Abn logo
Sep 21 2020 @ 02:39AM

జడ్జీలను దూషిస్తే సుమోటో కేసులు

న్యాయవ్యవస్థపై దాడితో సీఎం దుస్సాహసం 

వైఎస్‌ కూడా జడ్జీలకు స్థలాలిచ్చారుగా? : అయ్యన్న

టీడీపీ ఎమ్మెల్యేలను గాడిదల్లా కొంటున్నారా? : బండారు

వైసీపీ అరాచకాలను కోర్టులు ప్రశ్నించకూడదా? : ఆలపాటి 


విశాఖపట్నం, అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థపై దాడి చేయడం ద్వారా ముఖ్యమంత్రి జగన్‌ దుస్సాహసానికి పాల్పడ్డారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆదివారం ఆయన విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు. అనేక అవినీతి కేసుల్లో ఏ-2గా ఉన్న విజయసాయిరెడ్డి ఏకంగా న్యాయమూర్తులనే దూషిస్తున్నారని ఆరోపించారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై సుమోటోగా కేసులు నమోదు చేసి విచారణ జరపాలని అయ్యన్న కోరారు.


ముఖ్యమంత్రిగా చంద్రబాబు అమరావతిలో జడ్జీలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 27 మంది జడ్జీలకు హైదరాబాద్‌లో ఇళ్ల స్థలాలు ఇచ్చారని గుర్తు చేశారు.

మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని విమర్శించిన జగన్మోహన్‌రెడ్డి... ఇప్పుడు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను గాడిదల్లా కొంటున్నారా? అని ప్రశ్నించారు. కాగా వైసీపీ  ప్రభుత్వ అరాచకాలను, తప్పిదాలను కోర్టులు ప్రశ్నించకూడదా అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ప్రశ్నించారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 


Advertisement
Advertisement
Advertisement