యంత్రం...నిబంధనల తంత్రం!

ABN , First Publish Date - 2021-09-14T03:56:26+05:30 IST

యంత్రం...నిబంధనల తంత్రం!

యంత్రం...నిబంధనల తంత్రం!
ట్రాక్టర్‌తో దున్నుతున్న రైతు

- ఇప్పటివరకు 197 గ్రూపులకే యంత్రాల సరఫరా

- కొత్త షరతులతో ఆసక్తి చూపని రైతులు 

(ఇచ్ఛాపురం రూరల్‌) 

జిల్లాలో వైఎస్‌ఆర్‌ యంత్ర సేవ పథకం అమలు అంతంత మాత్రంగానే ఉంది. కొత్త నిబంధనలతో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ఏర్పాటు కోసం రైతులు ఆసక్తి చూపడం లేదు. తొలి విడతలో 252 రైతు గ్రూపులకు కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ద్వారా ట్రాక్టర్‌తో నడిచే యంత్రాలు మంజూరు చేయాలని ఉన్నతాధికారులు లక్ష్యం విధించారు. సెప్టెంబరు నెలాఖరులోగా తొలివిడత లక్ష్యం పూర్తి చేయాలని  ప్రణాళికలు రూపొందించారు. సమయం దగ్గర పడుతున్నప్పటికీ... ఇప్పటివరకు 197 రైతు గ్రూపులకు మాత్రమే యంత్ర పరికరాలు సరఫరా చేశారు. మరో 55 గ్రూపులకు పరికరాలు సరఫరా చేయాలని.. వాటిని సరఫరా చేసే సంస్థకు లేఖలు అందజేశారు. మిగతా వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో రైతు గ్రూపులు ముందుకు రాకపోవడం, అందులోనూ సమయం తక్కువగా ఉండటంతో లక్ష్యం నెరవేరడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


నిబంధనల మెలిక 

ఈ ఏడాది ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలు చేయడంతో పథకం  అమలులో ఆటంకాలు ఎదురవుతున్నాయి. గత ఏడాది కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల మంజూరు కోసం రైతులతో గ్రూపులు ఏర్పాటు చేయడంతోనే సరిపెట్టారు. ఒక్క యూనిట్‌ కూడా మంజూరు చేయలేదు. కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లకు ట్రాక్టర్‌ కేటాయించకపోవడంతో రైతులు కూడా ఆసక్తి చూపలేదు. ఈ ఏడాది వైఎస్సార్‌ యంత్ర సేవ పేరుతో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యూనిట్‌ ధరలో 10 శాతం మొత్తాన్ని రైతు గ్రూపు చెల్లించాలి. 40 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. మిగతా 50 శాతాన్ని బ్యాంక్‌ రుణంగా ఇస్తుంది. ఈ ఏడాది రైతులు కట్టాల్సిన 10 శాతంతో పాటు 40 శాతం సబ్సిడీ మొత్తాన్ని ముందస్తుగా రైతు గ్రూపులు చెల్లించాలని మెలిక పెట్టారు. సబ్సిడీ మొత్తం ముందుగా చెల్లిస్తే మళ్లీ రైతు గ్రూపు ఖాతాలోకి జమ చేస్తామని షరతు విధించారు. దీంతో చాలామంది రైతులు 50 శాతం నిధులు చెల్లించలేక వెనక్కి తగ్గారు. 


సందిగ్ధంలో యంత్రాంగం 

జిల్లాలో ఈ ఏడాది 820 కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో తొలివిడత 252 సెంటర్లను సెప్టెంబరులోగా మంజూరు చేయాలని లక్ష్యం విధించారు. మిగిలినవి రెండో విడత అక్టోబరు నుంచి డిసెంబరు నాటికి... మూడో విడత 2022 మార్చిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తొలి విడతలోనే లక్ష్య సాధనలో ఇబ్బందులు తలెత్తడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిబంధనలు సడలించడంతో పాటు రైతు గ్రూపులకు ట్రాక్టర్‌ మంజూరు చేస్తే పథకం లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది. అందరికీ యంత్ర పరికరాలు అందజేయాలని రైతులు కోరుతున్నారు. 

లక్ష్యసాధనకు కృషి  

యంత్ర సేవ పథకం ద్వారా లక్ష్యం మేరకు రైతు గ్రూపులతో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాం. తొలి విడతలో ని ర్దేశించిన గడువులోగా రైతు గ్రూపులకు యంత్ర పరికరాలు సరఫరా చేయాలని క్షేత్రస్థాయిలో అధికారులకు ఆదేశాలు జారీ చేశాం.

- కె.శ్రీధర్‌, జేడీ వ్యవసాయశాఖ, శ్రీకాకుళం

 

Updated Date - 2021-09-14T03:56:26+05:30 IST