Abn logo
Mar 30 2021 @ 14:05PM

మీ ఆరోగ్యం...చల్ల చల్లగా

ఆంధ్రజ్యోతి(30-03-2021)

ఈ ఏడాది ఎండ కరోనా కన్నా పెద్ద దెబ్బే కొట్టేలా ఉంది. కాబట్టి ఎండ నుంచి   తప్పించుకునేందుకు ఒంటికి చల్లదనాన్ని, శక్తిని అందించే  ఆహారం, అలవాట్లు మొదలుపెట్టాలి. ఇందుకోసం సమ్మర్‌ను స్మార్ట్‌గా ఎదుర్కొనే చిట్కాలు పాటించాలి!


వేసవి వేడితో శరీరంలోనూ వేడి పెరుగుతుంది. దాంతో అలసట, బడలిక, విపరీతమైన చెమట, చర్మం పొడిబారడం, తలనొప్పి, మగత, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎండ వేడిమికి శరీర ఉష్ణోగ్రత క్రమేపీ పెరుగుతూ 104 డిగ్రీలకు చేరుకుంటే ఎండదెబ్బకు గురవుతాం! అత్యధిక ఉష్ణోగ్రతలకు గురయినా లేక వేడి వాతావరణంలో శారీరక శ్రమ వల్ల శరీర ఉష్ణోగ్రత ఆ మేరకు చేరుకున్నా, ఎండదెబ్బకు గురవడం సహజం. అందుకు పలు కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి....


గాలి తగలని దుస్తులు, చెమటను పీల్చుకునే వీలు లేని దుస్తులు ధరించడం. వేడిని త్వరగా గ్రహించే నల్లని దుస్తులు ధరించడం.

మద్యం మద్యం తాగడం వల్ల ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేసే శక్తిని శరీరం కోల్పోతుంది.

చెమట ద్వారా శరీరం కోల్పోయిన నీటిని భర్తీ చేయకపోవడం. 

నివారణ తేలికే!

ఎండదెబ్బకు గురయి బాధ పడేకన్నా, ఆ స్థితి రాకుండా జాగ్రత్త పడడం మేలు. వేసవి వేడికి గురవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి.


దుస్తులు: తేలికగా, గాలి చొరబడేలా, చెమట పీల్చేలా సౌకర్యంగా ఉండాలి. వీలైనంతవరకూ నూలు, తెల్లని దుస్తులే ధరించాలి.


సూర్యరశ్మి: నేరుగా సూర్యరశ్మి సోకితే, శరీరం తనంతట తాను చల్లబడే స్వభావాన్ని కోల్పోతుంది. కాబట్టి ఎండలో బయటకు వెళ్లవలసివస్తే తలకు టోపీ, కళ్లకు చలువ కళ్లద్దాలు, గొడుగు తప్పనిసరిగా వాడాలి. వైద్యులు సూచించే సన్‌స్ర్కీన్‌ వాడడం వల్ల చర్మం కమిలిపోదు. పొడిబారదు.


నీళ్లు: దాహం వేసేవరకూ ఆగకుండా గంటకొకసారి నీళ్లు తాగుతూ ఉండాలి. నీళ్లతోపాటు కొబ్బరినీరు, మజ్జిగ కూడా తరచుగా తాగుతూ ఉండాలి. ఇలా ఒంట్లో నీరు, ఖనిజలవణాల పరిమాణాన్ని సక్రమంగా ఉంచుకుంటే ఎండ ప్రభావం నుంచి తప్పించుకోగలుగుతాం.


వ్యాయామ వేళలు: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎండ తీవ్రత ఎక్కువ. కాబట్టి ఆ సమయాల్లో నీడ పట్టున గడపాలి. వ్యాయామానికి తీవ్రత లేని సమయాలను కేటాయించాలి.

వేసవిలో పసిపిల్లల రక్షణ!    

పిల్లల లేత శరీరాలు తేలికగా  ఎండ దెబ్బకు గురవుతాయి. సున్నితమైన పిల్లల రోగ నిరోధక శక్తి వారికి ఈ కాలానికి తగినంత ఆరోగ్య రక్షణనూ అందించలేదు. కాబట్టి ఎండాకాలంలో... పిల్లలకు వేసే దుస్తుల మొదలు, అందించే ఘన, ద్రవ పదార్థాల వరకూ ప్రతి విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.


