Sep 18 2021 @ 21:36PM

‘గల్లీ రౌడీ’.. నవ్విస్తాడు!

కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత.. థియేట‌ర్స్‌లో చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే సాలిడ్ హిట్ మాత్రం సెకండ్ వేవ్ తర్వాత పడలేదనే చెప్పుకోవాలి. ‘రాజ రాజ చోర’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి చిత్రాలు హిట్ టాక్‌ని సొంతం చేసుకున్నా.. కలెక్షన్ల పరంగా మాత్రం నిర్మాతలు సంతృప్తి చెందినట్లుగా అయితే టాక్ రాలేదు. రీసెంట్‌గా విడుదలైన గోపీచంద్ చిత్రానికి కాస్త కలెక్షన్లు పర్లేదు అనేలా నిర్మాతలు ప్రకటించారు. ఇక ఈ శుక్రవారం (సెప్టెంబర్ 17) థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ‘గల్లీ రౌడీ’ చిత్రం కూడా ఒకటి. ఈ చిత్రం విడుదలైన తర్వాత టాక్ కొంచెం తేడాగా ఉన్నా.. సినిమాకు కలెక్షన్లు మాత్రం బాగున్నట్లుగా తెలుస్తోంది. 


కథ విషయానికి వస్తే.. విశాఖలో ఒకప్పటి పెద్ద రౌడీ అయిన సింహాచలం.. తన మనవడైన సందీప్ కిషన్‌ని పెద్ద రౌడీగా తయారు చేసి, తన పగ తీర్చుకోవాలనుకుంటాడు. కానీ రౌడీయిజం అంటేనే పడని హీరో.. తన తాత కోరికను ఏ విధంగా తీర్చాడు అనేదే మెయిన్ కథాంశం. దీనికి లవ్ ట్రాక్ యాడ్ చేసి.. కామెడీతో అందరినీ నవ్వించాలని మేకర్స్ ప్రయత్నం చేశారు. ‘గల్లీ రౌడీ’ టైటిల్‌కే మాస్ కానీ.. సినిమా అంతా నవ్వులే నవ్వులు. కోన వెంకట్ టచ్ ఉంటే కామెడీకి లోటుండదు. ఆ విషయం ఆయన సినిమాలెన్నో చెప్పాయి. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెద్ద పీట వేసే జి. నాగేశ్వరరెడ్డి టచ్ కూడా ఈ సినిమాలో కనబడింది. వీరిద్దరూ ఈ సినిమాని కామెడీ కోణంలో ప్రేక్షకులకు దగ్గర చేయాలని చూశారు. ఈ కోణంలో చాలా వరకు వారు సక్సెస్ అయ్యారు కానీ.. కథే కాస్త రొటీన్ అనిపిస్తుంది. కామెడీ సన్నివేశాలు, ఇంటర్వెల్ సీన్, సందీప్ కిషన్-రాజేంద్రప్రసాద్‌ల నటన ఈ చిత్రానికి ప్రధాన బలం. టైటిల్ చూసి భారీగా ఊహించుకుంటే డిజప్పాయింట్ అవుతారు కానీ సినిమాలో నవ్వులకైతే లోటుండదు.