సమ్మర్‌ క్యాంపులపై సందిగ్ధత

ABN , First Publish Date - 2021-03-01T07:31:56+05:30 IST

ఈ యేడాది కూడా జీహెచ్‌ఎంసీ వేసవి క్రీడా శిక్షణా శిబిరాల

సమ్మర్‌ క్యాంపులపై సందిగ్ధత

ఇప్పటికీ ప్రారంభం కాని కసరత్తు

కరోనా వ్యాప్తితో గతేడాది రద్దు

ఈ సారి కష్టమే అంటోన్న యంత్రాంగం

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ఈ యేడాది కూడా జీహెచ్‌ఎంసీ వేసవి క్రీడా శిక్షణా శిబిరాల నిర్వహణ కష్టమేనా, వరుసగా రెండో సంవత్సరం పిల్లలు ఆటలకు దూరమవుతారా, అంటే ఔననే చెబుతున్నాయి సంస్థవర్గాలు. కొవిడ్‌ రెండోదశ వ్యాప్తి ప్రచారం నేపథ్యంలో శిబిరాల నిర్వహణపై జీహెచ్‌ఎంసీ అధికారులు సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి కసరత్తు ప్రారంభించలేదని క్రీడా విభాగం ఉన్నతాధికారొకరు తెలిపారు. గతేడాది మార్చి 2న నగరంలో కొవిడ్‌-19 మొదటి కేసు నమోదైంది. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో గత సంవత్సరం జీహెచ్‌ఎంసీ వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహించలేదు. వాస్తవంగా ప్రతి యేడాది వేసవిలో మే మొదటివారంలో ప్రారంభిస్తారు. 45-50 క్రీడల్లో దాదాపు 700లకుపైగా కేంద్రాల్లో పిల్లలకు శిక్షణ ఇస్తారు. జీహెచ్‌ఎంసీకి నగరంలో 521 ప్లే గ్రౌండ్స్‌, ఏడు ఈత కొలనులు, 17 స్పోర్ట్‌ కాంప్లెక్స్‌లు, 11 రోలర్‌ స్కేటింగ్‌ రింక్స్‌, ఐదు టెన్నిస్‌ కోర్టులున్నాయి. పిల్లలకు ఆసక్తి ఉన్న క్రీడల్లో నిర్ణీత సమయంలో కోచ్‌లు శిక్షణ ఇస్తారు. 

క్రీడా శిబిరాలకు ఆరేడేళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఉన్న పిల్లలు వస్తుంటారు. క్రీడా వస్తువులను పిల్లలందరూ వినియోగిస్తారు. సామాజిక దూరం పాటించడమూ ఇబ్బందికరమే. ఇది వైరస్‌ వ్యాప్తికి దారి తీసే ప్రమాదముంది. ఈ సమయంలో వేసవి శిక్షణా శిబిరాల నిర్వహణ సురక్షితమేనా అన్న యోచనలో జీహెచ్‌ఎంసీ అధికారులు ఉన్నారు. వాస్తవంగా శిక్షణా శిబిరాలు నిర్వహించాలంటే ముందస్తుగా ఫిబ్రవరి, మార్చి నుంచే ఏర్పాట్లు చేయాలి. టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించి క్రీడా పరికరాలు సమీకరించాలి. గ్రౌండ్లను సిద్ధం చేయడం, తాగునీరు, మరుగుదొడ్ల మరమ్మతు, తదితర వసతులు కల్పించాలి. కానీ, ఇప్పటి వరకు ఆ దిశగా ఏర్పాట్లు ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో ఈ సారి సమ్మర్‌ క్యాంపుల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

Updated Date - 2021-03-01T07:31:56+05:30 IST