సూపర్‌ స్పెషాలిటీ తెలంగాణ

ABN , First Publish Date - 2021-08-02T07:24:51+05:30 IST

హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల సంఖ్య భారీగా పెరగనుంది.

సూపర్‌ స్పెషాలిటీ తెలంగాణ

కొత్తగా పటాన్‌చెరులో మరో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి

గ్రేటర్‌ పరిధిలో ఐదుకు చేరనున్న ఆస్పత్రులు

వీటన్నింటికి ‘టిమ్స్‌’గా నామకరణం

ప్రస్తుతం గ్రేటర్‌లో అన్ని ఆస్పత్రుల్లో 7,319 పడకలు 

సూపర్‌ స్పెషాలిటీలతో కొత్తగా 5 వేలు పెరిగే చాన్స్‌


హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల సంఖ్య భారీగా పెరగనుంది. పటాన్‌చెరులో మరో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని ఆదివారం కేబినెట్‌ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ కూడా మరో వెయ్యి పడకలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, హైదరాబాద్‌ పరిధిలో కొత్తగా ఐదువేల బెడ్లు అందుబాటులోకి వస్తాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో అన్ని సర్కారీ దవాఖానాల్లో 7,310 పడకలు ఉన్నాయి. వీటికి గోల్కొండ, మలక్‌పేట్‌, నాంపల్లి, మల్కాజిగిరి, వనస్థలిపురం ఆస్పత్రుల్లోని పడకలు అదనం. కింగ్‌కోఠీ, కొండాపూర్‌లలో జిల్లా ఆస్పత్రులున్నాయి. వాటి పడకలు కూడా కలిపితే 8,500 బెడ్లు అవుతాయి. హైదరాబాద్‌లో టిమ్స్‌, చెస్ట్‌ ఆస్పత్రి, ఎల్బీ నగర్‌లోని గడ్డిఅన్నారం మార్కెట్‌ వద్ద ఒక ఆస్పత్రి, అల్వాల్‌లలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. వీటిలో టిమ్స్‌ ఆస్పత్రిలో ఇప్పటికే 1200, చెస్ట్‌ ఆస్పత్రిలో 670 పడకలు ఉన్నాయి.


వాటిని అప్‌గ్రేడ్‌ చేయడం వల్ల టిమ్స్‌లో మరో 300 పడకలు వచ్చే అవకాశం ఉంది. చెస్ట్‌ ఆస్పత్రి ప్రాంగణంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించడం వల్ల 1500 పడకలు అందుబాటులోకి వస్తాయి. గడ్డి అన్నారం, అల్వాల్‌ వద్ద కొత్త ఆస్పత్రులను నిర్మిస్తున్నారు. ఈ రెండు ఆస్పత్రుల్లో 2500-3000 పడకలు కొత్తగా అందుబాటులోకి వస్తాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఏడు వైద్యవిద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే ఆస్పత్రుల్లోనూ సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా నాలుగు మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయగా, వాటి అనుబంధ ఆస్పత్రుల్లో ఎక్కడా ఇలా సూపర్‌ స్పెషాలిటీ సేవలను సర్కారు ప్రారంభించలేదు. 


మిగిలిన అన్ని కాలేజీల్లోనూ


రాష్ట్రంలో తొమ్మిది ప్రభుత్వ వైద్యవిద్య కళాశాలలు ఉన్నాయి. కొత్తగా రానున్న వైద్య కళాశాలల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలకు ముఖ్యమంత్రి ఇటీవలే ఆదేశాలివ్వడంతో ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.


అవసరానికి మించి భర్తీకి జీవో జారీ

కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఏడు మెడికల్‌ కాలేజీల్లో ఒక్కో దాంట్లో 1001 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వాస్తవానికి 150 సీట్లతో ప్రారంభించే కాలేజీల్లో 21 మంది ప్రొఫెసర్లు, 38 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 57 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 32 మంది ట్యూటర్లు, 35 మంది సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు ఉంటే సరిపోతుంది. కానీ ప్రభుత్వ మాత్రం కాలేజీలకు అనుబంధంగా ఉండే ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ వైద్యుల భర్తీకి కూడా సిద్ధమైంది.


సూపర్‌ స్పెషాలిటీ సేవలంటే..

సాధారణంగా వైద్యవిద్య కళాశాల అనుబంధ ఆస్పత్రుల్లో బ్రాడ్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి. అంటే జనరల్‌ మెడిసిన్‌, సర్జన్‌, డెంటల్‌, అనస్థీషియా, గైనకాలజీ, ఆప్తమాలజీ, ఈఎన్‌టీ, ఆర్థోపెడిక్స్‌ లాంటివి ఉంటాయి. అయితే కొత్తగా ఏర్పాటు చేయబోయే కాలేజీల అనుబంధ ఆస్పత్రుల్లో నూర్యాలజీ, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్‌ సర్జరీ, యురాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఎండోక్రైనాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ, సిటీ సర్జరీ  వంటి సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

Updated Date - 2021-08-02T07:24:51+05:30 IST