సూపర్‌ థ్రిల్లర్‌ బెంగళూరు విన్నర్‌

ABN , First Publish Date - 2020-09-29T09:06:37+05:30 IST

నికార్సయిన థ్రిల్లర్‌ అంటే ఇదే...ఐపీఎల్‌ తాజా సీజన్‌లో మరో మహాద్భుతమైన సూపర్‌ ఓవర్‌ పోరు.

సూపర్‌ థ్రిల్లర్‌  బెంగళూరు  విన్నర్‌

అదరగొట్టిన డివిల్లీర్స్‌, ఇషాన్‌, పొలార్డ్‌

సూపర్‌ ఓవర్‌లో ముంబై ఓటమి 


 టై అయిన మ్యాచ్‌లో అత్యధిక స్కోరు (201) నమోదవడం ఇదే తొలిసారి.

బుమ్రా వేసిన సూపర్‌ ఓవర్‌లో మ్యాచ్‌ (భారత్‌/ముంబై తరఫున) ఓడడం ఇదే తొలిసారి.

ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు (99) చేసిన మూడో అన్‌క్యా్‌పడ్‌ భారత ఆటగాడిగా ఇషాన్‌ కిషన్‌. గతంలో పాల్‌ వాల్థాటి (120 నాటౌట్‌), మనీశ్‌ పాండే (114 నాటౌట్‌) ఉన్నారు.


 నికార్సయిన థ్రిల్లర్‌ అంటే ఇదే...ఐపీఎల్‌ తాజా సీజన్‌లో మరో మహాద్భుతమైన సూపర్‌ ఓవర్‌ పోరు.  ఇరు జట్లలోని స్టార్‌ హిట్టర్లు బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించారు. 202 పరుగుల భారీ ఛేదన కోసం బరిలోకి దిగిన ముంబై 15వ ఓవర్‌లో కానీ వంద పరుగులు చేయలేకపోయింది. అయినా ఈ దశలో పొలార్డ్‌, ఇషాన్‌ కిషన్‌ ఓవర్‌కు 18 పరుగుల రన్‌రేట్‌తో కదం తొక్కి ఆఖరి బంతికి స్కోరును సమం చేశారు. కానీ సూపర్‌ ఓవర్‌లో తేలిపోయారు. అయితే సాధించాల్సిన 8 పరుగుల కోసం ఆర్‌సీబీది కూడా ఊపిరి బిగపట్టాల్సిన పరిస్థితి.. చివరకు కోహ్లీ బౌండరీతో హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంది.


దుబాయ్‌: పాపం.. ముంబై ఇండియన్స్‌. భారీ ఛేదనలో అసమాన పోరాటాన్ని ప్రదర్శించినా చివరకు సూపర్‌ ఓవర్‌లో దురదృష్టం వెంటాడింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఒత్తిడిని జయిస్తూ విజయం సాధించింది. ముంబై తరఫున యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ (58 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్సర్లతో 99), పొలార్డ్‌ (24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 నాటౌట్‌) వీరోచితంగా పోరాడినా ఫలితం దక్కలేదు.


ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 201 పరుగులు చేసింది. డివిల్లీర్స్‌ (24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 నాటౌట్‌), దేవ్‌దత్‌ (40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54), ఫించ్‌ (35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 52) అర్ధసెంచరీలతో రాణించారు. బౌల్ట్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులే చేసింది. ఉడానకు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా డివిల్లీర్స్‌ నిలిచాడు. 


ఆది నుంచీ తడబడుతూ..:


భారీ ఛేదనలో ముంబై తొలి మూడు ఓవర్లలోనే కెప్టెన్‌ రోహిత్‌ (8), సూర్యకుమార్‌ యాదవ్‌ (0) వికెట్లను కోల్పోయింది. స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ పవర్‌ప్లేలో వేసిన మూడు ఓవర్లలో రోహిత్‌ వికెట్‌తో పాటు ఏడు పరుగులే ఇచ్చాడు. ఇక ఏడో ఓవర్‌లో మరో ఓపెనర్‌ డికాక్‌ (14)ను చాహల్‌ అవుట్‌ చేయడంతో ముంబై పరుగుల కోసం తీవ్రంగా శ్రమిస్తూ తొలి 10 ఓవర్లలో 63 పరుగులే సాధించింది. అటు 11వ ఓవర్‌లో ఇషాన్‌ కిషన్‌ రెండు సిక్సర్లతో స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. కానీ హార్దిక్‌ పాండ్యా (15) భారీ షాట్‌ ఆడే క్రమంలో డీప్‌ మిడ్‌ వికెట్‌లో నేగికి క్యాచ్‌ ఇచ్చాడు. పొలార్డ్‌ బరిలోకి దిగినా కూడా ముంబై విజయం దిశగా సాగలేకపోయింది. 15వ ఓవర్‌లో ఇషాన్‌ ఓ సిక్స్‌, కీరన్‌ ఓ ఫోర్‌ కారణంగా జట్టు వంద పరుగులు దాటింది. పొలార్డ్‌ 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నేగి క్యాచ్‌ వదిలేశాడు.


