ముదిరిన ఎండలు

ABN , First Publish Date - 2021-03-05T05:19:26+05:30 IST

ఏప్రిల్‌లోకి ఎంటర్‌కాకముందే ఎండలు ఎర్రెత్తిస్తున్నాయి.. గతేడాది కంటే అధిక

ముదిరిన ఎండలు

  • వేసవి ఆరంభంలోనే భానుడి ప్రతాపం
  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు 
  • ఉక్కిరిబిక్కిరవుతున్న జనం  
  • చల్లని పానీయాలకు మొదలైన గిరాకీ


ఏప్రిల్‌లోకి ఎంటర్‌కాకముందే ఎండలు ఎర్రెత్తిస్తున్నాయి.. గతేడాది కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వాసులు భానుడి భగభగలకు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటలకే సూర్యుడు ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు..రోజురోజుకూ పెరుగుతున్న ఎండ వేడిమికి అల్లాడుతున్నారు. ఉక్కబోతకు వృద్ధులు, చిన్నారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.  వేసవి ఆరంభంలోనే ఇలా ఉంటే.. మున్ముందు ఎండలు ఇంకా ఎలా ఉంటాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) :  వేసవి ఆరంభంలోనే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండ వేడిమికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవు తున్నారు. రోజువారి పనులలో భాగంగా జనం బయటకు వెళ్లాలంటేనే మండుటెండలను చూసి జంకుతున్నారు. వేసవి ఆరంభంలోనే ఇంత తీవ్రత ఉంటే ఏప్రిల్‌, మేలో ఉష్ణోగ్రతలు ఏమేర ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. ఎండ వేడిమికి తట్టుకునేందుకు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏటా వేసవిలో ఎండ వేడిమికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలు అల్లాడి పోతున్నారు. గతంతో పోలిస్తే ఈ సారి ఆరంభంలోనే ఎండలు మండు తున్నాయి. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులతో జనం విలవిల్లాడిపోతున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండ ఎక్కువగా ఉంటోంది. మధ్యాహ్నం ఇంటి నుంచి బయ టకు వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానియాలు, పండ్ల రసాలు సేవిస్తున్నారు. అలాగే ఎండలకు వడదెబ్బ తగలకుండా తలకు రక్షణగా టోపీలు పెట్టుకుంటున్నారు. రుమాళ్లు చుట్టుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు గొడుగులు పట్టుకొని వెళ్తున్నారు. ఎండల తీవ్రత నెమ్మదిగా పెరుగుతుండటంతో పాటు వడగాల్పులు మొదలైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వారం రోజుల నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. పగటితో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు సైతం అధికం కావడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వడదెబ్బకు గురికాకుండా ఇప్పటి నుంచే పలు జాగ్రత్తలు పాటించాలని టీఎస్‌డీపీఎస్‌ ఈవో రామకృష్ణ తెలిపారు. 


శీతల పానీయాలకు పెరిగిన గిరాకీ

వేసవి సీజన్‌ ప్రారంభం కావడంతో వ్యాపారాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే శీతలపానీయాల కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కూలర్ల తయారీలో వ్యాపారులు నిమగ్నమయ్యారు. మూలనపడి ఉన్న కూలర్‌, ఏసీ, ఫ్రిజ్‌లకు మరమ్మతులు చేయిస్తున్నారు. ధరలు పెరుగుతాయేమోనని కొందరు ముందస్తుగా కూలర్లు, ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. రైతులు కూడా ప్రధానంగా దోస, కర్బూజ పంటల సాగుపై మక్కువ చూపుతున్నారు. 


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఉష్ణోగ్రతల వివరాలు

    రంగారెడ్డి జిల్లా          మేడ్చల్‌ జిల్లా   వికారాబాద్‌ జిల్లా

తేది కనిష్ఠం గరిష్ఠం కనిష్ఠం గరిష్ఠం కనిష్ఠం గరిష్ఠం

(మార్చి)

04 13.0 37.9 14.0 35.3 13.6 37.4

03 16.0 37.9 15.7 35.6 16.2 37.9

02 17.2 37.6 16.4 36.5 17.9 38.0

01 16.6 37.7 18.2 37.4 17.6 37.8

(ఫిబ్రవరి)

28 15.0 38.4 14.7 36.8 14.9 39.0

27 15.6 37.5 16.0 36.4 15.9 38.0

26 14.3 38.3 14.7 37.8 14.3 37.7

25 14.3 38.3 13.7 36.3 15.9 38.0

24 13.5 37.5 12.8 35.7 13.0 36.4

23 14.5 36.1 15.4 35.3 14.6 36.3

22 16.4 34.5 15.6 32.8 16.5 35.5

21 16.3 32.5 15.1 30.4 15.3 33.0

Updated Date - 2021-03-05T05:19:26+05:30 IST