ఆరు నెలల లోపు పిల్లలకు తల్లి పాలు తప్ప విడిగా మరే ద్రవాలు ఇవ్వవలసిన అవసరం లేదు. పాల ద్వారానే వాళ్ల దాహార్తి తీరుతుంది. తల్లి పాలతో వేసవి వేడిమిని తట్టుకునే శక్తీ వస్తుంది. 

పసికందులు రోజుకి ఆరు నుంచి ఏడుసార్లు మూత్ర విసర్జన చేస్తుంటే వాళ్ల దాహార్తి తీరుతోందని అర్థం చేసుకోవాలి. అంతకన్నా తక్కువ సార్లు చేస్తే తల్లి పాలు సరిపోవట్లేదని గ్రహించి పోత పాలు మొదలుపెట్టాలి.

పిల్లల మూత్రం నీరులా స్వచ్ఛంగా ఉందంటే వాళ్లకు సరిపడా నీరు అందుతోందని గ్రహించాలి. 

ఆరు నెలలు దాటి ఘనాహారం మొదలుపెట్టిన పిల్లలకు కొబ్బరి నీరు, చక్కెర కలపని తాజా పండ్ల్ల రసాలు తాగించవచ్చు.

పిల్లలకు ఘనాహారంగా బియ్యం నూక, గోధుమలు, రాగులను వేగించి పొడి చేసి డబ్బాల్లో పోసి పెట్టుకుని వాడుకోవాలి.

పొడికి నీళ్లు చేర్చి మెత్తగా ఉడికించి పప్పు, కూరలతో తినిపించవచ్చు.

ఘనాహారంతోపాటు తాజా పండ్ల చిన్న ముక్కలుగా కోసి లేదా గుజ్జు చేసి తినిపించాలి.

ఆహారం తినిపించే ముందు, తినిపించిన వెంటనే స్నానం చేయించకూడదు. 


పిల్లలకు ఎండ దెబ్బ తగలకుండా!

పసికందులైతే ఇంట్లో 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా ఏసీ సెట్‌ చేసుకోవాలి. అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వల్ల పసికందులు ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంది.

ఎయిర్‌ కూలర్లు వాడకపోవటమే మంచిది. వీటి వల్ల పిల్లలకు ఇన్‌ఫెక్షన్లు మొదలవుతాయి.

తడిపి పిండిన దుప్పట్లు, వట్టి వేళ్ల చాపలు కిటికీలకు కట్టడం వల్ల గది చల్లబడుతుంది. అయితే అవి శుభ్రంగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. 

ఏసీలు, కూలర్లకు బదులుగా నీళ్లు నింపిన వెడల్పాటి బేసిన్లు ఉంచి ఫ్యాన్‌ వేసినా గదులు చల్లబడతాయి. అయితే పిల్లలు ఆ నీళ్ల దగ్గరికి పోకుండా చూసుకోవాలి. 

పిల్లలకూ చలువ కళ్లద్దాలు, క్యాప్‌ తప్పనిసరిగా అలవాటు చేయాలి.

ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఏం చెబుతున్నాయంటే...


ఆయుర్వేదం: పిత్త లక్షణం వేడికి సంబంధించినది కాబట్టి శరీర స్వభావం పిత్త అయినా, కాకపోయినా, వేసవిలో కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. పూర్వం లేని చిరాకు, విసుగు కనిపిస్తే మీలో పిత్త దోషం పెరుతున్నట్టు అర్ధం. ఈ లక్షణాలు మానసికమైనవైతే అలసట, జుట్టు పొడిబారడం, పొట్టలో పుండ్లు, ఛాతీలో మంట లాంటి శారీరక లక్షణాలూ కనిపిస్తాయి. ఇవన్నీ శరీరంలో వేడి పెరిగింది అనడానికి సూచనలు. దీనికి విరుగుడు శరీరాన్ని చల్లబరిచే ఆహారం తీసుకోవడమే! ఇందుకోసం....


శీతలపానీయాలు వద్దు: చల్లదనం వేడికి విరుగుడు అనుకుంటాం. కానీ ఆహారం విషయంలో ఈ సూత్రం వర్తించదు. చల్లని శీతలపానీయాల వల్ల జీర్ణాగ్ని హెచ్చుమీరి అజీర్తి చేస్తుంది. కాబట్టి చల్లని నీరు, శీతలపానీయాలు తీసుకోకూడదు. బదులుగా గది ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉన్న తాజా నీరు తాగాలి.


