వీడని వేదన

ABN , First Publish Date - 2022-01-23T05:28:32+05:30 IST

మనుషుల్లో వైరాగ్యం అనే భావన కొవిడ్‌ తొలిదశ కంటే రెండో దశలోనే ఎక్కువైంది. దీనికి కారణం అధిక ప్రాణనష్టమే.

వీడని వేదన

జీవితంపై వైరాగ్యపు భావన

కొవిడ్‌ విలయం తర్వాత మారిన మనిషి వైఖరి

తగ్గిపోతున్న కాన్ఫిడెన్స్‌ లెవెల్స్‌

భవిష్యత్తు ప్రణాళికలపై నిరాసక్తత 

ఉపాధిలో క్షీణత, కుటుంబ సభ్యలను కోల్పోవడమే కారణం

ఆర్‌బీఐ తాజా నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడి

పాజిటివ్‌ థింకింగ్‌, వ్యాయామాలే ఔషధాలు


- కరోనా సెకండ్‌వేవ్‌లో భారతదేశంలో ప్రతి వ్యక్తి తమకు తెలిసిన వారిలో అత్యంత ఆప్తులైన ఇద్దరు వ్యక్తులను కోల్పోయారని హ్యుమన్‌ రిసోర్స్‌ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. 

 -  కొవిడ్‌ తరువాత ఆరోగ్య బీమాలను కట్టడంపై ఉన్నంత ఆసక్తి సాధారణ బీమాలపై చూపడం లేదు.

 -  కొవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితులు మహిళల ఆత్మవిశ్వాసంపై పెద్దగా ప్రభావం చూపలేదని జర్మనీకి చెందిన ఒపీనియన్‌ అవుట్‌పోస్టు అనే సర్వే సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. 

 

 

పాజిటివ్‌ థింకింగ్‌తోనే పరిష్కారం..

ఒక ద్వారం మూసుకుంటే ఇంకో ద్వారం తెరుచుకుని ఉంటుంది. మనం మూసి ఉన్న ద్వారం వైపే ఎక్కువసేపు చూడటం వల్ల తెరిచి ఉన్న ద్వారాన్ని గమనించం..

- తత్వవేత్త హెలెన్‌ కిల్లర్‌ చెప్పిన మాటలివి.


ఇప్పుడు కాలాన్ని కొవిడ్‌కు ముందు, కొవిడ్‌కు తర్వాత అంటూ విభజిస్తున్నారు. దీనికి కారణం ఈ మహమ్మారి ప్రతిఒక్కరి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపడమే. గతంలో వచ్చిన వైరస్‌లు, కేవలం వ్యక్తి ఆరోగ్యంపై మాత్రమే ప్రభావం చూపాయి. కరోనా మాత్రం వాటికి భిన్నంగా ఆరోగ్యంతోపాటు మనిషి సామాజిక, ఆర్థిక, కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపింది. వీటితోపాటు ప్రతి మనిషికి బలంగా భావించే.. భవిష్యత్తుపై ఆశ అనే ఆయుధాన్ని నాశనం చేసింది. పైగా మహమ్మారి మొదటి, రెండు, మూడు దశలు అంటూ దాడి చేస్తూనే ఉంది. దీనికి ముగింపు ఎప్పుడో తెలియడం లేదు.. ఇదే  భయం ప్రతి ఒక్కరిలో మొదలై వైరాగ్యం అలుముకోవడానికి కారణమైంది.

 

గుంటూరు(తూర్పు), జనవరి22: మనుషుల్లో వైరాగ్యం అనే భావన కొవిడ్‌ తొలిదశ కంటే రెండో దశలోనే ఎక్కువైంది. దీనికి కారణం అధిక ప్రాణనష్టమే. ఈ సమయంలో చాలామంది కుటుంబసభ్యులను, స్నేహితులను, ఆప్తులను కోల్పోయారు. దీనిని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. శ్మశానాలు నిండిపోతున్నాయనే వార్తలు మరింత కుంగదీశాయి.  ఎంత జాగ్రత్తగా ఉన్న మృత్యువు ఎటువైపు నుంచి వస్తుందో అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో అలుముకుంది. దీంతో వైర్యాగం, భవిష్యత్తుపై నిరాసక్తత పెరిగాయి. వీటితోపాటు ఆర్థికపరమైన అంశాలపై దీర్ఘకాలిక ప్రణాళికలు వంటివాటిపైనా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పొదుపు చర్యలు పాటిస్తున్నారు గాని, ముందు తరాలకు కూడా దాచిపెడదాం, భవిష్యత్తు ప్రణాళికలలు రచిద్దాం  అనే ఆలోచనలను కొంత పక్కనబెడుతున్నారు. వ్యక్తుల కాన్ఫిడెన్స్‌ స్థాయిపై ఆర్బీఐ తాజాగా ఇచ్చిన నివేదికలో ఇదే విషయాన్ని    స్పష్టం చేసింది.

