అధిష్ఠానం వద్దకు సునీత, ఆనంద్‌ పంచాయితీ!

ABN , First Publish Date - 2022-07-15T09:46:43+05:30 IST

వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీత మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ పంచాయితీ చివరకు అధిష్ఠానం వద్దకు చేరింది.

అధిష్ఠానం వద్దకు సునీత, ఆనంద్‌ పంచాయితీ!

మీడియాకు ఎక్కొద్దన్న కేటీఆర్‌.. వర్షాలు తగ్గాక అధిష్ఠానం పిలుపు? 

హైదరాబాద్‌/వికారాబాద్‌/తాండూరు, జూలై 14 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీత మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ పంచాయితీ చివరకు అధిష్ఠానం వద్దకు చేరింది. బుధవారం మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు సునీత వెళ్తుండగా.. ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వలేదంటూ ఆయన వర్గీయులు అడ్డుకుని ఆందోళనకు దిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం సునీత, ఆనంద్‌లు మీడియా ముందుకు వచ్చేందుకు సిద్ధపడగా.. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఇరువురితో వేర్వేరుగా ఫోన్‌లో మాట్లాడారు. విభేదాలతో రచ్చకెక్కవద్దని ఆయన సూచించడంతో ఇరువురూ ప్రెస్‌మీట్లను రద్దు చేసుకున్నారు. కాగా, ఇరువురు నేతల విభేదాలు, వివాదాల నేపథ్యంలో అధిష్ఠానం ఇప్పటికే పూర్తి నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. దీంతో వర్షాలు, వరదల తీవ్రత తగ్గిన తర్వాత నాయకులిద్దరినీ పిలిచి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఎమ్మెల్యే ఆనంద్‌ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం పని చేస్తున్న తమకు అండగా ఉంటానని, తమ కోసం ఎంతవరకైనా వెళ్తాననే భరోసా ఎమ్మెల్యే ఇచ్చారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మరోవైపు, హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతను ఆమె మద్దతుదారులు కలిసి తమ సంఘీభావం తెలిపారు. 


చైర్‌ పర్సన్‌పై దాడి హేయం : సత్యనారాయణ రెడ్డి

వికారాబాద్‌ జిల్లాలో ప్రోటోకాల్‌ పేరుతో జడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీతారెడ్డిని అడ్డుకోవడమే కాకుండా రాళ్లతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ ఘటనను స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులంతా ఖండించాలని కోరారు. మహిళ అనే గౌరవం కూడా ఇవ్వకుండా జడ్పీ చైర్‌పర్సన్‌ పట్ల అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుచితంగా వ్యవహరించారని కాంగ్రెస్‌, బీజేపీ నేతలు గడ్డం ప్రసాద్‌ కు మార్‌, డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌లు పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-15T09:46:43+05:30 IST