Jul 24 2021 @ 13:34PM

త్వరలో సుందర్ సి 'అరణ్మనై-3' రిలీజ్

ఆర్య, ఆండ్రియా, రాశీఖన్నా ప్రధాన పాత్రలలో ప్రముఖ దర్శకుడు సుందర్‌ సి తెరకెక్కించిన చిత్రం 'అరణ్మనై-3' త్వరలో విడుదలకానుంది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించి 50 శాతం సీటింగ్‌గ్‌తో థియేటర్లు తెరుచుకునేందుకు ఆగస్టు నుంచి అనుమతివ్వొచ్చని కోలీవుడ్‌ ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అనుమతిచ్చిన వెంటనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్‌ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త స్టిల్స్‌ విడుదల చేశారు. వీటిలో ఆర్య, రాశీఖన్నాతో పాటు దివంగత వివేక్‌, యోగిబాబు, మనోబాలా కలిసి ఉన్న పోస్టర్లున్నాయి. ఆసక్తికర అంశమేమిటంటే దర్శకుడు సుందర్‌ ఓ చిన్న పాపతో ముచ్చటించే పోస్టరు కూడా ఉంది.

అవ్ని పిక్చర్స్‌ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలన్నింటినీ కరోనా రెండో దశ వ్యాప్తి కంటే ముందుగానే పూర్తయింది. ఈ సినిమాలో సాక్షి అగర్వాల్‌తో పాటు దర్శకుడు సుందర్‌ కీలక పాత్ర పోషిస్తుండగా, సత్య సంగీతమందిస్తున్నారు. కాగా, ఈ చిత్రం క్లైమాక్స్‌ యాక్షన్‌ సన్నివేశాల కోసం రూ.1.50 కోట్ల వ్యయంతో ఒక ప్రత్యేక సెట్‌ను 300 మంది కళాకారులు శ్రమించి నిర్మించారు. ఇందులో చిత్ర బృందం సభ్యులతో 200 మంది జూనియర్‌ ఆర్టిస్టులతో కలిసి క్లైమాక్స్‌ను దాదాపుగా 16 రోజుల చిత్రీకరించడం గమనార్హం.