 

ఆర్బీఐ నివేదికలోని అంశాలు..

కొవిడ్‌ మహమ్మారి వల్ల ప్రజల ఆర్థిక స్థితిగతులు, ఉపాధి, ఖర్చు, వ్యక్తుల విశ్వాస స్థాయిలపై ఆర్బీఐ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 


విశ్వాస స్థాయి

కరోనా ప్రారంభమైన 2019 మార్చిలో 100శాతానికి పైగా ఉన్న విశ్వాసం(కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌), ఆ ఏడాది మే నుంచి తగ్గుతూ వచ్చింది. ఇది 2020 మార్చినాటికి 85శాతం, 2020 సెప్టెంబరు నాటికి 50శాతానికి పడిపోయింది. ఆ తరువాత కొద్దిగా కోలుకున్నట్టు కనిపించినా 2021 మే, జూలై నాటికి 45 శాతానికి తగ్గిపోయింది. ఇది అత్యంత క్షీణదశ అని, రానున్న రోజుల్లో దాదాపుగా ఇదే పరిస్థితి ఉంటుందని తన నివేదికలో పేర్కొంది.


సాధారణ ఖర్చులు 

ఖర్చుల విషయానికి వస్తే కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో ప్రజల సాధారణ ఖర్చులు  కూడా తగ్గిపోయాయి. 2020 మార్చి నుంచి ఖర్చుల విషయంలో ప్రభావం చూపడం మొదలైంది. ఆరంభంలో మొత్తం సగటు వ్యయం 20శాతం తగ్గిపోగా, సెప్టెంబరులో సాధారణ స్థితికి చేరుకున్నట్టే కనిపించి మళ్లీ ఒక్కసారిగా తగ్గిపోయింది. 2021 సెప్టెంబరు నాటికి 15శాతం మాత్రమే ఖర్చు పెట్టే శక్తి ప్రజల్లో ఉంది.


ఉపాధిలో క్షీణత

ఉపాధి అంశంలో 2019 నాటికి మెరుగ్గానే ఉన్నప్పటికీ తరువాత నుంచి క్షీణిస్తూ వస్తోంది. 2020 సెప్టెంబరు నాటికి 60శాతం వరకు ఉపాధి రంగంలో నష్టం కలిగింది. ఆ తరువాత కొంత పుంజుకున్నప్పటికీ 2021 మే నాటికి మళ్లీ క్షీణత కనిపించింది. ఇదే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లడానికి ప్రధాన కారణంగా ఆర్బీఐ వివరించింది.


 వాస్తవానికి మనలో చాలామంది కొవిడ్‌ బారిన పడి కోలుకున్నారు. కానీ చనిపోయిన వారి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండిపోయాం. దీని నుంచి బయటపడాలంటే  అంతా మంచే జరుగుతుంది అనే పాజిటివ్‌ దృక్పఽథాన్ని  అలవరుచుకోవాలి. ఒకోసారి చిన్నచిన్న విజయాలు కూడా ఉత్సాహాన్నిస్తాయి. అటువంటి వాటిపై కూడా దృష్టి సారించాలి. మనకు కనిపించే ప్రతి వ్యక్తి, మనకు జరిగే ప్రతి సంఘటన, తారసపడే ప్రతి అవకాశం మనకేదో చెప్పాలని వస్తాయి. వాటిని మనం ఎలా స్వీకరిస్తే అలా ఉపయోగపడతాయి. అవి మంచికోసమే, విలువను పెంచడానికే వచ్చాయని అనుకోవాలి. సోషల్‌ మీడియాలో వచ్చే ప్రతికూల వార్తలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. అప్పుడే మూడోదశను కూడా సమర్ధంగా ఎదుర్కొంటాం.


