సునీలే హత్య చేసి ఉంటాడు

ABN , First Publish Date - 2022-02-28T08:13:16+05:30 IST

సునీలే హత్య చేసి ఉంటాడు

సునీలే హత్య చేసి ఉంటాడు

వివేకాతో కలసి ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌, ఎర్రగంగిరెడ్డి వజ్రాల స్మగ్లింగ్‌ వ్యాపారం 

స్మగ్లింగ్‌ డబ్బు పంపకాల్లో మనస్పర్థలు 

సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఇనయతుల్లా ఆరోపణలు 


కడప, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ‘‘వివేకానందరెడ్డి మరణానికి ఏడాది ముందు జగదీశ్వర్‌రెడ్డి ద్వారా సునీల్‌ యాదవ్‌ పరిచయమయ్యాడు. సునీల్‌, ఉమాశంకర్‌రెడ్డి, ఎర్రగంగిరెడ్డిలు వివేకాతో కలసి వజ్రాల స్మగ్లింగ్‌ చేసేవారు. స్మగ్లింగ్‌ డబ్బు పంపకాల్లో వివేకా పలుమార్లు వారిపై కోప్పడిన సందర్భాలున్నాయి. ఈ కారణంగానే సునీల్‌యాదవ్‌ వివేకాను హత్య చేసి ఉంటాడని నా అనుమానం’’ అంటూ వివేకా కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనయతుల్లా గత సెప్టెంబరు 28న సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన ఆరోపణలు చేశారు. ‘‘బెంగుళూరు నుంచి వజ్రాల స్మగ్లింగ్‌ వ్యాపారం కోసం వివేకా కారును, డ్రైవర్‌ దస్తగిరిని వినియోగించుకున్నారు. హత్యకు ఏడాది ముందు సునీల్‌యాదవ్‌ రహస్యంగా వివేకాతో చర్చించడం చూశాను. స్మగ్లింగ్‌ ద్వారా వచ్చిన డబ్బు పంపకాల్లో వారి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు తెలిసింది. వివేకా హత్యానంతరం సిట్‌ అధికారుల ముందు నాతో పాటు సునీల్‌ కూడా హాజరయ్యాడు. డబ్బు కట్టల మధ్య నిలబడి సునీల్‌ సెల్ఫీ తీసుకున్న ఫొటోను పోలీసులు గుర్తించారు. అదే ఫొటోలో మొహానికి కర్చీఫ్‌ కట్టుకున్న మరో వ్యక్తి ఉండటంతో సిట్‌ అధికారులు ప్రశ్నించారు. ఆయన బెంగుళూరుకు చెందిన వ్యక్తి అని సునీల్‌ చెప్పాడు. అయితే వివేకా హత్య జరిగిన ఆరు రోజుల ముందు 2019 మార్చి 9న ముఖానికి కర్చీఫ్‌ కట్టుకున్న ఆ వ్యక్తి పులివెందులకు వచ్చి వెళ్లినట్లు సిట్‌ అధికారుల వద్ద సునీల్‌ వెల్లడించినట్లు విన్నాను. తనకు రావాల్సిన డబ్బు కోసం సునీల్‌పై వివేకా ఒత్తిడి తెచ్చారు. అక్రమ వ్యాపారంలో వచ్చిన డబ్బు పంపకాల్లో తేడాలే హత్యకు కారణమని భావిస్తున్నా’ అని ఇనయతుల్లా తెలిపారు. అదే క్రమంలో షేక్‌ షమీమ్‌ ఇంటి నిర్మాణం పనులు వివేకా చూశారని, ఆయన వ్యవసాయ మంత్రి అయ్యాక ఆ విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలుసని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, వివేకా మధ్య ఆర్థిక గొడవలు ఏమీ లేవని, ప్రజాసేవ కోసం జేబులో డబ్బు ఖర్చు చేయడం వల్ల కొంత అప్పులు చేశారని, బెంగుళూరులో ఉన్న ఓ ఆస్తిని విక్రయించి దాదాపు రూ.17 లక్షలు పులివెందుల సీఎ్‌సఐ చర్చికి విరాళంగా ఇచ్చారని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఇనయతుల్లా వెల్లడించాడు. 

Updated Date - 2022-02-28T08:13:16+05:30 IST