రైజర్స్‌ అదరగొట్టారు

ABN , First Publish Date - 2020-10-03T09:12:56+05:30 IST

ఆలస్యంగానైనా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటతీరు గాడిలో పడింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనను కనబరిచి చెన్నై సూపర్‌ కింగ్స్‌పై

రైజర్స్‌ అదరగొట్టారు

చెన్నైపై విజయం

రాణించిన ప్రియమ్‌, అభిషేక్‌

బౌలర్ల హవా


వావ్‌.. సన్‌రైజర్స్‌. 69 పరుగులకే వార్నర్‌, బెయిర్‌స్టో, మనీశ్‌ పాండే, విలియమ్సన్‌ అవుటైన వేళ.. 150 పరుగులే అసాధ్యమనిపించింది.. కానీ మిడిలార్డర్‌ బలహీనతను అధిగమిస్తూ.. అందివచ్చిన అవకాశాన్ని సొంతం చేసుకుంటూ యువ ఆటగాళ్లు ప్రియమ్‌ గార్గ్‌, అభిషేక్‌ వర్మ రెచ్చిపోయారు. దీంతో జట్టు ఏకంగా 164 పరుగులను స్కోరుబోర్డుపై ఉంచి చెన్నైకి సవాల్‌ విసిరింది.. అటు సీఎ్‌సకేకు వారం రోజుల విశ్రాంతి కూడా సరిపోనట్టుంది. ఆరంభం నుంచే తడబడుతూ ఒత్తిడిలో పడిపోయింది. ధోనీ చివరి దాకా ఉన్నా మెరుపులు లేకపోవడంతో ఓటమి చెందాల్సి వచ్చింది.  


దుబాయ్‌: ఆలస్యంగానైనా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటతీరు గాడిలో పడింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనను కనబరిచి చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఏడు పరుగుల తేడాతో నెగ్గింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ప్రియమ్‌ గార్గ్‌ (26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 51 నాటౌట్‌), అభిషేక్‌ శర్మ (31) సత్తా చాటారు. దీపక్‌ చాహర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసి ఓడింది. జడేజా (35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 50), ధోనీ (47 నాటౌట్‌) రాణించారు. నటరాజన్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా గార్గ్‌ నిలిచాడు.

చెన్నై తిప్పలు..: రైజర్స్‌ బౌలర్ల ధాటికి 165 పరుగుల లక్ష్యం చెన్నై సూపర్‌ కింగ్స్‌కు చాలా కష్టంగా మారింది. 42 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి ఫలితంపై ఓ అంచనా ఏర్పడేలా చేసింది. దీనికి తోడు మధ్య ఓవర్లలో స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ పరుగు తీసేందుకే వణికేలా చేశాడు. ఆరంభంలోనే వాట్సన్‌ (1)ను భువనేశ్వర్‌ దెబ్బతీయగా ఆరో ఓవర్‌లో రాయుడు (8)ని నటరాజన్‌ బౌల్డ్‌ చేశాడు. ధాటిగా ఆడుతున్న డుప్లెసి (22) కూడా అదే ఓవర్‌లో వివాదాస్పద రీతిలో రనౌట్‌ కావడం చెన్నైకి షాక్‌నిచ్చింది. కీపర్‌ బెయిర్‌స్టో గ్లోవ్స్‌ తాకి బెయిల్స్‌ పడ్డాయా లేక బంతి తాకా అనేది చర్చనీయాంశమైంది. చివరికి రీప్లేలో థర్డ్‌ అంపైర్‌ అవుట్‌గా ప్రకటించాడు. 

ఏడో ఓవర్‌లో వచ్చినా..: ఐదో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌గా కెప్టెన్‌ ధోనీ ఏడో ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చాడు. జాదవ్‌ (3) నిరాశపరచడంతో బాధ్యతంతా ధోనీ, జడేజాలపై పడింది. ఐదో వికెట్‌కు వీరు 72 పరుగులు అందించారు. కానీ నిదానమే ప్రధానం అన్నట్టుగా వీరి బ్యాటింగ్‌ సాగింది. చివరి 4 ఓవర్లలో 78 పరుగులు కావాల్సి ఉండగా 17వ ఓవర్‌లో జడ్డూ హ్యాట్రిక్‌ ఫోర్లతో అత్యధికంగా 15 పరుగులు అందించాడు. అలాగే ఓ భారీ సిక్స్‌తో 34 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తిచేసి వెంటనే అవుటయ్యాడు. 19వ ఓవర్‌లో ధోనీ ఓ సిక్సర్‌ సాధించగా సమీకరణం ఆరు బంతుల్లో 28 పరుగులకు మారింది. కానీ చివరి ఓవర్‌లో పూర్తిగా అలిసిపోయినట్టు కనిపించిన ధోనీ భారీ షాట్లు ఆడలేకపోయాడు. ఆఖరి బంతికి కర్రాన్‌ సిక్సర్‌తో మొత్తం 20 పరుగులే వచ్చాయి. 

