సగర్వంగా..

ABN , First Publish Date - 2020-11-04T06:36:06+05:30 IST

హ్యాట్రిక్‌ విజయంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ ప్లేఆ్‌ఫ్సలోకి దూసుకెళ్లింది.పటిష్ట బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన ముంబై ఇండియన్స్‌ను ఓ మాదిరి స్కోరుకే

సగర్వంగా..

అసలు సిసలైన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ షోతో మెరిసింది. తద్వారా వరుసగా ఐదోసారి ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకుంది. విజయమే లక్ష్యంగా ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో బరిలోకి దిగిన రైజర్స్‌కు ఎప్పటిలాగే బౌలర్లు అండగా నిలిచారు. క్రమశిక్షణాయుత బౌలింగ్‌తో ముంబై ఇండియన్స్‌ను 150 పరుగుల్లోపే కట్టడి చేశారు. ఆ తర్వాత వార్నర్‌, సాహా జంట ఆహా అనిపించే ఆటతీరుతో వికెట్‌ నష్టపోకుండానే మ్యాచ్‌ను ముగించింది. దీంతో రైజర్స్‌ ఓటమి కోసం ఎదురుచూసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. 


ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్‌ 

ముంబైపై ఘనవిజయం

కోల్‌కతా ఇంటికి



షార్జా: హ్యాట్రిక్‌ విజయంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ ప్లేఆ్‌ఫ్సలోకి దూసుకెళ్లింది.పటిష్ట బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన ముంబై ఇండియన్స్‌ను ఓ మాదిరి స్కోరుకే పరిమితం చేయడంలో బౌలర్లు సందీప్‌ (3/34), నదీమ్‌ (2/19), హోల్డర్‌ (2/25) కీలకంగా వ్యవహరించారు. ఛేదనలో డేవిడ్‌ వార్నర్‌ (58 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 85 నాటౌట్‌), సాహా (45 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 58 నాటౌట్‌) ఫామ్‌ను కొనసాగించడంతో హైదరాబాద్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే కోల్‌కతాతో కలిపి 14 పాయింట్లు సాధించినా సూపర్‌ రన్‌రేట్‌తో రైజర్స్‌ ప్లేఆ్‌ఫ్సలోకి వెళ్లగలిగింది. శుక్రవారం జరిగే ఎలిమినేటర్‌లో ఆర్‌సీబీని ఎదుర్కోనుంది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. పొలార్డ్‌ (41), సూర్యకుమార్‌ యాదవ్‌ (36), ఇషాన్‌ కిషన్‌ (33) రాణించారు. తర్వాత ఛేదనలో హైదరాబాద్‌ 17.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 151 పరుగులు చేసి గెలిచింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా షాబాజ్‌ నదీమ్‌ నిలిచాడు. 


ఓపెనర్ల హవా: ఛేదనను సన్‌రైజర్స్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో ఆరంభించింది. బుమ్రా, బౌల్ట్‌ లేకపోవడంతో ముంబై బౌలింగ్‌ బలహీనంగా మారింది. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకుంటూ ఓపెనర్లు సాహా, వార్నర్‌ బౌండరీలతో పరుగుల పండగ చేసుకున్నారు. రెండో ఓవర్‌లో సాహా 6,4.. మరుసటి ఓవర్‌లో 4,4తో బ్యాట్‌కు పనిచెప్పాడు. ఇక నాలుగో ఓవర్‌లో వార్నర్‌ వరుసగా 4,4,4తో ముంబైపై దాడికి దిగాడు. ఈ జోరుతో పవర్‌ప్లేలోనే స్కోరు 56కి చేరింది. ఆ తర్వాత మధ్య ఓవర్లలో కాస్త దూకుడు తగ్గింది. కానీ లక్ష్యం భారీగా లేకపోవడంతో జట్టు ఇబ్బందిపడలేదు. 12వ ఓవర్‌లో సిక్సర్‌తో వార్నర్‌ 35 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా అదే ఓవర్‌లో సాహా కూడా 34 బంతుల్లో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఆ తర్వాత కూడా ముంబై బౌలర్ల నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకపోవడంతో ఈ జోడీ ఆడుతూ పాడుతూ 17.1 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది.