 కొవిడ్‌ విజేతల కఽథలు వినాలి..

గతంలో కరోనా బారినపడి దానిని జయించిన వ్యక్తులు, సామాన్యులు అనేకమంది ఉన్నారు. వీరిలో వందేళ్లకు పైబడిన వృద్ధులు కూడా ఉన్నారు. చాలామంది ఉపాధి కోల్పోయిన వారు తిరిగి కొత్త మార్గాలను అన్వేషించి విజయం సాధించారు. డిప్రెషన్‌ నుంచి బయటపడాలంటే వారి గురించి తెలుసుకోవాలి. తెలుసుకుని వదిలివేయకుండా వాటిని ఆచరణలో పెట్టేందుకు కార్యచరణ రూపొందించాలి.  


  వ్యాయామమే మందు..

కొవిడ్‌ సమయంలో చాలామంది కుంగిపోయారు. మరికొంత మంది మద్యం ఇతర మత్తు పదార్ధాలకు బానిసలయ్యారు. ఈ నేపఽథ్యంలో బ్రిటన్‌లోని లవ్‌బోర్‌ విశ్వవిద్యాలయం దాదాపు 60 మందిని ఎంచుకుని పరిశోధనలు చేశారు. అనంతరం వీరికి వ్యాయామంపై ఆసక్తి పెంచారు. ఆ తరువాత గతం తాలుకా వ్యసనాలు, డిప్రెషన్‌ మూడ్‌ను వదిలివేశారని గమనించారు. వ్యాయామంతో మెదడులో సంతోషంతో ముడిపడే డోపమైన్‌, సెరోటోనిన్‌, ఎండార్ఫిన్‌ వంటి న్యూరో ట్రాన్స్‌మీటర్లు స్థాయి పెరుగుతుంది. మద్యం తరహాలో ఇవి కూడా శరీరంలో ఉత్సుకతను కల్పిస్తాయని తన నివేదికలో వెల్లడించింది. 


విశ్వాసం తగ్గితే ప్రమాదమే..

 విశ్వాసం, భవిష్యత్తుపై ఆశ కోల్పోవడం తొలిసారిగా గుర్తించాం. ప్రజల్లో వీటిని పునరుద్ధరించి తిరిగి వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఆయా ప్రభుత్వాలు కొంత చొరవ చూపాలి. ఇటువంటి నిర్లిప్తత ఏర్పడితే సమాజానికి అత్యంత ప్రమాదకరం. భవిష్యత్తుపై ఆశలు, కొత్త ఆలోచనలు, చిన్న చిన్న ఆనందాలు, సమాజం పట్ల బాధ్యత వంటివి ఉన్నప్పుడే వ్యవస్థలు ఆర్థికంగా, సామాజికంగా పురోగమిస్తుంది అని ఆర్బీఐ తన నివేదికలో ముగింపు అంశంగా పేర్కొంది. 

 


కొత్త ఆలోచనలకు మార్గం వేసుకునే సమయం..

కొవిడ్‌ వైరస్‌ సృష్టించిన విధ్వంసం, దాని వల్ల జరిగిన నష్టాలు చరిత్రలో ఎప్పటికీ ఉంటాయి. అదృష్టమో, దురదృష్టమో కాని దానికి అందరం సాక్షులుగా ఉన్నాం. దీని తాలుకా భయాలను పోగొట్టే బాధ్యత కూడా మనదే. కరోనా కంటే.. దాని గురించి జరిగిన ప్రచారం ఎక్కువుగా ఆందోళనకు గురిచేసింది. వీటన్నిటి నుంచి సాధ్యమైనంత వరకు బయటపడాలి. ప్రతి ఒక్కరూ యోగా, వ్యాయామం వంటి వాటిపై దృష్టిపెట్టాలి. అంతేగాక చిన్న చిన్న ఆనందాలను కూడా గొప్పగా భావించాలి. కొత్త ఆలోచనలకు మార్గం వేసుకునే సమయంగా భావించి ముందుకు సాగాలి.

 - డాక్టర్‌ మురళీకృష్ణ, విశ్రాంత మానసిక వైద్య నిపుణుడు,   జీజీహెచ్‌ 


Updated Date - 2022-01-23T05:28:32+05:30 IST