సండే రద్దీ

ABN , First Publish Date - 2020-11-23T05:57:16+05:30 IST

తుంగభద్ర పుష్కరాల మొదటి రెండు రోజులు భక్తుల్లేక వెలవెలబోయిన ఘాట్లు.. మూడోరోజు మాత్రం కాస్త రద్దీగా కనిపించాయి.

సండే రద్దీ
కర్నూలులో భక్తుల సందడి

  1. ఘాట్లలో మూడో రోజు భక్తుల రద్దీ
  2. నదిలోకి అనుమతించని అధికారులు
  3. షవర్ల కిందే పుష్కర స్నానాలు


కర్నూలు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర పుష్కరాల మొదటి రెండు రోజులు భక్తుల్లేక వెలవెలబోయిన ఘాట్లు.. మూడోరోజు మాత్రం కాస్త రద్దీగా కనిపించాయి. ఆదివారం కావడంతో పాటు నదీ స్నానాలకు అనుమతి ఉంటుం దని భావించి చాలామంది కుటుంబ సమేతంగా తరలి వచ్చారు. ఉదయమే సంకల్‌ బాగ్‌ ఘాట్‌కు వచ్చిన భక్తులకు నదీ స్నానాలు లేవని చెప్పేసరికి నిరాశ ఎదురైంది. నదిలో స్నానాలు చేసేవారిని అడ్డుకోవద్దని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ శనివారం అధికారులకు సూచించారు. అయితే తమకెలాంటి ఆదేశాలు లేవంటూ ఎవరినీ నది స్నానాలకు అధికారులు అనుమతించలేదు. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. స్నానాల కోసం సుదూరం నుంచి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. నదిలో మూడు మునకలు వేస్తే తనువంతా పులకిస్తుందని, షవర్ల కింద స్నానం ఇంట్లో చేసినట్లే ఉందని పెదవి విరుస్తున్నారు. షవర్ల నుంచి నీరు ఉధృతిగా రావడం లేదని, దీంతో ఎక్కువ సేపు నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు


స్నానాలు ఉన్నాయి.. అనుమతి లేదు

శనివారం మధ్యాహ్నం సంకల్‌ బాగ్‌ పుష్కర ఘాట్‌ను కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ సందర్శించి స్నానాలను అడ్డుకోవడద్దని వలం టీర్లకు, పోలీసులకు చెప్పి వెళ్లారు. ఇందుకు తగ్గట్లుగా శనివారం రాత్రి, ఆదివారం ఉదయం ఘాట్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. ఆదివారం ఉదయం సంకల్‌బాగ్‌ ఘాట్‌లో కొంతమందిని నదీ స్నానాలకు అనుమతిం చారు. మరికొద్దిసేపటికి అధికారులు, పోలీసులు వచ్చి నదిలోకి భక్తులను అనుమతించలేదు. నదిలో నీరు తగ్గడంతో భక్తులు దీపాలు వదులుకోవడానికి మాత్రమే ఈ ప్రత్యేక ఏర్పాట్లని బదులిచ్చారు.


పుష్కర జలానికి డబ్బులు

భక్తులు స్నానాలు చేశాక నది వద్దకు రాలేని తమ వారి కోసం పుష్కర జలాన్ని బాటిళ్లలో పట్టుకుని తీసుకుని వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం ఘాట్లలో ఎక్కడా చూసినా నీరు ముంచుకునే పరిస్థితి లేదు. దీంతో భక్తులు అక్కడ ఉన్న మునిసిపల్‌ సిబ్బంది సాయం కోరుతున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు సిబ్బంది భక్తులు నుంచి డబ్బులు తీసుకుంటున్నారు.


ఇంత అధ్వానమా?

పుష్కరాల్లో నదీ స్నానాలకు అనుమతిస్తు న్నట్లు పేపర్లో చూసి వచ్చాం. ఇక్కడక వచ్చాక స్నానాలకు అనుమతించడం లేదు. పైగా పిల్లలకు, వృద్ధులకు అనుమతి లేదని మొదటి నుంచి చెబుతున్నారు. ఇక్కడకు వచ్చి చూస్తే అలాంటి ఆంక్షలు లేవు. అయినా పుష్కరాల వంటి పుణ్య కార్యాలకు వచ్చేది వృద్ధులే. వారిని రావద్దనడం తగదు. ప్రకటనల్లో ఒకలా, వాస్తవ పరిస్థితుల్లో మరోలా ఉండడం మంచిది కాదు. కృష్ణా, గోదావరి పుష్కరాలను చూశాను కానీ ఇలాంటి అధ్వాన పరిస్థితులు ఎక్కడా చూడలేదు. 