బౌలర్ల కట్టడి: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు. రైజర్స్‌ బౌలర్ల పదునైన బంతులకు మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌, ఇషాన్‌ కాస్త పోరాడినా ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. అయితే ఆఖర్లో పొలార్డ్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్‌ రోహిత్‌ (4) నిరాశపరిచాడు. డికాక్‌ (25) మాత్రం ధాటిని కనబరుస్తూ.. ఐదో ఓవర్‌లో వరుసగా 4,6,6తో ఊపు మీదున్నట్టు కనిపించాడు. కానీ అదే ఓవర్‌ నాలుగో బంతికి బౌల్డయ్యాడు. ఈ 2 వికెట్లను పేసర్‌ సందీప్‌ పడగొట్టాడు. సూర్యకుమార్‌ మరుసటి ఓవర్‌లో రెండు ఫోర్లు బాదడంతో పవర్‌ప్లేలో జట్టు 48 పరుగులు చేసింది. ఇషాన్‌తో కలిసి అతడు స్కోరును చక్కదిద్దుతున్న సమయంలో 12వ ఓవర్‌లో స్పిన్నర్‌ నదీమ్‌ ఝలక్‌ ఇచ్చాడు. సూర్యకుమార్‌, క్రునాల్‌ (0) వికెట్లను తీశాడు. ఆ వెంటనే సౌరభ్‌ (1)ను రషీద్‌ అవుట్‌ చేయడంతో 82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 15వ ఓవర్‌లో పొలార్డ్‌ ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను రషీద్‌ అందుకోలేకపోయాడు. మరోవైపు సందీప్‌ తన రెండో స్పెల్‌లో చెలరేగి ఇషాన్‌ వికెట్‌ను తీశాడు. 19వ ఓవర్‌లో పొలార్డ్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లతో జట్టు అత్యధికంగా 20 పరుగులు రాబట్టింది. చివరి ఓవర్‌లోనూ అతడు సిక్సర్‌ బాదినా మూడో బంతికే హోల్డర్‌ చేతిలో బౌల్డ్‌ కావడంతో స్కోరు 150లోపే ముగిసింది.


రోహిత్‌ ఆడాడు..

నాలుగు మ్యాచ్‌ల తర్వాత ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎందుకంటే.. తొడ కండరాల గాయంతో బాధపడుతున్నందుకు అతడిని సెలెక్టర్లు ఆస్ట్రేలియా పర్యటనలో ఏ ఫార్మాట్‌కూ ఎంపిక చేయలేదు. మరోసారి గాయపడితే ఎక్కువ ప్రమాదమని డాక్టర్లు నివేదిక అందించారు. అయితే జట్టు ప్రకటించిన వారంరోజుల్లోపే కోలుకుని ఏకంగా ఓపెనర్‌గా రోహిత్‌ రావడం అందరినీ అయోమయంలో పడేసింది.  అయితే ఎక్కువసేపు క్రీజులో నిలవకుండా మూడో ఓవర్‌లోనే పేలవషాట్‌కు వెనుదిరిగాడు.  


 పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు (53) తీసిన బౌలర్‌గా సందీప్‌ శర్మ. జహీర్‌ ఖాన్‌ (52)ను అధిగమించాడు.


ఐపీఎల్‌లో అత్యధికసార్లు (6) 500+ పరుగులు సాధించిన ఆటగాడిగా డేవిడ్‌ వార్నర్‌.. కోహ్లీ (5)ని దాటేశాడు.


స్కోరు బోర్డు

ముంబై: రోహిత్‌ శర్మ (సి) వార్నర్‌ (బి) సందీప్‌ శర్మ 4; డికాక్‌ (బి) సందీప్‌ శర్మ 25; సూర్యకుమార్‌ (స్టంప్‌) సాహా (బి) నదీమ్‌ 36; ఇషాన్‌ (బి) సందీప్‌ శర్మ 33; క్రునాల్‌ (సి) విలియమ్సన్‌ (బి) నదీమ్‌ 0; సౌరభ్‌ తివారి (సి) సాహా (బి) రషీద్‌ 1; పొలార్డ్‌ (బి) హోల్డర్‌ 41; కల్టర్‌నైల్‌ (సి) గార్గ్‌ (బి) హోల్డర్‌ 1; ప్యాటిన్సన్‌ (నాటౌట్‌) 4; ధవల్‌ కులకర్ణి (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 20 ఓవర్లలో 149/8. వికెట్ల పతనం: 1-12, 2-39, 3-81, 4-81, 5-82, 6-115, 7-116, 8-145. బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4-0-34-3; హోల్డర్‌ 4-0-25-2; నదీమ్‌ 4-0-19-2; నటరాజన్‌ 4-0-38-0; రషీద్‌ 4-0-32-1.


హైదరాబాద్‌: డేవిడ్‌ వార్నర్‌ (నాటౌట్‌) 85; వృద్ధిమాన్‌ సాహా (నాటౌట్‌) 58; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 17.1 ఓవర్లలో 151/0; బౌలింగ్‌: ధవల్‌ కులకర్ణి 3-0-22-0; కల్టర్‌నైల్‌ 4-0-27-0; ప్యాటిన్సన్‌ 3-0-29-0; రాహుల్‌ చాహర్‌ 4-0-36-0; క్రునాల్‌ పాండ్యా 3.1-0-37-0. 

Updated Date - 2020-11-04T06:36:06+05:30 IST