ఆదిలో తడ‘బ్యాటు’: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రైజర్స్‌ ఆట అనుకున్నట్టుగా సాగలేదు. 69 పరుగులకే టాప్‌-4 ఆటగాళ్లంతా పెవిలియన్‌లో కూర్చోగా.. 14వ ఓవర్‌లో జట్టు తొలి సిక్సర్‌ సాధించింది. ఇక వార్నర్‌ (28) బ్యాటింగ్‌లో మెరుపులే కరువయ్యాయి. తొలి ఓవర్‌లోనే బెయిర్‌స్టోను పేసర్‌ చాహర్‌ డకౌట్‌ చేశాడు. మనీశ్‌ పాండే (29)ని శార్దూల్‌ అవుట్‌ చేయడంతో రెండో వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక 11వ ఓవర్‌లో వార్నర్‌.. పీయూష్‌ వేసిన బంతిని భారీ సిక్సర్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. అదే ఓవర్‌లో విలియమ్సన్‌ (9)ను ధోనీ రనౌట్‌ చేశాడు. 

కుర్రాళ్లు ఆదుకున్నారు..: సీనియర్‌ ఆటగాళ్లు చేతులెత్తేశాక మిడిలార్డర్‌లో సత్తా చూపేందుకు అభిషేక్‌ శర్మ, ప్రియమ్‌ గార్గ్‌కు చక్కటి అవకాశం లభించింది. మొదట నిస్తేజంగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు ఊపును తెస్తూ అభిషేక్‌ 14వ ఓవర్‌లో 4,6 బాదగా.. అటు 17వ ఓవర్‌లో ప్రియమ్‌ 22 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్‌లో అభిషేక్‌ ఇచ్చిన రెండు సులువైన క్యాచ్‌లను ఫీల్డర్లు వదిలినా చివరి బంతికి ధోనీకి చిక్కాడు. ఈ ఇద్దరి మధ్య ఐదో వికెట్‌కు 77 రన్స్‌ రావడం విశేషం. 


అతడి బ్యాటింగ్‌ ‘ప్రియమ్‌’

వార్నర్‌, బెయిర్‌స్టో, మనీశ్‌ పాండే, విలియమ్సన్‌ ఇలా టాప్‌ క్లాస్‌ ఆటగాళ్లు విఫలమైన చోట 19 ఏళ్ల కుర్రాడు ప్రియమ్‌ గార్గ్‌ దుమ్మురేపే ఆటను ప్రదర్శించాడు. భారత అండర్‌-19 కెప్టెన్‌ అయిన గార్గ్‌ను వేలంలో హైదరాబాద్‌ 1.9 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారి ప్రతీ మ్యాచ్‌కు అవకాశం లభించినా ఇప్పటిదాకా తన ఆటేంటో చూపే అవకాశం చిక్కలేదు. అయితే ఈ మ్యాచ్‌లో ఇంకా 8 ఓవర్ల ఆట ఉన్న దశలో క్రీజులోకి అడుగుపెట్టాడు. బాధ్యతంతా అభిషేక్‌తో పాటు తనపైనే ఉండడంతో చెలరేగాడు. ఒత్తిడిని అధిగమిస్తూ క్లాస్‌ ఇన్నింగ్స్‌ను కనబరిచాడు. ముఖ్యంగా సామ్‌ కర్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని 4,4,6,4తో 22 పరుగులు రాబట్టి రైజర్స్‌లో ఆశలు నింపాడు. దీంతో అతను 23 బంతుల్లోనే ఐపీఎల్‌లో తొలి అర్ధసెంచరీ అందుకోవడంతో పాటు జట్టుకు పటిష్ఠ స్కోరును అందించాడు.


స్కోరుబోర్డు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: వార్నర్‌ (సి) డుప్లెసి (బి) చావ్లా 28, బెయిర్‌స్టో (బి) చాహర్‌ 0, మనీశ్‌ పాండే (సి) సామ్‌ కర్రాన్‌ (బి) శార్దూల్‌ 29, విలియమ్సన్‌ (రనౌట్‌/ధోనీ) 9, గార్గ్‌ (నాటౌట్‌) 51, అభిషేక్‌ శర్మ (సి) ధోనీ (బి) చాహర్‌ 31, సమద్‌ (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 164/5; వికెట్ల పతనం: 1-1, 2-47, 3-69, 4-69, 5-146; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-31-2, సామ్‌ కర్రాన్‌ 3-0-37-0, శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-32-1, బ్రావో 4-0-28-0, పీయూష్‌ చావ్లా 3-0-20-1, జడేజా 2-0-16-0.

చెన్నై సూపర్‌కింగ్స్‌: డుప్లెసి (రనౌట్‌/బెయిర్‌స్టో) 22, వాట్సన్‌ (బి) భువనేశ్వర్‌ 1, రాయుడు (బి) నటరాజన్‌ 8, కేదార్‌ జాదవ్‌ (సి) వార్నర్‌ (బి) సమద్‌ 3, ధోనీ (నాటౌట్‌) 47, జడేజా (సి) సమద్‌ (బి) నటరాజన్‌ 50, సామ్‌ కర్రాన్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 157/5; వికెట్ల పతనం: 1-4, 2-26, 3-36, 4-42, 5-114; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3.1-0-20-1, ఖలీల్‌ అహ్మద్‌ 3.5-0-34-0, నటరాజన్‌ 4-0-43-2, అభిషేక్‌ శర్మ 1-0-4-0, రషీద్‌ ఖాన్‌ 4-0-12-0, సమద్‌ 4-0-41-1. 

Updated Date - 2020-10-03T09:12:56+05:30 IST