సూపర్‌ బగ్స్‌ చంపేస్తున్నాయ్‌!

ABN , First Publish Date - 2022-01-21T08:03:30+05:30 IST

: ప్రపంచమంతా ఇప్పుడు కొవిడ్‌ మరణాల గురించే చర్చ జరుగుతోంది! కానీ.. విచ్చలవిడి యాంటీబయాటిక్‌, యాంటీఫంగల్‌ మందుల వాడకం వల్ల పలు బ్యాక్టీరియాలు, వైర్‌సలు వాటికి నిరోధకతను..

సూపర్‌ బగ్స్‌ చంపేస్తున్నాయ్‌!

యాంటీ బయాటిక్స్‌కు నిరోధకత

సంతరించుకుంటున్న మొండి సూక్ష్మజీవులు

ఏటా ఎయిడ్స్‌, మలేరియా మరణాల కన్నా

వీటి కారణంగా మరణాలే ఎక్కువ

2019లో సూపర్‌బగ్స్‌తో 13 లక్షల మరణాలు

ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ, ఐహెచ్‌ఎంఈ అధ్యయనం

కొత్త యాంటీబయాటిక్స్‌ ఏవంటూ ఆందోళన


న్యూఢిల్లీ, జనవరి 20: ప్రపంచమంతా ఇప్పుడు కొవిడ్‌ మరణాల గురించే చర్చ జరుగుతోంది! కానీ.. విచ్చలవిడి యాంటీబయాటిక్‌, యాంటీఫంగల్‌ మందుల వాడకం వల్ల పలు బ్యాక్టీరియాలు, వైర్‌సలు వాటికి నిరోధకతను సంతరించుకోవడం వల్ల ఆ మందులు పనిచేయక ఏటా ప్రపంచవ్యాప్తంగా 13 లక్షల మంది చనిపోతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. హైచ్‌ఐవీ, మలేరియా వల్ల ఏటా చనిపోయేవారి సంఖ్య కన్నా ఈ సంఖ్యే ఎక్కువ. యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ (ఐహెచ్‌ఎంఈ) పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా 204 దేశాలు/ప్రాంతాలకు చెందిన 47.1 కోట్ల మంది ఆరోగ్య నివేదికలను పరిశీలించి మరీ రూపొందించిన ఈ అధ్యయన నివేదిక లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. ఏఎంఆర్‌ సమస్య ఆందోళనకరస్థాయిలో పెరుగుతున్నా కొత్త యాంటీబయాటిక్‌ల రూపకల్పనకు పరిశోధనలు సరిగ్గా జరగట్లేదని అధ్యయనకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదాహరణకు.. 1980-2000 సంవత్సరాల మధ్య 63 కొత్త యాంటీబయాటిక్‌ ఔషధాలకు అనుమతులు వచ్చాయి. కానీ, 2000-2018 సంవత్సరాల నడుమ అనుమతి పొందిన యాంటీబయాటిక్‌ మందుల సంఖ్య కేవలం 15. ఈ విషయాలన్నింటినీ అధ్యయనకర్తలు నివేదికలో పొందుపరచారు. యాంటీబయాటిక్‌, యాంటీ ఫంగల్‌, యాంటీవైరల్‌ మందులకు లొంగని మొండి సూక్ష్మజీవులను ‘సూపర్‌బగ్స్‌’గా.. ‘డ్రగ్‌ రెసిస్టెంట్‌ మైక్రోబ్స్‌’గా వ్యవహరిస్తారు. వైద్యులు యాంటీబయాటిక్‌, యాంటీ ఫంగల్‌ ఔషధాలను సిఫారసు చేసినప్పుడు చాలా మంది వాటిని పూర్తి కోర్సు వాడరు. ఉదాహరణకు... యూరిన్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల జ్వరంతో బాధపడే వ్యక్తికి వైద్యుడు యాంటీ బయాటిక్‌ మందులు రాసి వారం రోజులు వాడాలని సిఫారసు చే స్తాడు. కానీ, ఆ మందులు వేసుకోవడం వల్ల 2, 3 రోజుల్లోనే జ్వ రం తగ్గిపోగానే ఆ వ్యక్తి మం దులు వాడడం ఆపేస్తాడు. దీనివల్ల అతడి శరీరంలోని బ్యాక్టీరియా తక్కువ మోతాదులో యాంటీబయాటిక్‌ ఔషధానికి ఎక్స్‌పోజ్‌ అవుతుంది. ఇలాగే ఎ క్కువకాలం జరిగితే ఆ బ్యాక్టీరియాను ఆ ఔషధం ఏమీ  చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీన్నే ‘యాంటీమైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ (ఏఎంఆర్‌)’ అంటారు. ఈ నిరోధకతను సంతరించుకున్న సూక్ష్మజీవుల్లో ముఖ్యమైనవి.. క్లెబ్సియెల్లా న్యూమోనియే(దక్షిణాసియాలో 2019లో ఈ సూపర్‌ బగ్‌ వల్ల నమోదైన మరణాలు61,800), ఈకొలి (63,300 మరణాలు). 


మనదేశంలోనూ..

ఏఎంఆర్‌ ప్రభావం వల్ల ఏటా ఎంతమంది మరణిస్తున్నారనే అంశంపై అధ్యయనం జరగడం ఇదే మొదటిసారి అని భారత వైద్య పరిశోధన మండలికి (ఐసీఎంఆర్‌) చెందిన డాక్టర్‌ కామినివాలియా పేర్కొన్నారు. ఏఎంఆర్‌ ప్రభావం దక్షిణాసియాలో ఆందోళనకరంగా ఉందని కూడా తమ అధ్యయనంలో తేలినట్టు వివరించారు. ఎందుకంటే 2019లో నమోదైన ఏఎంఆర్‌ మరణాల్లో దాదాపు 30ు (3.9 లక్షల మరణాలు) దక్షిణాసియాలో నమోదైనవే! కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో యాంటీబయాటిక్‌ మందుల వినియోగం పెరిగిపోవడంతో ఏఎంఆర్‌ మరణాలు కూడా పెరిగాయని ఈ అధ్యయనం అంచనా వేసింది. ఈ అధ్యయనంలో మనదేశం పాల్గొనకపోయినప్పటికీ.. ఏఎంఆర్‌ సమస్య మనదేశానికి కూడా ఆందోళనకరమైనదేనని గత పరిశోధనల్లో తేలిందని డాక్టర్‌ కామిని వాలియా తెలిపారు. భారత్‌లో ఏఎంఆర్‌ ప్రభావం అంచనా వేయడానికి 50 నుంచి 100 ఆస్పత్రుల నుంచి సమాచారం రావాలని ఆమె పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-21T08:03:30+05:30 IST