ఎండ..వాన

ABN , First Publish Date - 2021-04-15T08:57:13+05:30 IST

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండ. కొన్నిచోట్ల వడగాడ్పులు. సాయంత్రం ఈదురుగాలులతో వాన. రాత్రికి గాలి బిగదీసి ఉక్కపోత! ఇదీ రాష్ట్రవ్యాప్తంగా బుధ వారం వాతావరణ పరిస్థితి.

ఎండ..వాన

ఉక్కపోత..ఈదురుగాలులు

నేడు, రేపూ ఇదే వాతావరణం

 గాలులకు దెబ్బతిన్న మామిడి తోటలు

నేలకూలిన 25 విద్యుత్‌ స్తంభాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండ. కొన్నిచోట్ల వడగాడ్పులు. సాయంత్రం ఈదురుగాలులతో వాన. రాత్రికి గాలి బిగదీసి ఉక్కపోత! ఇదీ రాష్ట్రవ్యాప్తంగా బుధ వారం వాతావరణ పరిస్థితి. ఓవైపు ఉపరితల ఆవర్తనం, మరోవైపు ఉపరితల ద్రోణి. సముద్రం మీదుగా దక్షిణ, ఆగ్నేయ గాలులు.. వీటి ప్రభావాలతో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 38-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా, కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల ఈదురుగాలులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.


గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచిన గాలులకు మామిడి పంటకు నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. 30 ప్రాంతాల్లో 6మి.మీ. కంటే అధికంగా వర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లా రంగాపురం 31.5, అడ్డతీగల 29, వెల్దుర్తి 28.5, పాడేరు 28 మి.మీ. వర్షపాతం నమోదైంది.  కొమెరిన్‌ పరిసర ప్రాంతాల మీద ఉపరితల ఆవర్తనం ఏర్పడగా, ఉప హిమాలయాలు, పశ్చిమబెంగాల్‌, సిక్కింనుంచి జార్ఖండ్‌, దక్షిణ ఒడిసా మీదుగా ఛత్తీస్‌గఢ్‌ వరకు ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 30-40 కి.మీ. వేగంతో గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.


కాగా, రానున్న 48 గంటల్లో తూర్పుగోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. వేసవి తీవ్రత పెరగడం, సముద్రం నుంచి తేమగాలులతో వర్షాలు కురుస్తుంటాయని, వీటిని ప్రీమాన్‌సూన్‌ వర్షాలుగా పరిగణిస్తామని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఎండతీవ్రత పెరిగే కొద్దీ ఉరుములతో వర్షాలు, ఈదురుగాలుల జోరు మరింత పెరుగుతుందన్నారు. 


బోరబందలో వడగళ్ల వాన

విజయనగరం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఈదురుగాలులకు మామిడి, అరటి, నువ్వులు, బొప్పాయి, పువ్వుల పంటలకు నష్టం వాటిల్లింది. వివిధ మండలాల్లో 25 విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయని ఎస్‌ఈ విష్ణు తెలిపారు. సాలూరు మండలం బోరబందలో వడగళ్ల వాన కురిసింది. శ్రీకాకుళం జిల్లా భామిని మండలంలో కుండపోత వర్షం కురిసింది. ఈదురుగాలులకు అనంతగిరి, తివ్వకొండ తదితర ప్రాంతాల్లో మామిడి, జీడిమామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.  

Updated Date - 2021-04-15T08:57:13+05:30 IST