోని పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇచ్చి పాడుచేస్తున్నావన్నారు. పరోక్షంగా కార్పొరేట్లకు లబ్ది కలిగిస్తున్నాననీ అన్నారు. అయితే, ఆ విధంగా టీచర్లు, తల్లితండ్రులు మాత్రం అనుకోడం లేదు.  ఇప్పుడు విద్యకు టెక్నాలజీ అనుసంధానమైంది. ఇంకా చెప్పాలంటే, టెక్నాలజీ లేకుండా విద్యలేదు. మరి, సాంకేతిక అంశాల్లో పేదలు వెనకబాటుతనంలోనే ఉండాలా! అసలు ఒక స్మార్ట్‌ఫోనుతోనే పిల్లలు పాడవుతారనడం సరికాదు. అందులో పనికొచ్చే అంశాలు ఎన్ని లేవు. మేము పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చి వదిలేయడం లేదు. ఆపై నిరంతరం ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తున్నారు కూడా. నేను చేపట్టిన ఈచ్‌వన్‌ రీచ్‌వన్‌ ఉద్యమానికి ఢిల్లీకి చెందిన క్యాషిఫై సంస్థ సాంకేతిక సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. స్థానిక ఉపాధ్యాయుల సహకారంతో ఫోన్లు అవసరం ఉన్నవాళ్లను గుర్తించి, ఇస్తున్నాం. అదీ తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకే ప్రాధాన్యత ఇస్తున్నాం. 


మన బాధ్యత....

ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవాళ్లకే సమాజం పట్ల బాధ్యత ఉంటుంది. ప్రైవేటు స్కూళ్లలో మార్కెట్‌ విలువలు నేర్పితే,   గవర్నమెంటు స్కూళ్లలో మానవవిలువల్ని బోధిస్తారు. తద్వారా సామాన్యుల పక్షాన నిలిచే పౌరులు తయారవుతారు. కనుక ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయడాన్నీ ఉద్యమంగా స్వీకరించా. మూడేళ్ల కిందట ‘‘ఎంపవర్‌ తెలంగాణ’’ పేరుతో గవర్నమెంటు స్కూళ్లలోని సమస్యలపైనా పనిచేస్తున్నా. గతేడాది బ్రాహ్మణపల్లి బాలికల పాఠశాలను అర్బన్‌ రెసిడెన్షియల్‌గా మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఆ స్కూలు మూతపడితే, కొన్ని వందల అమ్మాయిలు చదువుకి దూరమవుతారు. కనుక స్థానికులతో కలిసి బడి కోసం ఉద్యమించాం. పాఠశాలను కాపాడుకోగలిగాం. అలానే, మహబూబ్‌నగర్‌, సిరిసిల్ల, వరంగల్‌ జిల్లాల్లోని మరికొన్ని స్కూళ్లలో మౌలిక వసతులను కల్పించగలిగాం.  


పండుగల వేళ...

మన సమాజంలో సేవంటే పండ్లు, పులిహోర పొట్లాలు పంచడం అనుకుంటారు చాలామంది. పేదల విద్యకోసం తోడ్పడటాన్ని ఒక చారిటీలా చూడకూడదు. పేదలు యాచకులు కారు. సాయపడటం ద్వారా వాళ్లు మనకొక అవకాశం ఇస్తున్నారు. ఏదైనా సమాజం చదువుతోనే ముందుకెళుతుంది. కనుక పేద విద్యార్థుల చదువుకి అవసరమయ్యే వసతి, సౌకర్యాలను కల్పించడం మనందరి బాధ్యత. ఇప్పుడు క్రిస్మస్‌, న్యూఇయర్‌, సంక్రాంతి వంటి పండుగలొస్తున్నాయి. ఈ సందర్భంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ, తమ చుట్టూ ఉన్న పేద విద్యార్థుల చదువుకోసం సాయపడాలని కోరుతున్నా. ఈచ్‌వన్‌ రీచ్‌వన్‌ కార్యక్రమం గురించి తెలిసి, అనంతపురం జిల్లాలోని ఒక న్యాయనిపుణుడు మాకు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. అలాగే కొందరు నిరుద్యోగులు సైతం తమ స్థోమత కొద్దీ విరాళమిచ్చేందుకు ముందుకొచ్చారు. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఫేస్‌బుక్‌లో ‘ఈచ్‌వన్‌ రీచ్‌వన్‌’ చూడటం ద్వారా సంప్రదించవచ్చు.’’

- కె. వెంకటేశ్‌, ఫొటో : లవకుమార్‌








Updated Date - 2020-12-21T05:50:33+05:30 IST