- నాగేశ్వరరెడ్డి, గద్వాల జిల్లా, తెలంగాణ


సౌకర్యాలను మెరుగుపరుస్తాం

భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. అయితే స్నానాలు లేవని, పిల్లలకు, వృద్ధులకు అనుమతి లేదని ముందు నుంచీ చెబుతున్నాం. ఇక్కడకు తీసుకుని వచ్చాక అనుమతిస్తున్నాం. స్నానాలకు మాత్రం అనుమతించడం లేదు. దీపాలు వదులుకోవడానికి మాత్రమే ఘాట్లో ఏర్పాట్లు చేశాం. కార్తీక సోమవారం భక్తులు ఎక్కువగా రావచ్చు. షవర్లలో నీరు అందుబాటులో ఉండేలా మరో ట్యాంకును అందుబాటులో ఉంచుతున్నాం. -ఎ.శ్రీనివాసులు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, సంకల్‌ బాగ్‌ పుష్కర ఘాట్‌ ఇన్‌చారి


పులకించిన మంత్రాలయం

ఎమ్మిగనూరు టౌన్‌/మంత్రాలయం: మంత్రాలయం పుష్కర ఘాట్లకు ఆదివారం ఏపీ నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి భక్తులు తరలివచ్చారు. నదిలోకి అనుమతి లేకపోవడంతో షవర్ల కిందే స్నానాలు ఆచరించారు. అనంతరం నదికి ప్రత్యేక పూజలు చేసి దీపాలను వెలిగించారు. చీర, సారె, పసుపు, కుంకమలను నదికి సమర్పించారు. స్నానాల ఘాట్ల వద్ద చిన్నారులు, యువతులు సందడి చేశారు. పలువురు సెల్ఫీలు తీసుకుంటూ ఆనందంగా గడిపారు. ఓ అఘోరా శంఖువు పూరిస్తూ భక్తులను ఆకట్టుకున్నారు. ఘాట్ల వద్ద ఆర్డీవో రామకృష్ణారెడ్డి, డీఎస్పీ వినోద్‌కుమార్‌, సీఐ కృష్ణయ్య, ఎమ్మిగనూరు పట్టణ ఎస్‌ఐ వెంకటరాముడు, మంత్రాలయం ఎస్‌ఐలు వేణుగోపాల్‌రాజు, ఎర్రన్న, మాధవరం ఎస్‌ఐ బాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తుల రాకతో శ్రీమఠంలో రద్దీ నెలకొంది. ముందుగా గ్రామదేవత మంచాలమ్మను, రాఘవేంద్రస్వామి మూల బృందావనంను దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. భక్తులను పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ఆశీర్వదించారు. 


సంగమేశ్వరంలోనూ సందడి

ఆత్మకూరు: సప్తనదీ సంగమేశ్వర క్షేత్రానికి భక్తులు తరలి వచ్చారు. సెలవు దినం కావడంతో విజయవాడ, బాపట్ల, చీరాల, రాజమండ్రి, గుంటూరు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. స్నానాలకు అనుమతి లేకపోవడంతో జల్లుస్నానాలు, తలపై నీళ్లు చల్లుకుని సంప్రోక్షణ పొందారు. భక్తులకు కపిలేశ్వరంలో కాశిరెడ్డినాయన ఆశ్రమం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. పుష్కర ఏర్పాట్లను ఘాట్‌ ఇన్‌చార్జ్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఘాట్‌-2 ఇన్‌చార్జి డ్వామా పీడీ వెంకన్న, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో చంద్రశేఖర్‌, దేవస్థానం ఈవో నాగప్రసాద్‌ పర్యవేక్షించారు.



Updated Date - 2020-11-23T05:57:16+05:30 IST