పొలార్డ్‌ పోరాటం:



చివరి ఐదు ఓవర్లలో ముంబైకి 90 రన్స్‌ కావాలి. ఈ స్థితిలో అప్పటిదాకా నిదానంగా ఆడిన పొలార్డ్‌ 17వ ఓవర్‌లో జూలు విదిల్చాడు. జంపా వేసిన ఈ ఓవర్‌లో 4,6,6తో మొత్తం 27 పరుగులు రాబట్టి ఉత్కంఠ పెంచాడు. 18వ ఓవర్‌లో ఇషాన్‌, పొలార్డ్‌ సిక్సర్లతో లక్ష్యం తగ్గసాగింది. అటు 20 బంతుల్లో పొలార్డ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఇక 6 బంతుల్లో 19 పరుగులు రావాల్సి ఉండగా మూడు, నాలుగు బంతులను ఇషాన్‌ సిక్సర్లుగా బాది ఐదో బంతికి క్యాచ్‌ అవుటయ్యాడు. కానీ ఆఖరి బాల్‌ను పొలార్డ్‌ ఫోర్‌గా మలచడంతో మ్యాచ్‌ టై అయింది.


ఫించ్‌ ఫటాఫట్‌:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఆది నుంచే ఎక్కడా తగ్గలేదు. ఈసారి ఓపెనర్‌ ఫించ్‌ బాధ్యత తీసుకుని స్కోరును కదం తొక్కించాడు. ఎక్కువగా స్ట్రయికింగ్‌ తనే తీసుకుని బౌండరీలతో ముంబైపై ఒత్తిడి పెంచాడు. దీనికి తోడు అతడిచ్చిన క్యాచ్‌లను క్రునాల్‌, రోహిత్‌ మిస్‌ చేశారు. మూడో ఓవర్‌లో సిక్స్‌ బాదిన తను ఆ తర్వాత ఐదో ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లు సాధించాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 59 పరుగులు సాధించింది. ఇదే ఊపులో ఫించ్‌ 31 బంతుల్లోనే ఆర్‌సీబీ తరఫున తొలి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ అతడి జోరుకు తొమ్మిదో ఓవర్‌లో బౌల్ట్‌ బ్రేక్‌ వేయడంతో తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక ఆ తర్వాత నాలుగు ఓవర్లలో ఒక్క ఫోర్‌ కూడా రాలేదు. కోహ్లీ (3) ఈసారీ నిరాశపరిచాడు. అటు ఓపిగ్గా ఆడిన దేవ్‌దత్‌ 14వ ఓవర్‌లో రెండు సిక్సర్లతో స్కోరులో కదలిక తేగా.. 37 బంతుల్లో తన రెండో అర్ధసెంచరీని కూడా సాధించాడు.


ఏబీ బాదుడు:

డెత్‌ ఓవర్లలో ముంబై పూర్తిగా తడబడింది. డివిల్లీర్స్‌ విజృంభణతో చివరి 4 ఓవర్లలోనే ఆర్‌సీబీ 65 పరుగులు పిండుకుంది. ముఖ్యంగా బుమ్రా తాను వేసిన 17, 19వ ఓవర్లలో ఏబీ ధాటికి 35 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లున్నాయి. 18వ ఓవర్‌లో దేవ్‌దత్‌ను బౌల్ట్‌ అవుట్‌ చేసినా శివమ్‌ దూబే (10 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 27 నాటౌ ట్‌) చివరి ఓవర్‌లో 3 సిక్సర్లతో స్కోరును 200 దాటించాడు. ఓవరా   ల్‌గా ఆఖరి ఏడు ఓవర్లలోనే జట్టు 105 రన్స్‌ సాధించింది.


స్కోరు బోర్డు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు: దేవ్‌దత్‌ (సి) పొలార్డ్‌ (బి) బౌల్ట్‌ 54; ఫించ్‌ (సి) పొలార్డ్‌ (బి) బౌల్ట్‌ 52; కోహ్లీ (సి) రోహిత్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 3; డివిల్లీర్స్‌ (నాటౌట్‌) 55; దూబే (నాటౌట్‌) 27; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 201/3. వికెట్ల పతనం: 1-81, 2-92, 3-154. బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-34-2; ప్యాటిన్సన్‌ 4-0-51-0; రాహుల్‌ చాహర్‌ 4-0-31-1; బుమ్రా 4-0-42-0; క్రునాల్‌ పాండ్యా 3-0-23-0; పొలార్డ్‌ 1-0-13-0.


ముంబై ఇండియన్స్‌:

రోహిత్‌ శర్మ (సి) సబ్‌-నేగి (బి) వాషింగ్టన్‌ సుందర్‌ 8; డి కాక్‌ (సి) సబ్‌-నేగి (బి) చాహల్‌ 14; సూర్యకుమార్‌ (సి) డివిల్లీర్స్‌ (బి) ఉడాన (0); ఇషాన్‌ కిషన్‌ (సి) దేవ్‌దత్‌ (బి) ఉడాన 99; హార్దిక్‌ పాండ్యా (సి) సబ్‌-నేగి (బి) జంపా 15;  పొలార్డ్‌ (నాటౌట్‌) 60; క్రునాల్‌ పాండ్యా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 201/5. వికెట్ల పతనం: 1-14, 2-16, 3-39, 4-78, 5-197. బౌలింగ్‌: ఇసురు ఉడాన 4-0-45-2; వాషింగ్టన్‌ సుందర్‌ 4-0-12-1; నవదీప్‌ సైనీ 4-0-43-0; యజ్వేంద్ర చాహల్‌ 4-0-48-1; ఆడమ్‌ జంపా 4-0-53-1.


Updated Date - 2020-09-29T09:06:37+05:30 IST