చల్లదనాన్నిచ్చే ఫలాలు, కూరగాయలు: పుచ్చ, ద్రాక్ష, దోస లాంటి పండ్ల్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. అలాగే పాలు, వెన్న, నెయ్యి కూడా శరీర వేడిని తగ్గిస్తాయి. దోసకాయ, బ్రొకొలి, కాలీఫ్లవర్‌ మొదలైన కూరగాయలు కూడా శరీర వేడిని విరుస్తాయి. వీటితోపాటు నీరు ఎక్కువగా ఉండే బీరకాయలు, పొట్లకాయలు కూడా తింటూ ఉండాలి.


హోమియోపతి వైద్యంలో: ఎండ వేడిమి వల్ల తలనొప్పి, ఒళ్లు నొప్పులు తలెత్తుతాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే హోమియే చిట్కాలను అనుసరిస్తే ఎండదెబ్బకు గురవకుండా ఉంటాం! అవేమిటంటే...


బెల్లడోనా: వేడిమి కారణంగా ముఖం నుంచి వేడి ఆవిర్లు వెలువడినా, కనుగుడ్లు తేలిపోతూ, విపరీతమైన తలపోటు ఉన్నా, స్వేదం లేకున్నా ఉక్కపోతగా తోచినా బెల్లడోనా తీసుకోవాలి.


బ్రయోనియా: ఎండలో ఉన్నంతసేపు ఎలాంటి తలనొప్పి లక్షణం కనిపించకపోయినా, సాయంత్రానికి లేదా మరునాటికి మొదలైతే బ్రయోనియా మందు తీసుకోవాలి.


ఫెర్రమ్‌ ఫాస్‌: ఈ ఐరన్‌ సెల్‌ సాల్ట్‌, కణతల దగ్గర తలెత్తే నొప్పికి చక్కని విరుగుడు.


పల్సటిల్లా: కత్తితో పొడిచినట్టు తల మొత్తం బాధిస్తున్నప్పుడు పల్సటిల్లా వాడాలి.


క్యాంథారిస్‌: ఎండకు కమిలిన చర్మం కోసం ఒకటి లేదా రెండు మోతాదుల క్యాంథారిన్‌ వాడాలి.


అర్టికా యురెన్స్‌: చెమటపొక్కుల వల్ల కలిగే నొప్పి, మంటల నుంచి ఉపశమనం కోసం ఈ మందును ఆ ప్రదేశాల్లో వాడవచ్చు.

ఎండ వేడిని తగ్గించే యోగా: తగిన ఆహార నియమాలు పాటిస్తూ, ఎండ నుంచి రక్షణ పొందడంతోపాటు కొన్ని యోగాసనాలు వేయడం ద్వారా కూడా వేసవి బాధల నుంచి తప్పించుకోవచ్చు. 


ఆంజనేయాసనం: కండరాలను వదులు చేసి, గుండెకు రక్తప్రసరణ మెరుగు చేసే ఈ ఆసనం వల్ల ఎండ ప్రభావం నుంచి రక్షణ పొందే శక్తి శరీరానికి చేకూరుతుంది. ఇందుకోసం ఒక మోకాలిని నేలకు ఆనించి మరో మోకాలును ముందుకు మడిచి, చేతులు జోడించి కొద్దిసేపు కూర్చోవాలి.


బద్ధకోణాసనం: విపరీతమైన వేడి వల్ల శరీరం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి వదలాలంటే శరీరాన్ని ముందు వైపు మడిచే పద్మాసనంలో కూర్చుని కాళ్లు మడిచి, పాదాలను ఒకదానికొకటి ఆనించాలి.


సింహాసనం: ఈ ఆసనంతో మనసు, శరీరంలోని రెండు రకాల ఒత్తిళ్లూ తొలగిపోతాయి. ఇందుకోసం మోకాళ్ల మీద కూర్చుని, రెండు చేతులను ముందు వైపు నేల మీద ఆనించి, నోరు తెరచి నాలుక బయట పెట్టాలి.


శవాసనం: వాతావరణం వేడిగా ఉన్నప్పుడు శరీరం, మెదడు శక్తిని పుంజుకునేలా ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి. ఈ ఆసనంలో కనీసం 10 నిమిషాలపాటు విశ్రాంతి పొందితే తగిన ఫలితం దక్కుతుంది. ఫలితం రెట్టింపవ్వాలంటే కొన్ని చుక్కల యూకలిప్టస్‌ నూనె చిలకరించిన వస్త్రాన్ని నుదుటి మీద పరుచుకోవాలి.