రైతులను కేంద్రం బెదిరిస్తోంది : అకాలీదళ్ ఫైర్

ABN , First Publish Date - 2021-01-17T17:05:28+05:30 IST

రైతు సంఘం నేత బల్‌దేవ్ సింగ్, నటుడు దీప్‌సింధుతో పాటు మరో 40 మందికి ఎన్‌ఐఏ నోటీసులు జారీ చేయడంపై అకాలీదళ్ భగ్గుమంది.

రైతులను కేంద్రం బెదిరిస్తోంది : అకాలీదళ్ ఫైర్

న్యూఢిల్లీ : రైతు సంఘం నేత బల్‌దేవ్ సింగ్, నటుడు దీప్‌సింధుతో పాటు మరో 40 మందికి ఎన్‌ఐఏ నోటీసులు జారీ చేయడంపై అకాలీదళ్ భగ్గుమంది. అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ట్వీట్ చేస్తూ.... రైతు సంఘం నేతలకు దర్యాప్తు సంస్థల ద్వారా నోటీసులు పంపి, వారిని బెదిరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. నోటీసులు పంపడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. ‘‘రైతు నేతలకు, నటుడికి ఎన్‌ఐఏ నోటీసులు పంపి, విచారణకు హాజరు కావాలని ఆదేశించడాన్ని ఖండిస్తున్నాం. వారేమీ దేశ ద్రోహులు కాదు. తొమ్మిదో రౌండ్ చర్చలు విఫలమైన నేపథ్యంలో రైతులను విసిగించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నది స్పష్టమౌతోంది.’’ అంటూ బాదల్ ట్వీట్ చేశారు. 

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా నిరసన తెలుపుతున్న వారిలో దాదాపు 40 మందికి కేంద్ర దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసింది. ఈ 40 మందిలో నటుడు దీప్ సింధు కూడా ఉన్నాడు. వీరందర్నీ ఢిల్లీలోని ఎన్‌ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. రైతు నిరసనల వెనుక ఉన్న కొన్న అరాచక శక్తుల గురించి ఆరా తీయడానికే ఈ నోటీసులని ఎన్‌ఐఏ పేర్కొంది. 

Updated Date - 2021-01-17T17:05:28+05:30 IST